అత్యాచారానికి అంగీకారం !

0
643
Sajaya Kakarla
Sajaya Kakarla

ఎ. సునీత
కె. సజయ

గాంధీ ఆస్పత్రిలో కిడ్నీలు పాడయిన రోగికి సహాయకులుగా వచ్చిన ఆయన భార్య, మరదలు ఒక వారం రోజులకు పైగా కన్పించకుండా పోయి, ఆ తర్వాత తమపై ఆసుపత్రి ప్రాంగణంలో లైంగికదాడి జరిగిందని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చిన సంఘటనలో హైదరాబాద్ పోలీసులు అత్యంత వేగంగా విచారణ పూర్తి చేసి ఏ దాడి జరగ లేదని తేల్చేశారు! ఈ పేద మహిళలిద్దరూ కల్లుకు బానిసలయ్యి, దాని కోసం అక్కడ పని చేసే సెక్యూరిటీ గార్డుతో, మరొకరితో స్వచ్ఛందంగా, పూర్తి అంగీకారంతో లైంగిక చర్యకు పాల్పడి, దాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం కుట్ర పూరితంగా తమపై అత్యాచారం జరిగిందని (అబద్ధపు) ఫిర్యాదు చేశారని తీర్పు కూడా చెప్పారు. ఈ సంఘటనలో ఫిర్యాదుదారులను పోలీసులు ఎవరితో, ముఖ్యంగా మహిళాసంఘాల వారితో కలవనీవలేదు. నిజనిర్ధారణ కోసం వెళ్లిన సంధ్య, కృష్ణకుమారి, విజయ, జ్యోతి వంటి సీనియర్ నాయకులను మూడుగంటల పాటు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణ, బహిరంగ ప్రజా (మీడియా) కోర్టులో తీర్పు కేవలం వారం రోజుల్లో జరిగిపోయాయి. నిజనిర్ధారణకు వెళ్లిన బాధ్యత కల్గిన మహిళాసంఘాలను ఈ విధంగా నిర్బంధించడం ఆశ్చర్యం కలిగించే అంశం. దీనిమీద ఏ అధికారి కూడా తగిన వివరణ ఇవ్వలేదు.

1970ల్లో మధ్యప్రదేశ్‌లో ‘మథురా’ అనే 14 ఏళ్ల ఆదివాసీ బాలిక పోలీసుల అదుపులో ఉన్న తన అన్న కోసం భోజనం తీసుకెళితే, ఆ బాలిక మీద ఇద్దరు కానిస్టేబుల్స్ పోలీసుస్టేషన్ బాత్రూమ్‌లో అత్యాచారం చేశారు. ఆ బాలిక బంధువులు, సమూహం బాగా గొడవ చేయడంతో కేసు నమోదయింది. నిందితులకు సెషన్్స్‌ కోర్టు, హై కోర్టులలో శిక్ష పడింది. కానీ సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టేసింది. ఆదివాసీ అమ్మాయిలు పలువురితో సంబంధాలు పెట్టుకుంటారు కాబట్టి పోలీసులతో తనంతట తానే లైంగిక చర్యకు స్వచ్ఛందంగా అంగీకరించిందని, అసలు ఆ అమ్మాయి దీన్ని ప్రతిఘటించిన ఆనవాళ్లు లేవని, ఆ కానిస్టేబుళ్ల శరీరాలపై ఏ రకమైన గాట్లు లేవు కాబట్టి ఆమె దీనికి అంగీకరించిందనే అనుకోవాలని, కాబట్టి వారిద్దరి తప్పేమీ లేదని సుప్రీంకోర్టు 1984లో తీర్పు చెప్పి వారిపై కేసు కొట్టేసి విడుదల చేసింది.

