– వ్యవసాయరంగం ప్రయివేటీకరణ…
– అభివద్ధి చెందిన, చెందుతున్న దేశాల అనుభవాలు
న్యూఢిల్లీ : కార్పోరేట్లకు ప్రయోజనం చేకూర్చే నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ మూడు నెలలుగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేపడుతున్నారు. ఈ చట్టాలతో తమ ఉత్పత్తులు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ని కోల్పోతాయని, సాగుకు పెట్టుబడులు పెరిగిపోతాయని, రుణాల ఊబిలో కూరుకుపోతామని వారు డిమాండ్ చేస్తున్నారు. రుణాలు పెరిగితే భూములు కార్పోరేట్లకు అప్పజెప్పాల్సి వస్తుందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భూముల్లోనే తమను రైతు కూలీలుగా మారాల్సి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోడీ ప్రవేశపెట్టిన ఈ సాగు చట్టాలతో వ్యవసాయ రంగం కార్పోరేట ఆధీనంలోకి వెళుతుందని.. దీంతో చిన్న, సన్నకారు రైతులు ఉపాథి కోల్పోతారని.. ఈ ప్రభావం వ్యవసాయ కూలీల మీద కూడా పడుతుందని రైతులు వాదిస్తున్నారు. అభివృద్ధి చెందిన, అభివద్ధి చెందుతున్న దేశాల్లో ఇప్పటికే సరళీకరణ విధానాల పేరుతో ఈ చట్టాలను అమలు చేశారు. అయితే అక్కడ పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయన్నది ఒకసారి పరిశీలిద్దాం..
నాలుగు దశాబ్దాల క్రితమే ఈ చట్టాలను తమ దేశంలో అమలు చేశారంటూ భారత రైతులకు మద్దతు తెలుపుతున్న అమెరికాలోని 87 రైతు సంఘాలు తెలిపాయి. రీగన్ ప్రభుత్వం అప్పటి వరకు ఉన్న మద్దతు ధర లాంటి వ్యవస్థను తీసివేశారని చెప్పారు. రైతులంతా ఏకీకీత విధానంలో మొక్కజన్న, సోయా వంటి మోనో కల్చర్ (ఒకేరకమైన పంట) పంటలను పండించాల్సిందేనని ఆదేశించారు. ఈ విధానాలు భూస్వాములకు మాత్రమే ప్రయోజనం చేకూర్చాయి. అయితే సంప్రదాయ, చిన్న, సన్నకారు రైతులు తమకున్న కొద్ది పాటి భూముల్లో ఈ సాగు చేయలేక ఆదాయాన్ని కోల్పోయారు. దీంతో ఆదాయం కోసం కూలీలుగా మారారు. ఇతర పనులు చేయడం ప్రారంభించారు. దీంతో అమెరికాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆత్మ హత్యల రేటు పట్టణ ప్రాంతాల కన్నా 45 శాతం అధికంగా పెరిగింది.
