వ్యవసాయ భూములకు వేరుగా రిజిస్ట్రేషన్‌

0
280
  • సాగు భూముల రిజిస్ట్రేషన్‌ అధికారం తహసీల్దార్లకు
  • మిగతా భూముల అధికారం సబ్‌రిజిస్ట్రార్లకు
  • భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్‌  ఇకపై ధరణి ఆధారంగానే
  • ప్రభుత్వ భూములను రిజిస్టర్‌ చేస్తే డిస్మిస్‌, క్రిమినల్‌ కేసులు
  • పాస్‌పుస్తకాల్లో కుటుంబసభ్యుల పేర్లు నమోదుకు నెల రోజులు చాన్స్‌

హైదరాబాద్‌ : వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ను వేరు చేస్తూ.. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ అధికారాలను తహసీల్దార్లకు దఖలు పరిచి, రిజిస్ట్రేషన్‌ అయిన వెంటనే మ్యుటేషన్‌ చేసేలా ‘తెలంగాణ భూమి హక్కులు, పట్టాదార్‌ పాస్‌పుస్తకాల బిల్లు-2020’ని సర్కారు రూపొందించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం శాసనసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీని ప్రకారం.. తహసీల్దార్‌కు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ అధికారాలు కల్పించారు. భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్‌ అంతా ఇకపై ‘సమీకృత భూ యాజమాన్య విధానం (ధరణి)’ ఆధారంగానే చేయనున్నారు. రిజిస్ట్రేషన్‌ జరగ్గానే ధరణి వెబ్‌సైట్‌లో ఇచ్చే ధ్రువీకరణ పత్రానికి ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌-1872 ప్రకారం చట్టబద్ధత ఉంటుందని ప్రభు త్వం ప్రకటించింది. వ్యవసాయ భూములకు ఒకవిధంగా, వ్యవసాయేతర భూములకు ఒకవిధంగా వెబ్‌సైట్‌ ఉంటుంది. వ్యవసాయ, ఉద్యాన పంటల భూములను రిజిస్ట్రేషన్‌ చేసే అధికారం తహసీల్దార్‌కు తాజా చట్టంతో దఖలుపరిచారు. సబ్‌ రిజిస్ట్రార్లు ఇకపై వ్యవసాయేతర భూములను (ఇళ్ల స్థలాలు, ఇళ్లు, ఇతర ఆస్తులు) మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయాల్సి ఉంటుంది. రెండు చోట్ల కూడా రిజిస్ట్రేషన్‌ చేయగానే ధరణి రికార్డుల్లో తహసీల్దార్‌, మునిసిపల్‌, పంచాయతీ రికార్డుల్లో సబ్‌ రిజిస్ట్రార్‌ మ్యుటేషన్‌ చేయనున్నారు. ఇక రికార్డ్‌ ఆఫ్‌ రైట్‌గా ఎలకా్ట్రనిక్‌ రికార్డు ’ధరణి’ ఉంటుందని చట్టంలో పొందుపరిచారు. ధరణి రికార్డుల ఆధారంగా రిజిస్ట్రేషన్‌ చేసే యంత్రాంగంపై దావాలు వేయడానికి వీల్లేకుండా కట్టడి చేశారు.

ట్రైబ్యునల్‌దే తుది తీర్పు
తహసీల్దార్‌, రెవెన్యూ డివిజనల్‌ అధికారులు (ఆర్డీవో), అదనపు కలెక్టర్‌ (పూర్వ జాయింట్‌ కలెక్టర్‌) నిర్వహించే రెవెన్యూ కోర్టులన్నీ రద్దు చేసి, ఆ కేసుల విచారణ కోసం ప్రత్యేక ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయనున్నట్లు చట్టంలో పొందుపరిచారు. ఈ కోర్టుల్లో ఉన్న 16,137 కేసులను ట్రైబ్యునళ్లకు బదిలీ చేశారు. ప్రతి 1000 కేసులకూ ఒక ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసి, నిర్ణీత వ్యవధిలోగా కేసులను పరిష్కరించాలని ప్రభు త్వం షరతు పెట్టనుంది. ట్రైబ్యునల్‌ ఇచ్చే తీర్పు ఫైనల్‌ కానుంది.

అందరి పేర్లూ..
రైతులు ఇకపై తమపట్టాదార్‌ పాస్‌పుస్తకాల్లో కుటుంబ సభ్యులందరి పేర్లనూ చేర్చుకోవాల్సి ఉంటుం ది. భార్యాభర్తలు, పిల్లల వివరాలన్నీ విధిగా నమోదు చేసుకోవాలి. ఇందుకు నెలరోజులు సమయమిచ్చారు. ఎవరైనా రైతు చనిపోతే ఆ రైతు వారసులకు భూ ములు దక్కేలా ఫౌతీ చేయనున్నారు. వారంతా విధిగా తహసీల్దార్‌ కార్యాలయానికి సమాచారం ఇచ్చి.. రైతు కు సంబంధించిన ఆస్తులను సమంగా పంచుకునేలా సంయుక్త లేఖ ఇస్తే, ఆ లేఖ ఆధారంగా భూములను రైతు వారసుల పేర్ల మీదికి ప్రభుత్వం మార్చనుంది.

