నీరుగారిన పాలనా నాణ్యత

0
248
పి. చిదంబరం 
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

భావి పరిస్థితులను ముందుగా ఊహించడం, ఆ పరిస్థితుల నెదుర్కొనేందుకు పటిష్ఠ చర్యలు ప్రణాళికాబద్ధంగా చేపట్టడం, సంబంధిత కార్యకలాపాలకు మార్గదర్శకాలను రూపొందించుకోవడం, ఆర్థిక వనరుల కేటాయింపు, సకల కార్యకలాపాలను సమన్వయ సహకారాలతో అమలుపరచడం పాలన ప్రాథమిక కర్తవ్యాలు. మరి ఈ వ్యవహారాలన్నీ ఇప్పుడు నల్ల బోర్డు -సుద్దముక్క, టైప్ రైటర్, ఐటిఐ తయారు చేసిన నల్ల టెలిఫోన్ల కాలం నాటికి తిరోగమించాయి! తత్ఫలితమే అంతటా అన్నీ కొరత, రుణగ్రస్తత, వ్యాధులు, మరణాలు.

రెండుసంవత్సరాల క్రితం దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీకి రికార్డు స్థాయి మెజారిటీతో మళ్ళీ అధికారాన్ని దత్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండో ప్రభుత్వ మూడో సంవత్సరంలోకి ప్రవేశించనున్నాం. మనం ఎటువంటి పాలన పొందుతున్నాం, దాని పర్యవసానాలు ఎలా ఉన్నాయో సమీక్షించుకోవాల్సిన సందర్భమిది.

దాదాపు 26 కోట్ల కుటుంబాలు ప్రతి రోజు కడుపునిండా తిండి కోసం ఆవురావురుమంటున్నాయి. ఆహార భద్రతే లేనప్పుడు ఆ కుటుంబాల పిల్లలకు ఉద్యోగాలు, మంచి వేతనాలు/ ఆదాయాలు, గృహ వసతి, ఆరోగ్య భద్రత, విద్య మొదలైనవి సవ్యంగా లభిస్తున్నాయని, లభించగలవని చెప్పగలమా? మన దేశంలో ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, పాలు, పండ్లు, కూరగాయలు సమృద్ధంగా ఉత్పత్తవడంతో పాటు మాంసం, చేపలు అపారంగా లభ్యమవుతున్నాయి. ప్రతి ఒక్కరికీ ఆహారం సంపూర్ణంగా అందుబాటులో ఉండాలనేది మన ధ్యేయం. ఈ లక్ష్య పరిపూర్తిలో మనం పురోగతి సాధిస్తున్నామా? సాధిస్తున్నట్టయితే మన పిల్లలు రక్తహీనత, వయస్సుకు అనుగుణంగా ఎదుగుదల లోపం మొదలైన వాటితో ఎందుకు బాధపడుతున్నారు? నాల్గవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-(2015-–16) ప్రకారం 58.6 శాతం మంది బాలలు రక్త హీనతతోనూ, 38.4 శాతం మంది పిల్లలు ఎదుగుదల లోపంతోనూ బాధపడుతున్నారు.

అంతకుముందు అంటే 2005–-06లో నిర్వహించిన మూడవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించిన ఫలితాల కంటే ఇవి మెరుగైనవి. ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-–20 ప్రారంభమయింది, కరోనా మహమ్మారి కారణంగా అది అసంపూర్ణంగా మిగిలిపోయింది. అయితే (అందుబాటులో ఉన్న) 22 రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం ప్రకారం 18 రాష్ట్రాలలో బాలల్లో రక్తహీనత పెరిగింది. 13 రాష్ట్రాలలో ఎదుగుదల లోపానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఇతోధికమయ్యాయి. ఎంత బాధాకరంగా ఉన్నాయి ఈ వాస్తవాలు!