ఈ తీర్పును వ్యతిరేకిస్తూ నలుగురు సీనియర్ న్యాయ వేత్తలు సుప్రీంకోర్టుకు ఒక బహిరంగ లేఖ రాశారు. ‘‘ఒక పక్క అన్న లాకప్‌లో ఉన్నప్పుడు, పోలీసు స్టేషన్లో తుపాకులు పెట్టుకున్న ఇద్దరు బలవంతులయిన కానిస్టేబుళ్ళను, ఏ 14 ఏళ్ల అమ్మాయి ప్రతిఘటించగలుగుతుందో చెప్పాలని, పరిస్థితులు పూర్తి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇచ్చే అంగీకారాన్ని స్వచ్ఛందమయిందని అనుకోవటం అసంబద్ధం, అన్యాయమని’’ వారు ఆ లేఖలో వాదించారు. ఈ కేసు, ఆ లేఖ అప్పట్లో పెద్ద ఉద్యమానికి దారితీయటంతో, అత్యాచార చట్టంలో కస్టోడియల్ అత్యాచారం అనే కొత్త నేరాన్ని ప్రవేశపెట్టి, శిక్షాస్మృతిలో మామూలు అత్యాచారం కంటే ఎక్కువ శిక్ష పెట్టారు.

తమ కస్టడీలో ఉన్న స్త్రీలను రక్షించాల్సిన బాధ్యత తీసుకున్న వాళ్లు పోలీసు స్టేషన్లో, హాస్పిటల్లో, హాస్టల్లో -వారిపై అత్యాచారం చేస్తే దానిని తీవ్రనేరంగా పరిగణిస్తుంది మన నేర విచారణా స్మృతి. తీవ్రమయిన అధికార అసమానత ఉన్న ఇటువంటి సంబంధాలలో ఏ లైంగిక చర్య సంభవించినా అత్యాచారం కిందే పరిగణించబడుతుందని చట్టం స్పష్టంగా పేర్కొంది. గాంధీ  ఆసుపత్రిలో జరిగిన సంఘటనను ఈ నేపథ్యంలో పరిశీలిద్దాం.

సాధారణంగా ఆసుపత్రిలో చూసుకునేవాళ్ళు ఎవరూ లేకుండా ఏ రోగినీ తీసుకోరు. అదీ ఒక్కళ్లనే అనుమతిస్తారు. కానీ ఆ ఒక్కళ్ళు అన్ని విషయాలు చూసుకోలేరు. అందుకే ఊర్ల నుంచి వచ్చే రోగులతోపాటు కుటుంబం మొత్తం రావడం సహజం. నగరంలో ఏమీ తెలియకపోవటం, సహాయం చేయడానికి వ్యవస్థలు అందుబాటులో లేకపోవటం, అతి పేదరికం వల్ల ఏ వనరులు లేకపోవటం వంటి కారణాలతో వాళ్ళు చుట్టుపక్కల ఎవరు మంచిగా మాట్లాడితే వారితో మాటలు కలుపుకుని పనులు జరుపుకోవడం చాలా సాధారణం. ఇతరులు వారి అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని ఆసరాగా తీసుకుని సంబంధాలు పెట్టుకోవడం, మోసాలు చేయడం కూడా మామూలే.

ఎక్కడో దూరం నుంచి వచ్చిన ఈ మహిళలిద్దరు కిడ్నీ పాడయి బాధపడుతున్న రోగిని చూసుకుంటూ, తినటానికి, ఉండడానికి, ఆసుపత్రి ఆవరణలోనో, షెడ్డులోనో తల దాచుకోవటానికి అనేక రకాల ఇబ్బందులు పడి ఉంటారు. ఈ సెక్యూరిటీ గార్డు డబ్బులు తీసుకునో, తీసుకోకుండానో ఎంతో కొంత సహాయం చేసి ఉంటాడు. సెక్యూరిటీ గార్డులు అందరూ చెడ్డవాళ్ళు కాదు. అలాగని అందరూ అమాయకులు కాదు. అవకాశాన్నిబట్టి దోపిడీ చేయడానికి కొంతమంది సిద్ధపడతారు. ఆసుపత్రిలో పరిస్థితులు, ఆయా రోగులను చూసుకునే వాళ్ళ సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఈ అవకాశాన్ని కల్పిస్తాయి. సెక్యూరిటీ గార్డుల అధికారం కూడా ఇందుకు ఉపయోగపడుతుంది.

