విగ్రహాన్ని పూజిస్తూ సందేశాన్ని మరిచామా?

0
167
కె. శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మంత్రివర్గ ప్రహసనం అనేక సీరియస్ విశ్లేషణలకు, సరదా వ్యాఖ్యలకు ఆస్కారమిచ్చింది. అధికారం లేని డొల్ల పదవులు ఇస్తారు కానీ, కాంట్రాక్టులిస్తారా, పోలీసు మంత్రిగా దళిత మహిళ ఒక కానిస్టేబుల్‌ను అయినా బదిలీ చేయగలదా, ఎస్సీలకు బీసీలకు కిరీటాలు తొడిగారంటారు కానీ, ఏ పదవీ లేకుండానే చక్రం తిప్పే చక్రవర్తులు ఏ కులం వాళ్లు, అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలు పరంపరగా ప్రత్యక్షమయ్యాయి. అవును కదా, పదవి వేరు అధికారం వేరు. పార్టీ టికెట్ తెచ్చుకుని, ఎన్నికల్లో గెలిచి చట్టసభ ప్రతినిధి అయినా, సెక్యూరిటీల శాల్యూట్లు మొక్కుబడి ప్రోటోకాల్స్ గ్యారంటీ తప్ప, అధికారం ఖరారు కాదు. అధికారం అంటే అదుపు, యాజమాన్యం, నియంత్రణ, నిర్ణయం తీసుకునే అర్హత. మరి ఓట్లు మావి, సీట్లు మీవా అని కన్షీరామ్ వేసిన ప్రశ్నకు ప్రాసంగికత లేదా? ఉన్నది, అధికారం సంపాదించడానికి సీట్ల సంపాదన అవసరమే. తగిన రాజకీయాలలో ఉన్న సరైన దళిత బహుజన రాజకీయ నాయకులు, రాజకీయ సమీకరణాలలో తిరుగులేని ప్రాధాన్యం సంపాదించుకుంటే వారి సాధికారత గణనీయంగా పెరుగుతుంది. కానీ, ముప్పై యేండ్ల దళిత బహుజన రాజకీయ ప్రయాణం ఆ దిశలో సాగగలిగిందా? వైఫల్యాలకు సమీక్ష ఉన్నదా?

ఆంధ్రప్రదేశ్ పరిణామాలంటే మరీ హాస్యాస్పదంగా ఉన్నాయి కానీ, తెలంగాణలో మాత్రం పదవులున్నవారందరికీ అధికారాలున్నాయా? పెద్ద కులాల మంత్రులు మాత్రం అంతా అధికార భాగస్వామ్యంతో అలరారుతున్నారా? ఢిల్లీలో కూడా, గతంలో మహా మహా నేతలైనవారు కూడా జీ హుజూర్ అనవలసి వస్తున్నది. సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా నిజమైన రాజకీయ ప్రజాస్వామ్యం సాధ్యం కాదని బాబా సాహెబ్ అంబేడ్కర్‌ అన్న మాటలు ఇక్కడ స్మరించుకోవాలి. కుల, మత, లింగ, ఆర్థిక, ఇంకా అనేకానేక అంతరాలున్న సామాజిక వ్యవస్థలో రాజకీయ ప్రజాస్వామ్యం కూడా రాచరికంలాగానో భూస్వామ్యంలాగానో కొనసాగుతుంది. ప్రాతినిధ్యం, భాగస్వామ్యం, సాధికారత అనే కొత్త మాటలకు అలవాటుపడిన శ్రేణుల కోసం అధికారం లేని పదవులు, నామమాత్రపు అధికారస్థానాలు సిద్ధం అవుతాయి. డొల్లతనాన్ని గుర్తించి ఆవేదనో ఆందోళనో చెందేవాళ్లు ఉంటారు. లేదు, ఇదే బాగున్నది, తమకు దక్కిన అందలమే సమస్త బాధితులకూ వైభవమని నమ్మే వాళ్లూ ఉంటారు.

రాజకీయ ప్రాతినిధ్యాన్నే కాదు, సమస్త జీవనరంగాలలోనూ దళితులకు, ఇతర బాధిత శ్రేణులకు భాగస్వామ్యాన్ని అంబేడ్కర్‌ కోరుకున్నారు. దేవాలయ ప్రవేశాన్ని ఆయన ఇష్టపడలేదు కానీ, ఊరుమ్మడి వనరులపై దళితులు తమ హక్కును పోరాడి సాధించుకోవాలని ఆయన ఆచరణాత్మకంగా సూచించారు. దేశవనరులైనా అంతే. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాల ప్రతిపాదన అయినా, ఆ తరువాత రాజకీయ రిజర్వేషన్లు అయినా దళితులు సగౌరవంగా సమాజంలో సమ్మిళతం కావడానికి సంకల్పించినవే. సాధికారత సులువుగా దొరికేది కాదని ఆయనకు తెలుసు. చదువు ద్వారా, తమ తమ సమాజాలలో నిరంతర కృషి చేయడం ద్వారా, అన్ని ప్రాతినిధ్య వ్యవస్థలలోనూ భాగస్వామ్యం పొందడం ద్వారా దళితులు ఉన్నతీకరణ చెందుతారని, తమ గురించిన నిర్ణయాలు మాత్రమే కాక, యావత్ సమాజం గురించి నిర్ణయం తీసుకునే అధికారం పొందుతారని ఆయన ఆశించారు.

