- ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక్క ఔషధాన్నీ బయటకు రాయరు
- అక్కడ మందుల బడ్జెట్ రూ.1,200 కోట్లు
- వైద్య కార్పొరేషన్‌కు ఎప్పుడూ అందుబాటులో రూ.200-300 కోట్లు
- తెలంగాణలోనూ ఇదే విధానం అనుసరణీయం
- ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్న రాష్ట్ర ఆరోగ్యశాఖ
హైదరాబాద్: తమిళనాడులోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందే రోగులకు 100 శాతం మందులను ప్రభుత్వమే ఉచితంగా అందజేస్తోంది. మందుల లేవనే కారణంతో బయటకు రాసే పరిస్థితి అక్కడ ఉత్పన్నం కావడం లేదు. ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోనూ ప్రైవేట్ ఔషధ దుకాణాలుండవు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలుకొని 3,500 పడకల సామర్థ్యమున్న మద్రాస్ మెడికల్ కళాశాల అనుబంధ ఆసుపత్రిలోనూ ఇదే విధానం అవలంబిస్తున్నారు. అక్కడ ఔషధాల కొనుగోలుకు ముందస్తుగా నిధులు విడుదల చేస్తున్నారు. అక్కడి వైద్య కార్పొరేషన్ వద్ద మందుల కొనుగోలుకు ఎప్పుడూ కనీసం రూ.200-300 కోట్లు అందుబాటులో ఉంటాయి. దీనికోసం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. అంటే ప్రతిసారీ బడ్జెట్ విడుదల ఉత్తర్వులు ఇవ్వడం, వాటి మంజూరు కోసం వేచిచూడడం వంటి సమస్యలు ఉండవు. నిధుల కోసం దరఖాస్తు సమర్పించగానే నేరుగా ట్రెజరీ నుంచి కార్పొరేషన్‌కు విడుదలవుతాయి. ఏళ్లుగా ఈ విధానం కొనసాగుతోంది. కొవిడ్‌కు ముందు తమిళనాడులో మందుల బడ్జెట్ రూ.650 కోట్ల వరకూ ఉండగా.. ప్రస్తుతం అది రెట్టింపైంది. ఏటా రూ.1,200 కోట్లను మందుల కొనుగోలుకు కేటాయిస్తున్నారు. తెలంగాణలో ఈ బడ్జెట్ రూ.500 కోట్లు. ఇది కొవిడ్‌కు ముందు రూ.250 కోట్లుండేది. ఔషధాల కొనుగోలు, నిల్వల్లో తమిళనాడు విధానం అనుసరణీయమని తెలంగాణ వైద్యారోగ్యశాఖ భావిస్తోంది. ఇటీవల తమిళనాడులో పర్యటించిన వైద్యశాఖ బృందం.. ఈ అంశంపై ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.
మందుల వినియోగంపై పక్కా సమాచారం
ప్రతినెలా ఆన్లైన్ విధానంలో ఏయే మందులు ఎక్కువగా వినియోగమవుతున్నాయో.. వాటి నిల్వలు ఎంతున్నాయో తమిళనాడులో పక్కాగా తెలిసిపోతుంది. ఈ సమాచారాన్ని బట్టి ఔషధాల కొనుగోలుకు ఆదేశాలిస్తారు. కనీసం 3 నెలల నిల్వలుంటాయి. గత పదేళ్లుగా ఎక్కువగా వినియోగమవుతున్న మందుల సమాచారం అక్కడి వైద్య కార్పొరేషన్ వద్ద ఉంది. 95 శాతం ఔషధాలను కార్పొరేషన్ ద్వారా, 5 శాతం స్థానికంగా ఆసుపత్రి సూపరింటెండెంట్లు కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణలో 80 శాతం వైద్య కార్పొరేషన్ ద్వారా, 20 శాతం స్థానికంగా ఆసుపత్రి సూపరింటెండెంట్లు కొనుగోలు చేసే విధానం అమలవుతోంది. అయితే, స్థానికంగా ఆసుపత్రుల్లో ఔషధాల కొనుగోలు నామమాత్రంగా సాగుతోంది. అత్యవసరమైనవీ కొనకపోవడంతో రోగులే సొంతంగా కొనుగోలు చేయాల్సి వస్తోంది. మన రాష్ట్రంలో కనీసం 3 నెలల నిల్వ విధానం అమల్లో లేదు. ఎక్కువ మొత్తంలో కొనాలన్నా.. వైద్యుడు ముందస్తుగా కోరిన దానికంటే 10 శాతానికి మించకూడదనే నిబంధన అమల్లో ఉంది. ఏయే ఔషధాలు ఎక్కువగా వినియోగమవుతున్నాయనే ఆన్లైన్ సమాచారం తెలంగాణలో ఇప్పటివరకూ లేదు. దీంతో అంచనా వేయడం కష్టమవుతోందని వైద్యవర్గాలు చెబుతున్నాయి.
వేగంగా సర్దుబాటు చేసేలా..
కొన్ని రకాల మందులు ఒక ఆసుపత్రిలో ఎక్కువగా, మరికొన్ని ఆసుపత్రుల్లో తక్కువగా వినియోగమవుతుంటే.. వాటిని ఒక చోటు నుంచి మరో చోటుకు సర్దుబాటు చేసే వ్యవస్థ తమిళనాడులో వేగంగా పనిచేస్తోంది. ఇక్కడా అలాంటి వ్యవస్థను పక్కాగా అమలు చేయాలని తెలంగాణ ఆరోగ్యశాఖ నిర్ణయించింది. దీనిపై వైద్యులతో అధికారులు భేటీ అయ్యారు. తమిళనాడు ఔషధాల జాబితాతో మన దగ్గర ఉన్న మందుల పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇకనుంచి ఏ ఒక్క ఔషధమూ లేదనే సమస్య ఉత్పన్నం కావద్దనీ, తమిళనాడు జాబితాలో ఉన్నవాటితో పాటు.. కొత్త రకాల ఔషధాలు కావాలన్నా జాబితాలో పొందుపర్చాలని ఆరోగ్యశాఖ ఆదేశించింది. ఔషధ జాబితాలో ఏమేం మందులున్నాయో వైద్యులకు తెలిసేలా స్పెషాలిటీల వారీగా పుస్తక రూపంలో ముద్రించి ఇవ్వాలని నిర్ణయించారు. తమిళనాడు వైద్య కార్పొరేషన్లో 580 మంది ఉద్యోగులు ఉండగా.. తెలంగాణలో 130 మంది మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ‘ఆసుపత్రికి ఇంత శాతం మందులు’ అని కోటా విధానాన్ని అమలుచేస్తున్నారు. దీన్ని ఎత్తివేసి.. ఎంత మొత్తంలో అవసరమైతే అంత మొత్తం ఇవ్వాలని తెలంగాణ వైద్యారోగ్యశాఖ అధికారులు నిర్ణయించారు.