టైమ్స్ అత్యంత ప్రభావశీలుర జాబితా! ప్రపంచవ్యాప్తంగా వందమందిని ఎంపిక చేస్తే.. మన దేశం నుంచి ముగ్గురు.. వాళ్లలో ఏకైక మహిళ.. కరుణ నంది. నాయకత్వ విభాగంలో వివిధ దేశాల అధ్యక్షుల సరసన నిలిచింది. సుప్రీం కోర్టులో న్యాయవాది అయిన ఈమె.. వారి సరసన నిలబడేలా ఏం సాధించింది?
‘అమ్మాయిలకు అండగా నిలిచే స్థాయికి ఎదగాలి’ చిన్నతనంలో కరుణ కోరిక ఇది! నడిరోడ్డు మీద బహిరంగంగా అమ్మాయిల్ని ఏడిపిస్తున్నా చుట్టూ ఉన్నవాళ్లు చూసీచూడనట్టు వెళ్లిపోవడం ఎన్నోసార్లు చూసింది. ఓసారి స్కూల్లోనూ ఇలాగే జరిగితే ప్రిన్సిపల్ తప్పు చేసినవాళ్లని కాక ఆ అమ్మాయినే దోషి అన్నట్టు మాట్లాడటం ఆమెను నివ్వెరపరిచింది. అందుకే ఈ స్థితిని మార్చే స్థాయికి ఎదగాలనుకుంది. ఒకరికి సాయం చేయాలనే కోరిక మాత్రం అమ్మానాన్నల నుంచే వచ్చిందంటుందీమె. ఈమెది భోపాల్. నాన్న అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో చేసేవారు. మన దేశ ప్రజలకు సేవచేయాలని దిల్లీ ఎయిమ్స్‌కు మారారు. తర్వాత సామాన్యులకు అందుబాటులో ఉండొచ్చని ప్రభుత్వ ఆసుపత్రికి మారారు. అమ్మ ఇంగ్లండ్‌లో చరిత్ర ప్రొఫెసర్. ఎన్నో పురస్కారాలనీ అందుకున్నారు. బంధువుల్లో ఒకరు సెరెబ్రల్ పాల్సీతో బాధ పడటం చూసి ఒక సేవా సంస్థను ప్రారంభించారు.
కరుణ ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తిచేసి, కొన్నాళ్లు పాత్రికేయురాలిగా పనిచేసింది. తర్వాత కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ, కొలంబియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తిచేసింది. అవార్డులతోపాటు హ్యూమన్ రైట్స్ ఫెలోషిప్‌నీ అందుకుంది. చదువుతూనే ఐక్యరాజ్య సమితిలో పనిచేసింది. పూర్తయ్యాక న్యూయార్క్‌లో స్థిరపడే అవకాశమొచ్చినా తిరస్కరించి, దేశానికి తిరిగొచ్చింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తోంది. భోపాల్ గ్యాస్ బాధితులకి స్వచ్ఛమైన తాగునీరు, ఉత్తమ వైద్యసాయం అందేలా పోరాడింది. 2012 నిర్భయ సంఘటన తర్వాత ‘మానభంగ నిరోధక చట్టం’ (యాంటీ రేప్ బిల్) తీసుకురావడంలో ఈమెది ప్రధాన పాత్ర. పనిచేసే చోట లైంగిక వేధింపులు, మారిటల్ రేప్.. వంటివాటిపైనా పనిచేస్తోంది.
‘సినిమా, జర్నలిజం, న్యాయవాద విద్య.. మూడింటికీ దరఖాస్తు చేస్తే లా చదివే అవకాశమొచ్చింది. పూర్తయ్యాక న్యూయార్క్‌లో కొనసాగడమా, దేశానికి తిరిగి రావడమా అంటే రెండో దానికే ఓటేశా. ఎత్తైన భవంతుల్లో కూర్చొని ఎన్నో సంస్థల కోసం పనిచేయడం కంటే భారత్‌లో మానవ హక్కులపై పోరాడాల్సిన అవసరం చాలా ఉందనిపించింది. అందుకే తిరిగొచ్చేశా’ అని చెబుతుందీ 45 ఏళ్ల న్యాయవాది. ఉగ్రవాదులుగా ముద్రపడిన వారు, మానసిక వికలాంగుల హక్కులతోపాటు అంతర్జాతీయంగా లింగ సమానత్వం, మీడియా హక్కులు మొదలైన వాటిపైనా పనిచేస్తోంది. నేపాల్, పాకిస్థాన్, భూటాన్, మాల్దీవుల ప్రభుత్వాలకూ సేవలందించింది. ఈ క్రమంలో ఎన్నో అవార్డులనీ అందుకుంది. ఫోర్బ్స్ ‘సెల్ఫ్ మేడ్ విమెన్ 2020’ జాబితాలో చోటు, ఎకనామిక్ టైమ్స్ వేగంగా ఎదుగుతోన్న మహిళా నాయకురాలిగా పేర్కొనడం వాటిలో కొన్ని. బెదిరింపులకు వెరవకపోవడం, ఎక్కడైనా ధైర్యంగా తన గళాన్ని వినిపించడం ఈమె నైజం. ఈ తీరే.. తనని ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావశీలుర సరసన నిలిపింది.