అంబేడ్కర్‌ జాతీయోద్యమకాలానికి చెందిన మహానాయకుడు. ఆయన కాలానికి ‘దళిత’ అన్న పదం కూడా స్థిరపడలేదు. భారతదేశ సామాజిక వ్యవస్థను ముఖ్యంగా హైందవ సమాజంలోని హెచ్చుతగ్గులకు, దురాచారాలకు, అత్యాచారాలకు మూలమైన కులవ్యవస్థను, దానికి సైద్ధాంతిక పునాదులుగా ఉన్న మనుస్మృతిని, ఇతిహాసపురాణాలను ఆయన బోనులో నిలబెట్టారు. దుర్మార్గమైన తారతమ్యాలను బోధించిన గ్రంథాన్ని తిరస్కరించి, అందుకు విరుగుడు అన్నట్టుగా భారత రాజ్యాంగాన్ని బలహీనుల పక్షాన అండగా ఆవిష్కరించారు. బాబా సాహెబ్ గురించి మాట్లాడుకునేటప్పుడు, ఆయనను స్మరించుకునేటప్పుడు, ఆయన సిద్ధాంతాలను, ఆలోచనలను కూడా మననం చేసుకోవాలి. అంబేడ్కర్‌ ఒక విగ్రహం కాదు. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదు. ఆయన ఒక సాధికారతా ప్రవక్త. భారత రాజ్యాంగం యావత్ మానవ సమాజం తన ప్రయాణంలో సమకూర్చుకున్న అనేక గొప్ప విలువల కూర్పు, సంపుటి.

భారత రాజ్యాంగం హృదయమూ ఆత్మా ఏవి అంటే, అధికరణం 32ను చెప్పారు అంబేడ్కర్‌. రాజ్యాంగంలోని మూడో భాగం, అంటే ఆర్టికల్ 12 నుంచి 35 దాకా పొందుపరచిన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే, రాజ్యాంగబద్ధ పరిష్కారాలను ఆశ్రయించగలిగే అవకాశాన్ని ఆ అధికరణం ఇస్తుంది. ఈ అధికరణమే రాజ్యాంగానికి కీలకం అని ఆయన భావించారంటే, ప్రాథమిక హక్కులకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యం అర్థం అవుతుంది. చట్టం ముందు అందరికీ సమాన పరిగణన, మతం, జాతి, కులం, లింగం, పుట్టిన స్థలం వంటి ఏ ప్రాతిపదికల మీద కూడా వివక్ష పనికిరాదు, ఉపాధిలో సమాన అవకాశాలుండాలి. మాట్లాడే, వ్యక్తీకరించే స్వేచ్ఛ, సమావేశమయ్యే, సంఘటితమయ్యే, సంచరించే, నివాసముండే, ఇష్టంవచ్చిన వృత్తిని నిర్వహించే హక్కు పౌరులందరికీ ఉంటుంది. ఇష్టం వచ్చిన ఆలోచనాధారను, చైతన్యాన్ని కలిగి ఉండే స్వేచ్ఛ ఉంది. ఇష్టం వచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛా ఉంది. దేశభద్రతాది సందర్భాలలో ఈ హక్కులకు పరిమితులు ఏర్పరచే వీలును రాజ్యాంగం కల్పించింది కానీ, అనంతర ప్రభుత్వాధినేతలు ఆ పరిమితులనే సాధారణం చేస్తారని రాజ్యాంగ రచయితలు ఊహించి ఉండరు. ఎంత మంచి రాజ్యాంగమైనా చెడ్డవాళ్ల చేతిలో పడినప్పుడు ప్రయోజనం ఉండదని అంబేడ్కరే అన్నారు. చెడ్డ రాజ్యాంగమైనా పాలకులు మంచివారైతే అపకారం జరగదని కూడా ఆయనే అన్నారు. అంటే, ఒక లిఖిత ఆదర్శం కంటె ఆచరణకే ఆయన ప్రాముఖ్యం ఇచ్చారు. రాజకీయాల నుంచి పరిపాలనలోకి వచ్చే రాజకీయ నాయకుల మంచిచెడ్డల మీదనే ఆయన వక్కాణింపు ఉన్నది. రాజ్యాంగంలోని మంచిని నిలుపుకోవడానికి, ఇనుమడింపజేయడానికి మంచి పాలకులనే ఎంచుకోవాలన్న సూచనా అందులోనే ఉన్నది. మెరుగైన పాలకుల ఎన్నిక కూడా రాజ్యాంగ రక్షణే.

