ఆకలి తీర్చిన అన్నం గిన్నె

0
102
  •  డొక్కలు మాడిన చోటే ధాన్యం మిగులు
  • సస్య విప్లవంతో సాగు ఘనం
  • ధాన్యం, పాలు, చేపలు, మాంసం, ఉద్యాన విభాగాల్లో స్వావలంబన
  • వ్యవసాయ రంగ సమగ్రాభివృద్ధే లక్ష్యం

1
పాలు, తేయాకు, సుగంధ ద్రవ్యాలు, పప్పు ధాన్యాలు, జీడిపప్పు, జనపనార ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్‌ స్థానం
2
గోధుమలు, వరి, పండ్లు, కూరగాయలు, వేరుసెనగ, చెరకు, ఉల్లిగడ్డలు, కోడిగుడ్లు, చక్కెర ఉత్పత్తిలో మన ర్యాంకు
3
లేయర్‌ కోళ్ల ఉత్పత్తిలో దేశ స్థానం
143
భారత్‌ నుంచి ఆహార ఉత్పత్తులు ఎగుమతి అవుతున్న దేశాల సంఖ్య
ప్రజలు ఆకలితో నకనకలాడుతుంటే ఆహారధాన్యాలు అందనీయకుండా వారి ఆకలి చావులకు కారణమైన భీకర నేపథ్యాన్ని భారతావని చవిచూసింది. అది 1876-78 సంవత్సరాల మధ్య కాలం. దేశంపై అత్యంత భయంకరమైన కరవు విరుచుకుపడింది. అదే సమయంలో బ్రిటిష్‌ పాలకులు నిస్సిగ్గుగా 3.20 లక్షల టన్నుల గోధుమలను లండన్‌కు ఎగుమతి చేశారు. దుర్భిక్షం ఫలితంగా మద్రాసు, ముంబయి ప్రావిన్సులు (రాష్ట్రాలు), హైదరాబాద్‌, మైసూరు సంస్థానాల పరిధిలో ఏకంగా 96 లక్షల మందిని ఆకలి కబళించింది. ఇదేకాదు.. తెల్లదొరల హయాంలో కేవలం కరవు కాటకాల కారణంగానే దాదాపు 12 కోట్ల మంది మృత్యువాత పడడం అరాచక పాలన దుష్ఫలితం. ఎన్నో బలిదానాలతో స్వాతంత్య్రం సాధించుకున్నాక… దేశ విభజన కారణంగా పంజాబ్‌, బెంగాల్‌ రాష్ట్రాల్లోని అత్యంత సారవంతమైన, సాగునీటి వసతి అధికంగా ఉన్న భూములు పాకిస్థాన్‌కు వెళ్లిపోయాయి. అదే సమయంలో విభజిత పాకిస్థాన్‌ నుంచి సుమారు 80 లక్షల మంది భారత్‌లోకి వచ్చేశారు. జనాభాకు తగినంత ఆహారధాన్యాల ఉత్పత్తికి పరిస్థితులు అనువుగా లేవు. అయినా అన్నదాతలు గుండెనిబ్బరాన్ని కోల్పోలేదు. నాగలి దన్నుతో ఎద్దులను ఆలంబనగా చేసుకుని ఒక్కో అడుగూ వేశారు. నాటి పాలకులు తీసుకొచ్చిన హరిత విప్లవం అద్భుతాలే సృష్టించింది. కాలక్రమంలో మన కర్షకులు పంట దిగుబడుల్లో అనూహ్య విజయాలు సాధించారు. ఆకలిచావుల అంతు చూశారు. 75 ఏళ్లలో భారత్‌ను ప్రపంచానికే అన్నం గిన్నెగా మార్చారు. ఆహారధాన్యాల మిగులు సాధించి తిండి విషయంలో దేశానికి భద్రతనిచ్చారు. ప్రస్తుతం మన వద్ద మూడేళ్లకు సరిపడా ఆహారధాన్యాలు నిల్వ ఉండడం దీనికి తార్కాణం.

