బతుకు భారాల భయ భారతం!

0
201
పి. చిదంబరం 
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

మానవ వేదన ఏమిటి? ఒక స్త్రీగా ఆటవికతను, ఒక పౌరురాలుగా పాశవికతను చవి చూసిన; ముష్కరులు తన చిన్నారి బిడ్డను, ఆత్మీయ తోబుట్టువు లను నరికివేసిన భయానక పాతకాన్ని కళ్ళారా చూసిన మాతృమూర్తి హృదయంలోని బాధే మానవ వేదన. ఆ తల్లి పేరు బిల్కిస్ బానో. కోట్లాది పేదలు, వివక్షా బాధితులు, అణగారిన పౌరుల జీవన పరిస్థితులను ఆమె చాలా సాదా, అయితే హృదయ విదారక మాటల్లో ఎలా సంగ్రహించి చెప్పారో చూడండి: ‘భయం లేకుండా జీవించేందుకు నాకు గల హక్కును తిరిగి నాకు ఇవ్వండి’.

బిల్కిస్ బానో విషాద గాథ వర్తమాన సంకుచితత్వాల వికృత చరిత్రకు ఒక దర్పణం. 2002లో ఒక రైలు బోగీని దగ్ధం చేసిన అనంతరం గుజరాత్‌లో హింసాకాండ ప్రజ్వరిల్లింది. 21 ఏళ్ల బిల్కిస్ మాతృమూర్తి. గర్భవతి కూడా. ఒక మూక ఆమెపై దాడి చేసింది; మూకుమ్మడి అత్యాచారానికి గురయింది; మూడేళ్ల చిన్నారి బిడ్డతో సహా ఆమె కుటుంబ సభ్యులలో ఏడుగురిని ఆ గుంపు హతమార్చింది. బిల్కిస్ అదృష్టవంతురాలు. ప్రాణాలతో బయపపడింది. తన విషాద గాథను ప్రపంచానికి చెప్పింది. ఆమెపై దురాగతానికి పాల్పడిన వారిలో 11 మందిని దోషులుగా కోర్టు నిర్ధారించింది. వారికి యావజ్జీవ శిక్ష విధించింది. ముందస్తు హెచ్చరిక ఏదీ లేకుండానే 2022 ఆగస్టు 15న ఆ యావజ్జీవ శిక్షను మాఫీ చేశారు. ఆ 11మంది స్వేచ్ఛా ప్రపంచంలోకి వచ్చారు. పదిమంది సభ్యుల క్షమాభిక్ష కమిటీ శిక్ష తగ్గింపునకు వారు పెట్టుకున్న అర్జీని ఆమోదించింది. ఆ కమిటీలో ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఏడుగురు ప్రైవేట్ సభ్యులు ఉన్నారు. ప్రైవేట్ సభ్యులలో ఐదుగురు భారతీయ జనతా పార్టీ క్రియాశీల సభ్యులు. ఈ ఐదుగురిలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు. 2002 లో బీజేపీ నాయకులు ఎవ్వరూ క్షమాపణ చెప్పలేదు. 2022లోనూ ఆ పార్టీకి చెందిన వారెవ్వరు క్షమాపణ చెప్పలేదు. పదకొండు మంది దోషులు విడుదలైన తరువాత భద్రత కోసం బిల్కిస్ తన కుటుంబంతో సహా ఎక్కడికో వెళ్లిపోయినట్టు వార్తలు వెలువడ్డాయి. భారతీయ జనతా పార్టీ వారెవ్వరూ ఆమె కుటుంబ భద్రత విషయమై ఎలాంటి ఆందోళన వ్యక్తం చేయలేదు. బిల్కిస్ బానో కథ స్పష్టం చేస్తున్న సత్యమేమిటి? భారతీయులు అందరూ చట్టం ముందు సమానులు కారు; చట్టాల ప్రకారం సమాన రక్షణకు హక్కుదారులు కారు. భారతీయులు అందరూ తమ జీవితాలను భయం లేకుండా జీవించడం లేదు. నిజానికి చాలా చాలా మంది భారతీయుల భయగ్రస్తులుగా బతుకుతున్నారు.

జర్నలిస్టులు భయంలో బతుకుతున్నారు. శీతగాడ్పుల డిసెంబర్‌లో ఒక రాత్రి పదిగంటలకు పాత్రికేయుడు ఒకరిని పిలిపించి, రొటీన్ ‘బ్రేకింగ్ న్యూస్’లో ఒక వార్తను చదివేందుకు ఒబి వ్యాన్ వద్దకు ఉన్నపాటున వెళ్లాలని ఆదేశించారు. ఆ ఆదేశాన్ని మర్యాదగా ఎందుకు తిరస్కరించలేదని ఆ జర్నలిస్టును అడిగాను. వృద్ధులు అయిన తల్లిదండ్రులు తనతో నివశిస్తున్నారని, గృహ నిర్మాణానికి తీసుకున్న రుణాన్ని ఇంకా చెల్లించవలసి ఉందని చెబుతూ యాజమాన్యం ఆదేశాన్ని తిరస్కరిస్తే తాను ఉద్యోగాన్ని కోల్పోవలసి వస్తుందని అతడు చెప్పాడు. తమ పత్రికల, ఛానెళ్ల యాజమాన్యాల అభిప్రాయాలకు అనుగుణంగా మాత్రమే తాము వృత్తి బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుందని, లేనిపక్షంలో ఉద్యోగాన్ని కోల్పోవలసివస్తుందని, ప్రస్తుత పరిస్థితుల్లో మరో ఉద్యోగంలో చేరడం చాలా కష్టమని పలువురు పాత్రికేయులు చెప్పారు. ఇటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న పలువురు ప్రముఖ జర్నలిస్టులు, యాంకర్లు, ఎడిటర్ల పేర్లను కూడా వారు ఉదహరించారు. మీడియా సంస్థల యజమానులూ భయంలో నివశిస్తున్నారు. తమకు ఇచ్చే వాణిజ్య ప్రకటనలను ప్రభుత్వం హఠాత్తుగా నిలిపివేస్తుంది. ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు తమ వాణిజ్య ప్రకటనల బడ్జెట్లలో హఠాత్తుగా కోత విధిస్తారు. అసలు తమ మీడియా సంస్థలను ఇతరులు ఎవరో కైవసం చేసుకుంటారనే భయమూ సంబంధిత యాజమాన్యాలను నిత్యం వెంటాడుతూనే ఉంటుంది.

