పెరుగుతున్న మనోవేదన

0
35
  • కొవిడ్‌ తర్వాత పెరుగుతున్న మానసిక సమస్యలు
  • సర్కారీ దవాఖానాల్లో ఓపీకి వచ్చే పెద్దల్లో 53%
  • మంది అలాంటి సమస్యలతో బాధపడుతున్నవారే!
  • 18 ఏళ్ల పైబడ్డవారిలో 10.6% మానసిక సమస్యలు
  • వైద్యశాఖ సర్వేలో వెల్లడి.. చికిత్సపై సర్కారు దృష్టి
  • 405 పీహెచ్‌సీల పరిధిలో 21,942 మంది గుర్తింపు
  • టెస్టుల ద్వారా నిర్ధారణ.. 20190 మందికి ట్రీట్‌మెంట్‌
  • అనుబంధంగా టెలి మానస్‌ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు
  • విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు.. కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌ : రాష్ట్రంలో మానసిక సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. కొవిడ్‌ తర్వాత ఇది ఎక్కువగా ఉన్నట్లు వైద్యశాఖ పరిశీలనలో వెల్లడైంది. సర్కారీ దవాఖానాల్లో నమోదయ్యే జనరల్‌ ఓపీల్లో.. పెద్దల్లో 53 శాతం మంది మానసిక సమస్యలతో బాధపడేవారు వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అలాగే, 18 ఏళ్ల పైబడిన వారిలో 10.6 శాతం మంది మానసికసమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యశాఖ తన సర్వేలో గుర్తించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ 2017లోనే మన రాష్ట్రంలోని 24 జిల్లాల్లో జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆయా జిల్లాల్లోని 405 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 21,942 మంది మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు టెస్టుల ద్వారా నిర్ధారించి.. అందులో 20190 మందికి చికిత్స అందిస్తోంది.

కొవిడ్‌ తర్వాత ఈ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో.. మానసిక వైద్య సేవలపై సర్కారు ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇటువంటి సమస్యలను ముందస్తుగా గుర్తించి, డయాగ్నసిస్‌ చేయాలని నిర్ణయించింది. మానసిక ఆరోగ్య సమస్యలపై పెద్దయెత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహించనుంది. వాటితో బాధపడేవారికి పీహెచ్‌సీల పరిధిలో చికిత్స చేస్తారు. ఇందుకోసం జిల్లా ఆస్పత్రి నుంచి సైకియాట్రిస్టులను సమీప పీహెచ్‌సీలకు పంపుతారు. వారు మైల్డ్‌ కేసులకు అక్కడే చికిత్స చేస్తారు. సమస్య తీవ్రత పెరిగితే వారిని జిల్లా లేదా బోధనాస్పత్రికి తరలించి, ఇన్‌ పేషంట్‌గా చేర్చి.. సైకియాట్రిస్టు ఆధ్వర్యంలోని వైద్య బృందంతో వారికి ట్రీట్మెంట్‌ చేస్తారు.

విద్యార్థులకు..
విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు సమీప పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ పాఠశాలల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి, వారికి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు. విద్యార్ధులకు కౌన్సెలింగ్‌ ఇస్తారు. జిల్లా ఆస్పత్రి నుంచి వచ్చిన సైకియాట్రిస్టు, సైకాలజిస్టు విద్యార్ధులకు అవసరమైన చికిత్స అందిస్తారు. అవసరమైతే వన్‌ టూ వన్‌ కౌన్సెలింగ్‌ ఇస్తారు.

Leave a Reply