స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో దేశంలో వ్యవసాయ రంగం పురోభివృద్ధి, రానున్న శతాబ్ది ఉత్సవాల నాటికి చేరుకోవాల్సిన లక్ష్యాలపై పూర్తి కథనం  

కరవు నుంచి కల్పతరువై…
దుర్భిక్షాన్ని జయించిన అన్నదాతలు
హరిత విప్లవంతో వ్యవసాయంలో గణనీయ ప్రగతి

ఉన్న కొద్దో గొప్పో భూమిలో తిండిగింజలు పండించుకోవడం.. సొంత అవసరాలకు కొంత దాచుకుని.. మిగిలినది ఇతర అవసరాలకు మార్పిడి చేసుకోవడం.. ఇదీ బ్రిటిష్‌ పాలనకు ముందు మన దేశంలో రైతుల తీరు. ఆంగ్లేయులొచ్చాక ఈ పరిస్థితి మారిపోయింది. ప్రతి రైతు తమ పొలాల్లోని మూడొంతుల భాగంలో పత్తి, నీలిమందు వంటి వాణిజ్య పంటలను సాగు చేయక తప్పనిస్థితి ఎదురైంది. వారు ఆరుగాలం చెమటోడ్చి సాధించిన దిగుబడులను పాలకులు నౌకల్లో బ్రిటన్‌కు తరలించుకుపోయేవారు. తెల్లవారి హయాం మొత్తం దాదాపు ఇదే తీరున సాగింది. స్వాతంత్య్రం సిద్ధించాక అన్నదాతలు వాణిజ్య పంటల నుంచి ఆహారధాన్యాల సాగువైపు మళ్లారు. కానీ… విత్తనాలు దొరకని దుస్థితి నెలకొంది. మరోవైపు జనాభా గణనీయంగా వృద్ధి చెందుతుండటంతో దిగుబడులు చాలని స్థితి. అవసరాలే అన్నీ నేర్పుతాయన్న నానుడి నిజమైంది. రైతులు వినూత్న విధానాలతో ప్రయోగాలకు దిగారు. అధిక దిగుబడుల దిశగా వడివడిగా అడుగులు వేశారు. స్వార్థరహితంగా వారు పడిన శ్రమ వృధా కాలేదు. డొక్కలు మాడ్చి చంపిన కరవు నుంచి దేశాన్ని ఆహారధాన్యాల కల్పతరువుగా మార్చగలిగారు. ఎందరో నిపుణుల సహకారంతో.. హరిత విప్లవం వంటి గుణాత్మక పరిణామాలతో సమృద్ధిగా పంటలు పండించే స్థాయికి భారతదేశం పురోగతి సాధించింది. అయితే… దిగుబడులు గణనీయంగా పెరిగినా రైతులకు ఇప్పటికీ గిట్టుబాటు ధరలు దక్కకపోవడం, పప్పుధాన్యాలు, నూనెగింజలను దిగుమతి చేసుకోవాల్సి వస్తుండటం ఆలోచింపజేస్తోంది. ఈ నేపథ్యంలో గడిచిన 75 సంవత్సరాల్లో సేద్యంలో అందుకున్న విజయాలు, సవరించుకోవాల్సిన అంశాలపై ప్రత్యేక కథనం…

ఆదుకున్న హరిత విప్లవం
స్వాతంత్య్రం వచ్చాక తొలినాళ్లలో వ్యవసాయం ఒడిదొడుకులను ఎదుర్కొంది. కొన్నిచోట్ల దుర్భిక్షం, మరికొన్నిచోట్ల అధిక వర్షాలతో దేశం అల్లాడింది. దాంతో ఒకటి, మూడు, నాలుగు పంచవర్ష ప్రణాళికల్లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. మొదటి ప్రణాళిక మొత్తం ప్రణాళికవ్యయం రూ.1960 కోట్లలో 31% అంటే రూ.601 కోట్లు వ్యవసాయ, సాగునీటి రంగం అభివృద్ధికే ఖర్చు పెట్టారు. మూడో ప్రణాళికలో గోధుమ, వరి పంటల సాగు విస్తీర్ణం పెంచడానికి హరితవిప్లవానికి శ్రీకారం చుట్టారు. అధిక దిగుబడినిచ్చే మేలు రకం వంగడాలను మెక్సికో నుంచి తీసుకొచ్చారు. నాటి కేంద్ర మంత్రి సి.సుబ్రమణియన్‌ చొరవ, అమెరికన్‌ వ్యవసాయ శాస్త్రవేత్త నార్మన్‌ బోర్లాగ్‌, భారతీయ శాస్త్రవేత్త ఎం.ఎస్‌.స్వామినాథన్‌ల పర్యవేక్షణలో పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో వాటిని సాగు చేయించారు. కొత్త వంగడాలు, యాంత్రీకరణ, ఎరువులు, పురుగు మందుల వాడకంతో చక్కటి ఫలితాలు వచ్చాయి.