అధికారులూ భయంలో జీవిస్తున్నారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో అధికారులు నిష్పాక్షికంగా, తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయాలని ఇత్యాది ధర్మోపదేశాలు జరిగాయి. వీటిని విశ్వసించిన సీనియర్ అధికారి ఒకరు ఒక సమావేశంలో ప్రభుత్వ ప్రతిపాదన మంచి భావన కాదని, సరైన ఆర్థిక ప్రయోజనాన్ని ఇచ్చేది కూడా కాదని విశ్లేషించాడు. ఆ అధికారిని ఆ వెన్వెంటనే బదిలీ చేశారు! ఇటువంటి అవమానాలను తప్పించుకునేందుకు ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు అనేక మార్గాలను కనుగొంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి డెప్యుటేషన్‌పై రాకపోవడం వాటిలో ఒకటి.

పార్లమెంటు సభ్యులూ భయంలో నివశిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను పూర్తిగానో లేక వాటిలోని కొన్ని నిబంధనలను బీజేపీ ఎంపీలు ఆంతరంగికంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రతి పక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని కూడా వారు అంగీకరించడం లేదు. కొత్త సాగు చట్టాలు, క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) బిల్లు, కొంతమంది ఎంపీలను వారం రోజులు లేదా ఆ సమావేశాలు పూర్తయ్యేంతవరకు సస్పెండ్ చేయడం అందుకు ఇటీవలి ఉదాహరణలు. మంత్రులు భయంలో ఉన్నారు. తమ శాఖల కార్యదర్శులు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు అందుకుని, వాటికి అనుగుణంగా పైళ్లను రూపొందించి మంత్రుల పరిశీలనకు నివేదిస్తున్నారు! చాలా మంది మంత్రులు ఇటువంటి వ్యవహార శైలితో తమకు తాము రాజీపడుతున్నారు. కేబినెట్ సెక్రటేరియట్ సిద్ధం చేసిన కేబినెట్ నోట్స్ పై మంత్రులు సంతకం చేస్తున్నారు. వాటిని కేబినెట్ కు సమర్పించేందుకు కేబినెట్ సెక్రటేరియట్ కు నివేదిస్తున్నారు! వాణిజ్యవేత్తలు, వ్యాపారస్తులు, వర్తకులు భయంలో నివశిస్తున్నారు. అది కేవలం సిబిఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ దాడుల గురించిన భయం మాత్రమేకాదు. జీ ఎస్టీపాలనా యంత్రాంగం, డిఆర్ఐ, ఎస్ఎఫ్ఐఓ, సెబి, సిసిఐ, ఎన్ఐఏ, ఎన్‌సిబి లనుకూడా వ్యాపార వాణిజ్య వర్గాల వారిపై ఉసిగొల్పుతున్నారు. నేరాలు, మూక హింసాకాండ, పోలీసు అరాచకాలు, తప్పుడు కేసుల భయంలో పౌరులు నివశిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, గిరిజనులు, వలస కార్మికులు, సామాజిక కార్యకర్తలు, రచయితలు, కమెడియన్లు, కార్టూనిస్టులు, సినిమా నిర్మాతలు, ప్రచురణ కర్తలు భయవిహ్వలులై ఉన్నారు. ఏ రోజూ ఈ వర్గాలకు చెందిన ఎవరో ఒక ప్రముఖుడిపై రాజ్యవ్యవస్థ తన ప్రతాపాన్ని చూపుతూనే ఉన్నది.

విద్యార్థులు నీట్, సియుఒటి, ఇంకా ఇతర (కేంద్ర ప్రభుత్వం నిర్వహించే) జాతీయ స్థాయి ఎంట్రెన్స్ పరీక్షల భయంలో ఉన్నారు. వీటితో వారు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎవరు ఎంపిక అవుతారో, ఎంపికకు ప్రమాణాలు ఏమిటో, విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియక విద్యార్థి లోకం సదా భయపడుతూనే ఉన్నది. అంతకంతకూ పెరుగుతోన్న ద్రవ్యోల్బణం పేదలను అమితంగా భయపెడుతున్నది. అసంఖ్యాకులు ఉద్యోగాలు కోల్పొతున్నారు. నిరుద్యోగం పెరిగిపోతోంది. చాలా మంది లేని ఉద్యోగాల కోసం ఎదురు చూడడాన్ని చాలా మంది మానుకున్నారు. 2017–22 సంవత్సరాల మధ్య 2.10 కోట్ల మంది మహిళలు ఉద్యోగాలు, ఉపాధులను కోల్పొయారని సి ఎమ్ ఐ ఇ నివేదిక వెల్లడించింది. భయం లేకుండా జీవించగలరనే భరోసాను పౌరులకు ఇవ్వగల, ఇచ్చేందుకు అవసరమైన అధికారాలు గల సమర్థ నాయకుడు ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను. అటువంటి దీక్షాదక్షుడు ఎవరూ ఇప్పుడు భారతదేశంలో లేడు. ఇంతకు మించి శోచనీయ విషయం మరేముంటుంది?

Leave a Reply