ఏప్రిల్ 4న అమెరికాలోని మిషిగన్‌లో నల్లజాతీయుడిపై స్థానిక పోలీసు దౌష్టం
మిచిగాన్ : కారు నంబర్ ప్లేటు తప్పుగా ఉందన్న ఒకే ఒక్క కారణంతో.. నిరాయుధుడైన నల్లజాతి యువకుణ్ని రోడ్డుపై బొక్కబోర్లా పడేసి, కాళ్లతో తొక్కిపట్టి.. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో తల వెనక భాగానికి గురిపెట్టి కాల్చిచంపేశాడో పోలీసు! అమెరికాలోని మిషిగాన్‌లో ఏప్రిల్ 4న జరిగిన ఈ ఘోరం తాలూకూ వీడియోలను మిషిగాన్ పోలీసులు గురువారం విడుదల చేశారు. ఆ రోజు 26 ఏళ్ల ప్యాట్రిక్ లయోయా అనే వ్యక్తి మిచిగాన్‌లోని గ్రాండ్ రాపిడ్స్ నగరంలో కారులో వెళ్తుండగా పోలీసు అధికారి అడ్డగించాడు. ప్యాట్రిక్ నడుపుతున్న కారుకు ఉన్న నంబర్ ప్లేట్ ఆ వాహనానిది కాదన్నాడు. అతడి డ్రైవింగ్ లైసెన్స్ అడిగితే.. కారులో ఉందని లయోయా చెప్పాడు. బయటకు తీసి చూపాలని పోలీసు అడిగాడు. ఇద్దరి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. లయోయా అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా పోలీసు అతడి వెంటపడ్డాడు. లయోయాను కింద పడేసి.. పైకి లేవకుండా కాళ్లతో తొక్కిపట్టిన పోలీసు తుపాకీతో అతడి తల వెనక భాగానికి గురిపెట్టి నిర్దాక్షిణ్యంగా కాల్చేశాడు. లయోయా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నాలుగు కెమెరాల్లో రికార్డయింది. లయోయాను చంపిన పోలీసు ఒంటిపై ఉన్న బాడీ క్యామ్‌లో, పోలీస్ కారు డ్యాష్‌బోర్డు క్యామ్‌లో, ఆ ప్రాంతంలో ఉన్న ఇంటి సీసీ కెమెరాలో, లయోయాతో పాటు కారులో ఉన్న వ్యక్తి ఫోన్‌లో. అన్ని వీడియోలనూ పోలీసులు విడుదల చేశారు.