గ్రామీణ, వెనుకబడిన, పేద సామాజిక, ఆర్థిక నేపథ్యం నుంచి వచ్చిన ఏ స్త్రీ కూడ ఏదో జరగకూడనిది జరగనిదే, తాము అన్యాయమైపోయామన్న గ్రహింపు లేకుండా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి సిద్ధపడదు. తాను దోపిడీకి గురయ్యానని చెప్పడానికి, పోలీసు స్టేషన్‌కి వెళ్ళడానికి, దాని ద్వారా వచ్చే చెడ్డ పేరు తట్టుకోవడానికి ఏ స్త్రీకయినా గుండె నిండా ధైర్యం ఉండాలి. అందులోను ఊరు కాని ఊరిలో, యూనిఫారం వేసుకుని ఒక పెద్ద ఆసుపత్రిలో పని చేసే వ్యక్తిపై ఫిర్యాదు ఇవ్వడానికి మామూలు ధైర్యం సరిపోదు.

ఈ కేసులో అసలు విషయం లైంగిక చర్య జరిగిందా లేదా అని కాదు. జరిగిన వారానికి ఏ వైద్యపరీక్ష లోను ఈ విషయం తెలియదు. ఇటువంటి వాటికి పాల్పడేవాళ్ళు సీసీటీవీకి అందకుండానే చేస్తారు. అసలు విషయం లైంగిక చర్య ఏ పరిస్థితుల్లో జరిగింది, ఎందుకు పోలీసు వ్యవస్థ ఇంత చొరవతో త్వరగా ఈ కేసును, ఈ విధంగా ‘పరిష్కరించామని’ చెప్పడానికి సిద్ధపడింది అని!

ఆసుపత్రిలో పని చేసే సెక్యూరిటీగార్డులు ఆసుపత్రి ఉద్యోగుల కిందికే వస్తారు. వారు గనుక అత్యాచారానికి పాల్పడినట్లు తేలితే అది కస్టోడియల్ రేప్ కిందకు వస్తుంది. అది మొత్తం ఆసుపత్రిని బాధ్యులుగా చేస్తుంది. అందులో ఉన్న సౌకర్యాల గురించి చర్చను ముందుకు తీసుకువస్తుంది. ఇది ఆ బాధితురాళ్ళకు అర్థం అవకపోయి ఉండొచ్చు గానీ, ఆస్పత్రి సిబ్బందికి, ప్రభుత్వ అధికారులకి, పోలీసుఅధికారులకు బాగా తెలిసిన విషయం. ఆ మహిళలు తమంతట తామే దగ్గరికి వచ్చినా సెక్యూరిటీగార్డులు లైంగిక చర్యలకు పాల్పడ కూడదు ఎందుకంటే వారు ఆ మహిళలను రక్షించాల్సిన బాధ్యతలో ఉన్నారు కాబట్టి. అంతేకాదు, మత్తుపదార్థం ప్రభావంలో ఉన్నవారితో లైంగిక చర్యకు పాల్పడితే 2013లో వచ్చిన లైంగిక దాడుల చట్ట సవరణల ప్రకారం ఆ అంగీకారం కూడా చెల్లదు. మత్తుపదార్థం ప్రభావంలో ఉన్న ఏ వ్యక్తికయినా అంగీకారం తెలిపే సామర్థ్యం పూర్తిగా ఉండకపోవడమే దీనికి కారణం.

గాంధీ ఆసుపత్రి బాధితులు ఏ బలం లేని సామాజిక నేపథ్యం నుంచి రావడం వారిని అనుమానించటానికి బాగా ఉపయోగపడింది. జనాభిప్రాయంలో ఇప్పటికీ లైంగిక దాడుల విషయంలో బాధితులదే తప్పు. ఆ మహిళలు ‘తక్కువ’ కులాల వాళ్లయితే వారి నడవడిక, ప్రవర్తన, చరిత్ర, వారి మాటలు మొత్తానికి అన్నిటినీ అనుమానిస్తుంది.