బ్రిటన్‌లో అత్యధిక జనాభాను వ్యవసాయ రంగం నుండి పారిశ్రామిక రంగంలోకి మళ్లేలా ప్రభుత్వ యంత్రాంగం ప్రోత్సహించింది. ఫలితంగా… 19 శతాబ్దం నుండి ఇప్పటి వరకు బ్రిటన్‌లో గ్రామీణ జనాభా 65.2 శాతం నుండి 17 శాతానికి పడిపోయింది. వ్యవసాయ భూములు కల్గి ఉన్న వారి సంఖ్య 4.5 లక్షల నుండి 2.17 లక్షలకు తగ్గింది. జనాభా మాత్రం 3.1 కోటి నుండి 6.6 కోట్లకు పెరిగింది. దేశంలోని నాలుగు ప్రముఖ సూపర్ మార్కెట్లు మాత్రమే జనాభా మొత్తానికి 70 శాతం నిత్యావసరాలను అందిస్తున్నాయి. ఆహారం కోసం ఖర్చు చేసిన మొత్తంలో రైతులు 8 శాతం మాత్రమే పొందుతున్నారు. రైతులకు అందించే రాయితీలను కూడా ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. దీంతో రైతులకు సాగు ఆర్థికంగా పెనుభారంగా మారింది. 1980, 90లలో లాటిన్ అమెరికా, దక్షిణ ఆసియా, ఆఫ్రికా వంటి అభివద్ధి చెందుతున్న దేశాల్లో.. సంస్థాగత సర్దుబాటు చర్యలతో పాటు వ్యవసాయ మార్కెట్‌లో సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టబడ్డాయి. 1980లలో చాలా ఆఫ్రికన్ ప్రభుత్వాలు వ్యవసాయ మార్కెట్‌లో సరళీకత విధానాలను ప్రవేశపెట్టాయి. ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులతో పాటు పంట దిగుబడుల ధరలపై ప్రభుత్వ నియంత్రణను రద్దు చేశాయి. అలాగే వాటి మార్కెట్‌లపై ఉన్న రెగ్యులేటరీ నియంత్రణను కూడా తొలగించాయి. ఆఫ్రికాలోని పలు ప్రాంతాల్లో సరళీకరణ విధానాలు విఫలమయ్యాయని,. దాని ఫలితాలు నిరాశపరిచాయని బ్రిటన్ డిపార్ట్‌మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ పరిశోధన వెల్లడించింది. ఈ సంస్కరణలు ఎంపిక చేయబడిన కొన్ని పంటల ఉత్పత్తి దారులకు, వినియోగదారులకు ప్రయోజనం కలిగించినప్పటికీ.. ఆహార పంటల ఉత్తత్తి దారులకు, గ్రామీణ ప్రాంతాల రైతులకు, పేద రైతులకు ప్రయోజనం కల్పించలేదని తెలిపింది. ”పేదరికం వద్ధిని తగ్గించడానికి అవసరమైన విస్తత ఆధారిత వ్యవసాయ పరివర్తన పేరుతో ప్రవేశపెట్టిన సంస్కరణలు ప్రయోజనం అందించలేదు” అని నివేదిక స్పష్టం చేసింది.
కెన్యాలో పంటల మార్కెట్‌లో వ్యాపార భాగాస్వామ్యాన్ని ప్రోత్సహించే 20కి పైగా చట్టాలు రద్దు చేయబడ్డాయి. ఈ చట్టాల రద్దు వ్యవసాయ – వ్యాపారాల ద్వారా లాభాల పెరుగుదలకు దారితీసింది. అయితే అదే సమయంలో .. వ్యవసాయ వ్యాపారులకు విక్రయించే రైతుల ఆదాయాలు సగటున 6 శాతం తగ్గిందని .. అంటే మధ్యవర్తులు, వ్యాపార సంస్థలు లాభపడ్డాయని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ సర్వే తెలిపింది. వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించే మధ్యవర్తుల ఆదాయం దాదాపు రెట్టింపు కాగా, 2010 నాటికి 38 శాతానికి చేరాయి. లాభాలు 5 శాతం పెరిగాయని తెలిపింది. మరోవైపు పంటలను కొనుగోలు చేసే వ్యాపార సంస్థలు మోనోపలీగా (నియంతత్వం) ఏర్పడి.. మార్కెట్‌పై గుత్తాధిపత్యాన్ని చేజిక్కించుకున్నాయి. దీంతో రైతుల ఉత్పత్తులకు సరైన ధరలు దొరకలేదు.
ఘనా వంటి దేశాల్లో .. సరళీకరణ విధానాల కారణంగా దిగుమతులు బాగా పెరగడంతో ధాన్యం, టమోటా, పౌల్ట్రీ దిగుమతులతో తీవ్రమైన పోటీ ఏర్పడి చిన్న రైతులు దేశీయ మార్కెట్‌లో తమ స్థానాన్ని కోల్పోయారు. ఈ మూడు పంటల ఉత్పత్తి క్షీణించింది. దీంతో జాతీయ వినియోగంలో స్థానిక ఉత్పత్తుల వాటా తగ్గింది. మరోవైపు, అభివద్ధి చెందిన దేశాలు దిగుమతులకు భారీగా సబ్సిడీలు ఇస్తున్నాయి. వాటి ధరలు తక్కువగా ఉండటంతో.. దేశీయ ఉత్పత్తుల తీవ్రమైన దెబ్బ పడింది. అభివద్ధి చెందుతున్న దేశాల్లో చిన్న రైతులకు భారీ రాయితీలు ఉండవు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటీఓ), అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)లు విధించే ఈ సరళీకరణ ఆర్థిక విధానాల ఫలితంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రభుత్వాలు అందించే సహాయం కూడా గణనీయంగా తగ్గింది.
