ఉప్పలగుప్తంలో ఉద్రిక్తత

0
268

రెండోరోజు దళితుల ఆందోళన
టవర్‌ ఎక్కిన యువకులు
 ఉప్పలగుప్తం (తూర్పుగోదావరి)

తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తంలోని ప్రధాన కూడలిలో తొలగించిన విగ్రహాన్ని అదే స్థానంలో ఏర్పాటు చేయాలంటూ దళితులు చేపట్టిన ఆందోళన రెండో రోజైన బుధవారం కొనసాగింది. కొందరు యువకులు టవర్‌ ఎక్కి నిరసన తెలపడంతో ఉప్పలగుప్తంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉప్పలగుప్తం మెయిన్‌ సెంటర్‌లో సిరిపల్లి, మునిపల్లి అర్‌అండ్‌బి ప్రధాన రహదారిని ఆనుకుని ఆదివారం అర్ధరాత్రి సమయంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేశారు. సోమవారం విషయం తెలుసుకున్న అమలాపురం రూరల్‌ సిఐ ఆర్‌.భీమరాజు సిబ్బందితో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన స్థలానికి చేరుకున్నారు. విషయాన్ని తహశీల్దార్‌ ఎన్‌వి.సత్యనారాయణకు తెలిపారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ విగ్రహాన్ని తొలగించి, తహశీల్దార్‌ కార్యాలయానికి తరలించారు. దీంతో దళిత నాయకులు ఆందోళనకు దిగారు.

అంబేద్కర్‌ విగ్రహం నెలకొల్పిన స్థలం పక్కనే గుడిని ఏర్పాటు చేశారని, దానికి లేని అభ్యంతరం అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటుకు ఎందుకని ప్రశ్నించారు. అధికారులు పట్టించుకోకపోవడంతో దళిత సంఘాల ఆధ్వర్యంలో బుధవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. సిరిపల్లి, మునిపల్లి ఆర్‌అండ్‌బి ప్రధాన రహదారిపై ఆందోళనకారులు రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా అధికారులు, దళిత నేతలతో చర్చలు జరిపారు. ఈనేపథ్యంలో తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలోని ప్రకృతి వైపరీత్యాలను తెలిపే సుమారు 200 అడుగుల ఎత్తున్న టవర్‌ పైకి నలుగురు యువకులు ఎక్కి అంబేద్కర్‌ విగ్రహాన్ని యథావిధిగా తొలగించిన స్థానంలోనే ఏర్పాటు చేయాలని, లేకుంటే టవర్‌ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుం టామంటూ యువకులు నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా అటు అధికారుల్లోనూ, ఇటు దళిత నాయకులు, ఆందోళన కారుల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నాలుగు గంటలపాటు టవర్‌ పైనే నిరసన తెలిపారు. ఈసందర్భంగా అధికారులు దళిత నాయకులతో చర్చలు జరిపారు. తహశీల్దార్‌, ఎంపిడిఒతోపాటు ఇరుసా మాజిక తరగతుల పెద్దలతో శాంతి కమిటీని ఏర్పాటు చేసి, మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈకార్యక్రమంలో దళిత సంఘం నాయకులు ఎంకె.భీమారావు, బొంతు బాలరాజు, కొంకి వెంకట బాబ్జి, దోనిపాటి అశోక చక్రవర్తి, దేవరపల్లి శాంతికుమార్‌, గెద్దాడ బుద్దరాజు పాల్గొన్నారు.

(Courtacy Prajashakti)

Leave a Reply