తక్కువ కులం బాధితులు కాబట్టే వారితో ఇప్పటివరకూ పోలీసులు తప్ప ఎవరూ మాట్లాడకపోయినా కేవలం వారు చెప్పిన మాటల ఆధారంగా బాధితుల్ని గేలి చేసి, వారు మత్తుకి బానిసలని ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు ఎవరిమీద ఉందో అతడి మాటల ఆధారంగా, అంతా అంగీకారంతోనే జరిగిందని రాసి ఆ మహిళ ఫిర్యాదుకు సాధికారత లేకుండా చేయడానికి జనాభిప్రాయం ఇదే అని పోలీసులు తమ ప్రెస్‌మీట్లో  ప్రకటించేశారు. అది విన్న ఏ రిపోర్టర్ కూడా ఏ కోశానా  అధికారుల మాటలను ప్రశ్నించలేదు! ఈ సంఘటన మనం 1970ల నుంచి ముందుకెళ్లామా, లేక ‘మహిళలు లైంగికదాడుల విషయంలో అబద్ధాలు చెబుతారు’ అని నమ్మే స్థితిలోనే ఉన్నామా అన్న సందేహం కలిగిస్తోంది.

ఒక పెళ్లి కాని ఆధిపత్య కుల యువతి పైన లైంగిక దాడికి పాల్పడ్డారనే అనుమానంతో నలుగురు యువకుల్ని ఏ విచారణ లేకుండా, ఏ జనాభిప్రాయాన్ని సంతృప్తిపరచటానికి ఎన్‌కౌంటర్ పేరుతో కాల్చిచంపారో, అదే ప్రజాభిప్రాయం కుల వ్యవస్థలో కింది మెట్టు పైన ఉన్న మధ్య వయసు మహిళలను వేలెత్తి చూపుతోంది. వారానికి పైగా ఊరు కానీ ఊరులో కన్పించకుండా పోయి, తమ పైన లైంగికదాడి జరిగిందని ఫిర్యాదు చేస్తే ‘మత్తు మందు కోసం ఎవరితోనయినా ఎక్కడయినా పడుకుని అబద్ధాలు చెప్పే చరిత్రహీనమయిన మనుషులని’ నమ్మి, వారి పైనే బురద జల్లుతోంది. మన సమాజానికి స్త్రీల విలువ మగవాళ్ళ మధ్య మారకంగా తప్ప స్వతంత్రవ్యక్తులుగా కాదని మరొకసారి ఈ సంఘటన రుజువు చేస్తోంది.

పెద్దస్థాయి అధికారులు, రాజకీయనాయకులూ రంగం లోకి దిగింది ఒక సెక్యూరిటీ గార్డుని కాపాడడానికి కాదు. మన కుల, వర్గ వ్యవస్థలో బలం లేని స్త్రీలు తమకు ఇష్టం లేని లైంగిక చర్యలని, తమపై జరిగే దోపిడీని ప్రశ్నించడం మొదలుపెడితే ఏర్పడే ప్రమాదం గుర్తించి ఈ ఆధిపత్య వ్యవస్థని కాపాడుకోవడానికే పూనుకున్నారు. అందులో సఫలీకృతులయ్యారు కూడా! ఇది కస్టడీలో లైంగికదాడి గురించి ఫిర్యాదు చేయాలనుకునే స్త్రీలకు, చేస్తే ఏమి జరుగుతుందో తెలిపే హెచ్చరిక.

లైంగికదాడుల చట్టంలో ఆయా బాధితుల క్యారక్టర్ గురించి ఏమీ కోర్టుల్లో మాట్లాడకూడదని సవరణ తెస్తే మన చట్టపరిరక్షకులు మాత్రం ముందే ప్రెస్‌మీట్లు పెట్టి ఆయా బాధిత మహిళలను సమాజం ముందు దోషులుగా నిలబెడుతున్నారు. మహిళలను నియంత్రిస్తే చాలు లైంగిక అత్యాచారాలు ఉండవని ఇప్పటికీ నమ్మే మన అజ్ఞాన సమాజం నిజమయిన నేర నియంత్రణ కన్నా మహిళలపై ఈ నైతిక నియంత్రణతో సంతృప్తిపడుతోంది. ఈ పరిణామం మహిళలందరికీ, ప్రధానంగా అధికారంలేని కులాల, వర్గాల మహిళలందరికీ అత్యంత ప్రమాదకరమయింది!

Courtesy Andhrajyothi

Leave a Reply