అభివీద్ధి చెందిన దేశాల నుంచి భారీగా సబ్సిడీ దిగమతులతో స్థానిక ఉత్పత్తులు పోటీ పడలేని పరిస్థితి ఏర్పడిందని.. దీంతో ఘనా రైతులు ఈ చట్టాలను అడ్డగించారు. వ్యవసాయ మార్కెట్లు ఆఫ్రికాలోని పలు ప్రాంతాలలోని ప్రభుత్వాలు తమ ప్రాథాన్యతను ఆహార పంటల ఉండి వాణిజ్య పంటల వైపుకి మార్చాయి. భూములను ఎగుమతి పంటలకు కేటాయించడం ప్రారంభించాయి. దేశీయ ఆహార ఉత్పత్తులకు భూవనరులు కేటాయింపు తక్కువగా జరిగేది.
బెనిన్‌లో వాణిజ్యపంట, ఎగుమతికి ప్రాథాన్యం ఉన్న పత్తికి అధిక భూవనరులను కేటాయించింది. సాంప్రదాయ, సాంప్రదాయేతర వాణిజ్య పంటల ఎగుమతులను ప్రోత్సహించడంతో, స్థానికంగా వినియోగించే ఆహార పంటల ఉత్పత్తి క్షీణించిందని ఉగాండా నుండి వచ్చిన నివేదికలో స్పష్టమైంది.
వ్యవసాయాన్ని సరళీకతం చేయడానికి సంస్కరణలను అమలు చేసిన ఆఫ్రికన్ రాష్ట్రాల అనుభవాలను కెన్యా సెంట్రల్ బ్యాంక్ మాజీ డిప్యూటీ గవర్నర్ హెర్జోన్ న్యాంగిటో ఈ విధంగా పేర్కొన్నారు. ”డబ్ల్యుటీఓ వాణిజ్య ఒప్పందాలతో సహా సరళీకత వాణిజ్యం ధనికులకు, కార్పోరేట్లకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుంది. పేదలు ప్రయోజనం పొందకపోగా.. ఆహార అభద్రతకు గురవుతారు” అని అన్నారు. సరళీకరణ విధానాలతో ఆఫ్రికాలోని చాలా ప్రాంతాల్లో కొన్ని వర్గాలకు చెందిన భూములు కార్పోరేట్ల పరమయ్యాయి. ఈ భూములన్నీ గతంలో పేదల నుంచి ఆక్రమించినవే. వ్యవసాయ ఉత్పత్తి కోసం వివిధ దేశాలు, కంపెనీలు, వ్యక్తులు తీజుకు తీసుకున్నారు. ఇధియోపియా, కెన్యా, మాలావి, మాలి, మెజాంబిక్, సూడాన్, టాంజానియా, జాంబియా, మడగాస్కర్, కామెరూన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సోమాలియా, దేశాల్లో సుమారు 2.5 మిలియన్ హెక్టార్ల భూములు ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేయబడ్డాయి. ఆఫ్రికాలోని భూములపై లాభార్జన పొందే అదిపెద్ద పెట్టుబడిదారులలో సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, అబుదాబి వంటి మధ్యప్రాచ్య దేశాలు ఉన్నాయి. అభివద్ధి చెందుతున్న, అభివద్ధి చెందిన దేశాల్లో అమలు చేసిన వ్యవసాయ సరళీకరణ విధానాల అనుభవాలు .. భారత్‌లో రైతులు లేవనెత్తిన ఆందోళనలు నిరాధారం కావని స్పష్టం చేస్త్తున్నాయి.
Courtesy Nava Telangana