మహామోసం..

0
256
మహామోసం..

ఒప్పందానికి విరుద్ధంగా ఎల్‌ అండ్‌ టీ మెట్రోరైల్‌ చార్జీల పెంపు
వీజీఎఫ్‌ కింద రూ.1,458 కోట్లు స్వాహా
రూ.164 కోట్ల లేబర్‌సెస్‌ ఎగవేత
ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టి.. రియల్‌దందా!
ఈ పాపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకూ భాగస్వామ్యం
కేంద్ర ఆర్ధికశాఖకు ఒప్పంద రూపకర్త గజేంద్రహల్దియా లేఖ

హైదరాబాద్‌ మెట్రోరైల్‌ అవినీతి పట్టాలు ఎక్కింది. ప్రాజెక్ట్‌ పూర్తికాకుండానే అడ్డగోలుగా ప్రయాణీకుల్ని దోచుకుంటున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలనుంచి రావ ల్సిన అన్ని రకాల ఆర్ధిక ప్రయోజనాలనూ క్రమం తప్ప కుండా పొంది, సందర్భాన్ని బట్టి తనకు అనుకూలమైన చట్టాలే వర్తిస్తాయంటూ మొండివాదనను వినిపిస్తున్నది. దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూసీచూడనట్టు వదిలేస్తున్నాయి. ఈ కార్పొరేట్‌ మోసానికి ఆయా ప్రభుత్వాలు కూడా కొమ్ముకాస్తున్నట్టు ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. 2010లో మెట్రోరైల్‌ నిర్మాణ ఒప్పంద పత్రంలోని షరతులన్నింటినీ ఎల్‌ అండ్‌ టీ కంపెనీ ఉల్లంఘించి, అటు ప్రభుత్వాలనూ, ఇటు ప్రయాణీకుల్ని నిలువుదోపిడీ చేస్తున్నది. ఈ దోపిడీపై ప్లానింగ్‌ కమిషన్‌ మాజీ సభ్యులు, మెట్రోరైల్‌ ఒప్పంద రూపకర్తల్లో ఒకరైన గజేంద్ర హల్దియా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు లేఖలు రాసారు. వయోబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ (వీజీఎఫ్‌) ద్వారా ఎల్‌అండ్‌టీకి మంజూరు చేసిన రూ.1,458 కోట్లను రికవరీ చేయాలని ఆ లేఖలో కోరారు. దేశంలో ఏ మెట్రోరైల్‌ లోనూ లేని విధంగా చార్జీలను భారీగా నిర్ణయించి, ప్రయాణీకుల నుంచి వసూలు చేస్తున్నారని, ఇది ప్రాధమిక ఒప్పంద పత్ర ఉల్లంఘన క్రిందికే వస్తుందని ఆ లేఖలో గజేంద్ర హల్దియా పేర్కొన్నారు.

దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఆమోదం తెలిపాయని ప్రశ్నించారు. ఒప్పందం ప్రకారం మూడు కారిడార్లలో పనులు పూర్తికావల్సి ఉండగా కేవలం ఒక్క కారిడార్‌లోనే పాక్షికంగా సేవలు అందుబాటులోకి వచ్చాయి. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎల్‌ అండ్‌ టీకి రావల్సిన అన్ని రకాల నిధుల్ని ఇప్పటికే రాబట్టుకున్నారు. కారిడార్ల నిర్మాణాన్ని పక్కనపెట్టిన ఎల్‌ అండ్‌ టీ కంపెనీ తనకు లాభసాటి అయిన రియల్‌ ఎస్టేట్‌, వాణిజ్య సముదాయాల నిర్మాణాలను శరవేగంగా పూర్తిచేస్తున్నది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 18.50 లక్షల చదరపు అడుగుల (300 ఎకరాలు) పట్టణ ప్రాంతాన్ని ఎల్‌అండ్‌టీకి ధారాదత్తం చేసింది. మెట్రోపిల్లర్లు, స్టేషన్లలో అడ్వర్టయిజ్‌మెంట్‌ల ద్వారా భారీగా ఆదాయాన్ని గడిస్తున్నది. మెట్రో స్టేషన్లలో దుకాణాలను అద్దెకు ఇచ్చి ఆర్ధిక స్థిరత్వాన్ని సాధిస్తున్నది. తాజాగా మెట్రో స్టేషన్ల వద్ద అక్కడి ఫుట్‌పాత్‌లపై చట్టవ్యతిరేకంగా వ్యాపారాలను నిర్వహించుకొనేలా అనుమతులు ఇస్తున్నది. దీనిపై జీహెచ్‌ఎంసీ, ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌ మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తున్నది. పార్కింగ్‌ ఫీజు వసూలు చేస్తున్నది. ఊబర్‌, ఓలా వంటి క్యాబ్‌ సంస్థలతో ఒప్పందం చేసుకొని రాయల్టీ తీసుకుం టున్నది. ఎల్‌ అండ్‌ టీ ఆర్ధిక దోపిడీపై ప్రభుత్వం నెలకొల్పిన హైదరాబాద్‌ మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎమ్‌ఆర్‌ఎల్‌) మౌనం అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతున్నది. ఈ సంస్థ సుదీర్ఘకాలంగా ఒకే అధికారి కనుసన్నల్లో ఉండటం వల్లే, ఎల్‌ అండ్‌ టీ ఆడింది ఆట…పాడింది పాటగా సాగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వయోబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ (వీజీఎఫ్‌) అంటే…
పబ్లిక్‌ ప్రయివేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో నిర్మితమవుతున్న మెట్రోరైల్‌ ప్రాజెక్ట్‌ ఇంకా రెండు కారిడార్లలో పనులు చేపట్టాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే…ప్రయాణీకుల నుంచి ఎంత చార్జీలను వసూలు చేస్తారో నిర్మాణ సంస్థ ఒప్పందంలో వెల్లడించాలి. 2010 సెప్టెంబర్‌ 4న హైదరాబాద్‌ మెట్రోరైల్‌ (హెచ్‌ఎమ్‌ఆర్‌), గవర్నమెంట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌తో ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ప్రయివేటు లిమిటెడ్‌ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం మెట్రోరైల్‌ నిర్మాణం పూర్తయ్యాక, ఆరు రకాల శ్లాబుల్లో చార్జీలను కనిష్టంగా రూ.8 నుంచి రూ.19 వరకు నిర్ణయించారు. రోజంతా మెట్రోరైల్‌లో తిరిగేందుకు కనీస చార్జీ రూ.40 వసూలు చేస్తామని పేర్కొన్నారు. ఇంత తక్కువ చార్జీలు వసూలు చేస్తున్నందున తమకు ప్రాజెక్ట్‌ నష్టదాయకంగా ఉంటుందని, ఆ నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని (వయబిలిటీ గ్యాప్‌ఫండ్‌-వీజీఎఫ్‌) సూచించారు. ఆ మేరకు నిర్మాణ సంస్థకుి రూ.1,458 కోట్లను చెల్లిస్తామన్న కేంద్ర ఆర్ధికశాఖ ఆ నిధుల్ని ఇచ్చేసింది. కానీ ప్రాజెక్ట్‌ తొలి విడత పూర్తికాగానే, ఒప్పందానికి విరుద్ధంగా ఎల్‌అండ్‌టీ సంస్థ మెట్రోరైల్‌ చార్జీలను 10 శ్లాబులుగా విడగొట్టి, కిలోమీటర్ల ప్రకారం కనిష్టంగా రూ.10 నుంచి గరిష్టంగా రూ.60 వరకు వసూలు చేస్తున్నది. దీనిపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మౌనం వహిస్తున్నాయి. గజేంద్రహల్దియా ఇదే అంశాన్ని తన లేఖలో ప్రస్తావించారు. ఎల్‌అండ్‌టీకి చెల్లించిన వీజీఎఫ్‌ను రికవరీ చేయాలని కేంద్ర ఆర్ధికశాఖకు సూచించారు.

లేబర్‌సెస్‌ ఎగవేత
ఒప్పందాలను ఉల్లంఘించి మెట్రోరైల్‌ చార్జీలను భారీగా పెంచేసుకున్న ఎల్‌అండ్‌టీ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణ సమయంలో కార్మికశాఖకు రూ.164 కోట్లను చెల్లించాల్సి ఉంది. దీనిపై 2014లోనే కార్మికశాఖ ఎల్‌అండ్‌టీకి నోటీసులు ఇచ్చింది. దీనిపై కోర్టుకు వెళ్లి ఆ సంస్థ స్టే తెచ్చుకుంది. ఇప్పటివరకు కార్మికశాఖ కానీ, రాష్ట్రప్రభుత్వం కానీ ఆ స్టేను ఎత్తివేయించే కనీస చర్యలు తీసుకోలేదు. సకాలంలో లేబర్‌సెస్‌ను చెల్లించకుంటే రూ.2 వడ్డీతో సహా వసూలు చేయాలని కార్మికశాఖ నిబంధనలు చెప్తున్నాయి. ఆ ప్రకారం ఎల్‌అండ్‌టీ నుంచి దాదాపు రూ.360 కోట్లు రావల్సి ఉంది.

Courtesy Nava Telangana

Leave a Reply