గత మూడు సంవత్సరాలుగా స్థూల దేశీయోత్పత్తి, తలసరి ఆదాయం క్రమంగా తగ్గిపోతున్నాయి ధరలు పెరుగుతున్నాయి. జెండర్ అసమానతలు మరింతగా పెచ్చరిల్లిపోతున్నాయి. కరోనా మహమ్మారితో ఈ పరిస్థితులు మరింత విషమించాయి. నిజానికి 2020 జనవరి 30న కొవిడ్–-19 మొదటికేసు వెలుగులోకిరాక పూర్వమే మన ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారిపోవడం ఆరంభమయింది. ఆర్థిక మాంద్యం మన పాలకుల తప్పిదాల పలితమే. మహమ్మారి ఒక సహజ విపత్తు. అయితే అధికారంలో ఉన్న వారి బాధ్యతారాహిత్యం వల్లే అది మహోగ్రమయింది. ప్రజలను తప్పుపట్టడం అర్థరహితం.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన ఆర్థికవ్యవస్థ పరిస్థితి మరింతగా దిగజారిపోనున్నది. ఉద్యోగాలు భారీగా మటుమాయమవనున్నాయి. పురుషుల కంటే మహిళలు అధిక సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోనున్నారు. తాత్కాలిక ఉద్యోగుల శాశ్వత కష్టాలు ఖాయం. వేతనాలు, ఆదాయాలు తగ్గిపోతాయి. మధ్యతరహా, చిన్నతరహా, సూక్ష్మ పరిశ్రమలు మరింతగా మూతపడతాయి. మళ్ళీ స్వస్థలాలకు వలసలు ముమ్మరమయ్యే అవకాశముంది. మరిన్ని కుటుంబాలు పేదరికం, రుణగ్రస్తతలోకి జారిపోన్నాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ వారు 2019-–20 లేదా 2020–-21లో ఉన్న పరిస్థితుల కంటే 2021-–22లో చాలా ఘోరమైన పరిస్థితుల నెదుర్కోవలసిరావడం అనివార్యంగా కన్పిస్తోంది.

‘2020లో కొవిడ్‌పై యుద్ధంలో మనం విజయం సాధించాము’అని 2021 ఏప్రిల్ 17న నరేంద్ర మోదీ అన్నారు. మరి మరోసారి లాక్‌డౌన్ విధించడం అనివార్యంగా ఎందుకు కన్పిస్తోంది? ఇందుకు బాధ్యతలను రాష్ట్రాలపై మోపారు! రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఒక్కో కార్యకలాపాన్ని క్రమంగా నిలిపివేస్తున్నాయి. మరికొద్దిరోజులలోనే సకల కార్యకలాపాలను నిలిపివేసే అవకాశం ఎంతైనా ఉంది. చూస్తుంటే లాక్‌డౌన్ మన జీవితాలలో అంతర్భాగమై పోయేట్టుగా ఉంది సుమా! ఈలోగా వాక్సిన్లు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, ఐసియు పడకల కొరతతో కొవిడ్ బాధితులు వందల సంఖ్యలో చనిపోతున్నారు. లక్షలాది రోగులకు సరైన వైద్యం అందుబాటులో లేకుండా పోయింది.

ఆర్థిక సంక్షోభాన్ని నివారించడంలోను, మహమ్మారి విపత్తును అదుపు చేయడం లోను ప్రభుత్వం ఘోరంగా విఫలమయింది. అయితే బుకాయింపు, బెదిరింపులతో తనను తాను సమర్థించుకొంటోంది. సామాజిక మాధ్యమాలలో పాలకులకు అనుకూలంగా వ్యవహరించే దళాలకు కొదవేముంది? ప్రజా శ్రేయస్సుకు చిత్తశుద్ధితో కృషి చేసే ప్రభుత్వమయితే మీరు ఈ క్రింద పేర్కొన్న పరిస్థితులను ఊహించగలరా?

కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు తక్షణమే సహాయమందించాలని ముఖ్యమంత్రులు ఫోన్ కాల్ మీద ఫోన్ కాల్ చేస్తున్నా పట్టించుకోకుండా ప్రధానమంత్రి ప్రతిరోజూ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉండడమేమిటి?; వాక్సిన్ల, ఆక్సిజన్ సిలిండర్ల, రెమ్‌డెసివర్, ఐసియు పడకల, సంబంధిత ఔషధాల కొరత ఎంత మాత్రం లేదని పదే పదే ప్రకటిస్తూవచ్చిన ఆరోగ్య మంత్రి అత్యంత కీలక, అవసరమైన సమయంలో ఎవరికీ అందుబాటులో లేకుండా పోవడమేమిటి?; విదేశీ కంపెనీలు ఉత్పత్తిచేస్తున్న వాక్సిన్లను ఆమోదించి, వాటిని దిగుమతి చేసుకోవాలన్న సూచనను ‘విదేశీ ఫార్మాస్యూటికల్ కంపెనీల తరఫున ఇది లాబీయింగ్ కాదా?’ అని అపహసించిన మంత్రి, టీకాలను దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినప్పుడు తన సంస్కారరహిత వ్యాఖ్యకు క్షమాపణలు చెప్పక పోవడం ఎలాంటి సభ్యత?;

కోవిషీల్డ్ వాక్సిన్ ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు రూ.3000 కోట్ల ఆర్థికసహాయమందించాలన్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్ అభ్యర్థనపట్ల ఆర్థికమంత్రి మౌనం వహించడం సబబేనా?; వాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామి అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం కోవిషీల్డ్, కోవాగ్జిన్లను దేశంలోని మరిన్ని కేంద్రాల నుంచి ఉత్పత్తిచేసేందుకు ఎందుకు లైసెన్స్ ఇవ్వడంలేదు?; వాక్సిన్లకు వివిధ ధరలు నిర్ణయించేందుకు ప్రభుత్వం ఎలా అనుమతినిచ్చింది? ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నిర్వహించే వాక్సినేషన్ కార్యక్రమం నుంచి 18-–45 సంవత్సరాల వయస్సు వారిని ఎందుకు మినహాయించారు?; ఒక మహా విపత్తు దేశ ప్రజలను అల్లకల్లోలం చేస్తుండగా అధికార పార్టీ ఎంపీలు మౌనంగా ఎందుకు ఉండిపోతున్నారు? ప్రభుత్వ విధానాలలోని లోపాలు, లొసుగులను ఎత్తి చూపేందుకు ఎందుకు భయపడుతున్నారు?

పాలన ఏమిటి? భావి పరిస్థితులను ముందుగా ఊహించడం, ఆ పరిస్థితుల నెదుర్కొనేందుకు పటిష్ఠ చర్యలు ప్రణాళికాబద్ధంగా చేపట్టడం, సంబంధిత కార్యకలాపాలకు మార్గదర్శకాలను రూపొందించుకోవడం, ఆర్థిక వనరుల కేటాయింపు, సకల కార్యకలాపాలను సమన్వయ సహకారాలతో అమలుపరచడం కాదా? మరి ఈ వ్యవహారాలన్నీ ఇప్పుడు నల్ల బోర్డు -సుద్దముక్క, టైప్‌రైటర్, ఐటిఐ తయారు చేసిన నల్ల టెలిఫోన్ల కాలం నాటికి తిరోగమించాయి! పాలన నాణ్యత పాతాళానికి పతనమయింది. తత్ఫలితమే అంతటా అన్నీ రిక్తీకరణ, రుణగ్రస్తత, వ్యాధులు, మరణాలు. 2019లో మోదీ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారానికి ఎన్నుకున్న ప్రజలు ఈ దౌర్భాగ్యాలకు అర్హులా? ఎంత మాత్రం అర్హులు కారన్నదే నా స్పష్టమైన సమాధానం.

Courtesy Andhrajyothi

Leave a Reply