ప్రభుత్వ భూములకు రక్షణ
జాగీరు వ్యవస్థను రద్దు చేయడంతో జాగీర్‌ భూములన్నిటినీ ప్రభు త్వ భూములుగా గుర్తిస్తూ.. వీటితో ఇతర ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్‌ను కట్టుదిట్టం చేశారు. ఈ భూములను నిషేధిత జాబితాలో పెడతారు. ఎవరైనా ఆ భూములను రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తే… వెబ్‌సైట్‌లో ఎర్రర్‌ చూపిస్తుంది. ఇక ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్‌ జరిగితే ఆ భూమి పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు రద్దు చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్‌కు ఇచ్చారు. అంతేకాదు, సంబంధిత తహసీల్దార్‌ను సర్వీసు నుంచి తొలగించడంతో పాటు క్రిమినల్‌ కేసు నమోదు చేస్తారు.

పాస్‌పుస్తకం లేకుండానే రుణం
ఇక బ్యాంకులు/పరపతి సంస్థలు రైతులకు రుణాలు ఇవ్వాలంటే పాస్‌పుస్తకం తీసుకోకుండానే రుణం ఇవ్వాలి. ధరణి జారీ చేసే పత్రాల ఆధారంగా రుణం ఇవ్వాలి. ఇక

తహసీల్దార్ల కార్యాలయాలకు రిజిస్ట్రేషన్‌కు వెళ్లాలంటే స్లాట్‌ (ఫలానా సమయం.. ఫలానా తేదీన రిజిస్ట్రేషన్‌కు వస్తున్నట్లు) తీసుకోవాలి. ఆ స్లాట్‌ బుకింగ్‌ వివరాలు ధరణి వెబ్‌సైట్‌తో పాటు తహసీల్దార్‌ కార్యాలయంలో లాక్‌ రిజిస్టర్‌లో ఉంటాయి. వాటి ప్రకారమే రిజిస్ట్రేషన్‌కు వెళ్లాలి. స్లాట్‌ ఇచ్చిన తహసీల్దార్లు ఆ సమయంలో రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చే రైతులు/భూయాజమానులకు కార్యాలయంలో అందుబాటులో ఉండాలి. ఇక ధరణి రావడానికి ముందే తహసీల్దార్లకు కొంతకాలం పాటు శిక్షణ ఇచ్చిన యంత్రాంగం.. మరికొన్ని రోజుల పాటు ధరణి వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌పై తర్ఫీదునివ్వనుంది. ప్రతి కార్యాలయంలో ఐటీ నిపుణుడు కూడా ఒకరు సహాయంగా ఉంటారు.

వీఆర్‌ఏలు కూడా ఇతర శాఖల్లోకి
తెలంగాణలో 22 వేల మంది దాకా గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ)లు ఉండగా.. వీరికి పే స్కేలు ఇచ్చి, ఇతర శాఖల్లోకి పంపించనున్నారు. దాదాపు 10 వేల మంది దాకా వీఆర్‌ఏలను ఇతర శాఖలకు పంపించి మిగతా వారిని రెవెన్యూశాఖలోనే ఉంచుకోనున్నారు. వీరిలో కొందరు ఏపీపీఎస్సీ ద్వారా నియమితులైన వారు కాగా… మిగిలిన వారు వంశపారంపర్యంగా విధుల్లోకి వచ్చినవారు.

వీఆర్‌వో పోస్టులు రద్దు
రెవెన్యూ శాఖలో 5600 మంది దాకా గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్‌వో) పోస్టుల రద్దును ప్రతిపాదిస్తూ సీఎం కేసీఆర్‌ బుధవారం శాసనసభలో ‘తెలంగాణ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల పదవుల రద్దు బిల్లు-2020’ను ప్రవేశపెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో 2007(జీవోనెం.105), 2008లో జారీ చేసిన జీవోనెం.39 ప్రకారం రెవెన్యూశాఖలో ప్రవేశపెట్టిన గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను రద్దు చేయడానికి వీలుగా ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాత వీరి నుంచి ఆప్షన్లు తీసుకొని వివిధ శాఖలకు బదలాయించడం లేదా విలీనం చేస్తారు. ఆయా శాఖలకు వెళ్లడానికి విముఖత చూపేవారికి స్వచ్ఛంద పదవీ విరమణ లేదా ఉద్యోగానికి రాజీనామా చే యడానికి అవకాశం ఇస్తారు. ప్రస్తుతం వీరిని జూనియర్‌ అసిస్టెంట్‌ తత్సమాన కేడర్‌గా పరిగణన లోకి తీసుకుంటారు.

Courtesy Andhrajyothi

Leave a Reply