కళ్లు చెదిరే దిగుబడి
ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాం. విదేశాలకు ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో నిలిచాం. 1951తో పోలిస్తే మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 507% మేర పెరిగింది. ప్రధానంగా గోధుమ ఉత్పత్తిని 1,595% పెంచుకున్నాం. వరి ఉత్పత్తిలో 494%, పప్పుధాన్యాల ఉత్పత్తిలో 206% మేర వృద్ధి నమోదైంది. నీతి ఆయోగ్‌ అంచనా ప్రకారం… 2033 నాటికి ఆహార ధాన్యాల ఉత్పత్తి డిమాండు కంటే 5 కోట్ల టన్నులు అధికంగా ఉంటుంది.

కొనే స్థాయి నుంచి అమ్మే దశకు…
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 1981 వరకు మన దేశం ఆహార ధాన్యాలను అత్యధికంగా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. కాలం మారింది. 1991 నుంచి ఉత్పత్తుల్లో మిగులు సాధ్యమైంది. విదేశాలకు ఎగుమతి చేయడం మొదలైంది. అప్పటి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2020-21లో మొత్తం ఎగుమతుల విలువ రూ.3.10 లక్షల కోట్లు కాగా… దిగుమతుల విలువ రూ.1.54 లక్షల కోట్లు కావడం విశేషం.

స్వామినాథన్‌ సంస్కరణలు
దేశంలో వ్యవసాయ అభివృద్ధి లక్ష్యంగా 2004లో కేంద్రం ఎం.ఎస్‌. స్వామినాథన్‌ ఛైర్మన్‌గా జాతీయ స్థాయి కమిటీని నియమించింది. ఆ కమిటీ మొత్తం 201 సిఫారసులను చేసింది. భూ సంస్కరణల అమలు, పంట సాగు వ్యయానికి అదనంగా 50% కలిపి మద్దతు ధర ఇవ్వడం, పొలాలకు సాగునీటి వసతి కల్పించడం, 4% వడ్డీకే పంట రుణాలివ్వడం, పనికి ఆహార పథకం వంటి పలు సూచనలు వీటిలో ఉన్నాయి.

* కోయంబత్తూరులోని వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు 15 ఏళ్లు శ్రమించి, దేశంలోనే తొలి హైబ్రిడ్‌ వరి వంగడాన్ని 1994లో కనుగొన్నారు. దానికి ప్రసిద్ధ సినిమా హీరో, తమిళనాడు మాజీ సీఎం, దివంగత ఎం.జి.రామచంద్రన్‌ పేరు పెట్టారు.

1. పాలించిన దేశాన్ని అధిగమించి

బ్రిటన్‌తో ఆహార ధాన్యాలు, అనుబంధ ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతి లావాదేవీల్లో మనదేశం రూ.3769 కోట్ల మిగులు సాధించింది.

                                   పాల వెల్లువ
పాడి పరిశ్రమలో శ్వేత విప్లవంతో 1970-96 మధ్య సహకార రంగంలో డెయిరీల ఏర్పాటు, పాల సేకరణ, శీతలీకరణ, రవాణా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా కురియన్‌ చలవతొ 1951లో 1.7 కోట్ల టన్నుల పాల ఉత్పత్తి నుంచి…  2020 నాటికి 19.84 కోట్ల టన్నులతో ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరాం.

                                             2. తోటల్లో మేటి
ఉద్యాన రంగంలో ప్రపంచంలోనే మనదేశం రెండో స్థానంలో నిలిచింది. పండ్ల ఉత్పత్తిలో 1991-92లో 2.86 కోట్ల టన్నుల నుంచి 2019-20 నాటికి 10 కోట్ల టన్నులకు చేరింది. 1991-92లో కూరగాయల ఉత్పత్తి 5.85 కోట్ల టన్నులు ఉండగా అది 2019-20 నాటికి 18.95 కోట్ల టన్నులకు చేరింది.