రాజ్యాంగానికి తూట్లు పొడిచి, హక్కులపై దొడ్డిదారిన ఉక్కుపాదం మోపి, మేలు చేసే మాటలకు వక్రభాష్యాలు చెప్పి మన పాలకులు తమ ఆచరణకు, పరిపాలనకు ఎటువంటి నైతిక ప్రాతిపదికా లేదని చాటుకుంటున్నారు. కొత్తగా కొందరు ప్రబుద్ధులు, అంబేడ్కర్‌ నిరసించిన మనుస్మృతిని భారత రాజ్యాంగంగా పరిగణించాలని కూడా వాదిస్తున్నారు. మరి, మనం ఏమి చేస్తున్నాము? అంబేడ్కర్‌ విగ్రహాలకు జరిగే అపచారంలో మాత్రమే అవమానాన్ని చూస్తున్నాము. ఏమి మాట్లాడుతున్నారో సోయి లేని అధికార ఉన్మత్తతలో వెలువడుతున్న కొత్త రాజ్యాంగ ప్రేలాపనలలో మాత్రమే రాజ్యాంగానికి ప్రమాదాన్ని చూస్తున్నాము. భాస్వరం బాంబు లాంటి ఉన్మాదం ఒకటి దేశమంతా అలుముకుంటుంటే, రాజ్యాంగాన్ని బాహాటంగా ధిక్కరిస్తూ చెడును సహిస్తూ మంచిని అణచివేస్తూ అధికార యంత్రాంగం ధృతరాష్ట్రపాలన సాగిస్తున్నప్పుడు, సమాజంలో ఎవరికి వారు సమస్య మనది కాదనుకుంటున్నారు. దోషివి నువ్వంటే నువ్వని తగవులాడుతున్నారు. మా గురించి మేమే మాట్లాడతాము అన్నది నిన్నటి గుర్తింపు ఉద్యమాల ప్రశ్న. ఇతరుల గురించి మేమెందుకు మాట్లాడాలి అన్నది నేటి విపరీత వాదన.

ఇప్పుడున్న స్థితిలో బాధపడుతున్నవారు, అగమ్యగోచరంగా ఉన్నవారు ఒకసారి అంబేడ్కర్‌ను పునర్దర్శించాలి. వారెవరైనా సరే, కాంగ్రెస్, కమ్యూనిస్టు, సెక్యులర్ ఎవరైనా సరే. ఆయన దళితుల నాయకుడు మాత్రమే కాదు. అందరి హక్కులను నిర్వచించినవాడు, సగౌరవ సహజీవనానికి ప్రాతిపదికలు కల్పించినవాడు. అన్నిటికి మించి, ఈ దేశాన్ని అర్థం చేసుకోవడానికి పనికివచ్చే అపార జ్ఞానసంపదను అందించినవాడు. అంబేడ్కర్‌ను పూజించేవారు ఆయనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అధునాతన మనుస్మృతి, ఒక ఆరోవర్ణాన్ని సృష్టించి, దళితులను, శూద్రులను నిచ్చెనమెట్లలో ఒక మెట్టు పైకి తీసుకువెడుతున్నదని, ఆయా శ్రేణులు అమాయకంగా, దానినే సాధికారతగా భ్రమించే ప్రమాదం ఉన్నదని తెలిసినవారు హెచ్చరించి మరీ చెప్పాలి. స్థానాలు, గెలుపులు, పదవులు, వీటితో పాటు అధికారం కూడా దక్కితేనే అది సాధికారత అని గ్రహింపు రావాలి.

వర్తమాన భారత చరిత్రరహదారిపై బైఠాయించి కూర్చున్న క్రూరమృగంతో పోరాడే బరువునో బాధ్యతనో తీసుకోవాలని దళిత బహుజనులను కోరడం అన్యాయం. అట్టడుగు వారిని కార్యకర్తలుగానే ఉంచి అగ్రస్థానాల నుంచి మినహాయించిన కమ్యూనిస్టులకు ఎవరినైనా ఏమైనా అడిగే నైతికత ఉన్నదా అన్నది అనుమానం. పెద్దపులిని దేశం మీదకు వదిలినవారే, దాని రాకడపై ఆదమరచినవారే దాని మెడలో గంటగట్టాలి. ఓట్లు గంపగుత్తగా వేసుకుంటూ గెలిపిస్తూ పోయిన జనం ఎందుకు దూరమయ్యారో కాంగ్రెస్‌కు అర్థం కావడం లేదు. ఇప్పుడు కొత్తగా దళిత విముక్తిని, మతోన్మాదంపై పోరాటాన్ని కలగలిపి వడ్డిస్తే ఎగిరి గంతేసి వస్తారనుకుంటున్నది.

పోరాడతారు. విజయఫలాలు దక్కని అనుభవాలు ఎన్ని ఉన్నా, అట్టడుగున ఉన్నవారు అనివార్యంగా పోరాడతారు. భ్రమల నుంచి కాక, తెలివిడి నుంచి ఆ పోరాటం నడచినప్పుడు విజయంతో పాటూ ఫలితమూ దక్కుతుంది. బాబా సాహెబ్ చూపుడు వేలు చూపుతున్న దిక్కు అదే కావచ్చు.

Courtesy Andhrajyothi

Leave a Reply