* 2020 సంవత్సరం నాటికి ఏడాదికి 11,438 కోట్ల కోడిగుడ్ల ఉత్పత్తితో ప్రపంచంలో రెండో స్థానానికి చేరింది.

                                 3. మన లేయర్‌ కోళ్లు భేష్‌

పౌల్ట్రీలో లేయర్‌ కోళ్ల ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచింది.

                                   మీసం తిప్పిన మీనం
చేపల ఉత్పత్తి 1950-51లో 7,56,000 టన్నులు ఉండగా.. దాదాపు రెండు రెట్లు పెరిగి 2019-20 నాటికి 1,40,70,000 టన్నులకు చేరింది.

 ఇబ్బడిముబ్బడిగా సాగునీరు
1950-51లో 5.55 కోట్ల ఎకరాలకు సాగునీరు అందేది. 2020-21 నాటికి 50% భూమికి… అంటే 19.76 కోట్ల ఎకరాలకు నీరందించేలా ప్రాజెక్టులు వచ్చాయి.
110 కోట్ల మందికి ఉపాధి లక్ష్యం
1947లో దేశంలో 36 కోట్ల జనాభా ఉంటే వారిలో 20 కోట్ల మందికి వ్యవసాయమే జీవనాధారం. 2020-21 నాటికి జనాభా 130 కోట్లకు చేరుకోగా 65 కోట్ల మందికి సేద్యమే ఉపాధి చూపింది. రానున్న 25 ఏళ్లలో జనాభా 165 కోట్లకు చేరవచ్చని, అప్పుడూ 110 కోట్ల మందికి వ్యవసాయమే జీవనాధారంగా ఉంటుందని నీతిఆయోగ్‌ అంచనా. అంటే అప్పటికి దాదాపు ఆఫ్రికా ఖండం జనాభా(120 కోట్లు)తో సమానంగా… ప్రజలకు ఉపాధి కల్పించే స్థాయికి ఈ రంగాన్ని అభివృద్ధికి చేయాల్సిన భారీ లక్ష్యం దేశం ముందుంది.

తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి
దేశంలో ప్రస్తుతం 27 కోట్ల టన్నుల ఆహారధాన్యాలు పండుతున్నాయి. పట్టణీకరణతో వ్యవసాయ భూముల విస్తీర్ణం తగ్గుతోంది. ఇప్పుడున్న  భూముల్లోనే 2047 నాటికి 33.30 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు పండించాల్సిన బృహత్తర లక్షాన్ని చేరుకోవాల్సి ఉంది.

అన్నదాతల ఆదాయం
దేశంలో 2015-16 నాటికి రైతు కుటుంబం సగటు వార్షిక ఆదాయం రూ.97 వేలు మాత్రమే. దీన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఆరేళ్లు గడచినా రైతుల ఆదాయం 30% మించి పెరగలేదు. ఒక సర్వే ప్రకారం దేశంలోని 57% మంది రైతులు అప్పుల్లోనే ఉన్నారు. ఈ కారణంగా వారి ఆత్మహత్యలు ఆగడంలేదు. వారిని కాపాడుకోవడమే మనముందున్న అతి పెద్ద సవాల్‌.

అద్భుత అవకాశాల ఆహార శుద్ధి
మనదేశంలో ఆహారశుద్ధి(ఫుడ్‌ ప్రాసెసింగ్‌) పరిశ్రమకు రానున్న ఉజ్వల భవిష్యత్తు ఉంది. రానున్న మూడేళ్లలో దాని మార్కెట్‌ విలువ రూ. 42.3 లక్షల కోట్ల స్థాయికి చేరనుంది. ఈ రంగం ఏడాదికి 11.18% వృద్ధి సాధిస్తోంది. రానున్న రెండేళ్లలో 90 లక్షల ఉద్యోగాలను సృష్టించనుంది. వ్యవసాయోత్పత్తుల డిమాండ్‌కు ఇది ఊతమివ్వనుంది. ఫలితంగా రైతులకు మేలు జరగనుంది.

Courtesy Eenadu

Leave a Reply