-ఉద్యోగ, కార్మికుల్లో పెరుగుతున్న ఆందోళన
వాషింగ్టన్: ప్రపంచంలో అన్ని ప్రాంతాలను కరోనా వైరస్ వేగంగా చుట్టుముడుతున్న నేపథ్యంలో పనిపరిస్థితుల్లో కొరవడుతున్న భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ వివిధ రంగాలకు చెందిన కార్మికులు ఆందోళన బాట పడుతున్నారు. పెరుగుతున్న పని వత్తిడిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ అత్యవసరం కాని పనులకు తెరదించాలని, కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన వనరులను సమకూర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎటువంటి రక్షణా లేకుండానే కీలకమైన సేవలందిస్తున్న నర్స్‌లు, ఆరోగ్య కార్యకర్తల, అమెజాన్, పోస్టల్ కార్మికులు, రిటైల్ వ్యాపారం, ఫుడ్‌ప్రొసెసింగ్, సేవారంగాలకు చెందిన కార్మికులు వరుసగా సమ్మె బాట పడుతూ ఆందోళనలు చేపడుతుండటంతో ఒక దాని తరువాత ఒకటిగా ప్రపంచ దేశాలలో అశాంతి భగ్గుమంటోంది. అదే సమయంలో కార్మికులు తిరిగి పనిలోకి వచ్చేలా వత్తిడి పెంచేందుకు ఇతర దేశాల ప్రభుత్వాలతో కలిసి అమెరికాలోని ట్రంప్ సర్కారు ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ కరోనా వైరస్ మరింత విస్తరిస్తే కార్మికుల ప్రాణాలను బలి పెట్టేందుకైనా వెనుదీయరాదన్న ఆలోచనలతో ట్రంప్ సర్కారు అడుగులు వేస్తోందని భావిస్తున్నట్లు విమర్శకులు చెబుతున్నారు. శని, ఆదివారాల్లో వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశాలలో ట్రంప్ మాట్లాడుతూ వచ్చే వారం మరింత గడ్డుకాలమని, మరణాలు అధికసంఖ్యలో సంభవించవచ్చని హెచ్చరించారు. అయితే ఈ సమయంలో కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థను సత్వరమే పునరుద్ధరించాలన్న తన డిమాండ్ పునరుద్ఘాటించిన ట్రంప్ ‘పనులకు రాని వారికి కూడా తాము వేతనాలు చెల్లిస్తున్నామ’ని ఫిర్యాదు చేశారు.
వారు వెంటనే పనులకు హాజరవ్వాలని ఆయన హుకుం జారీ చేశారు. వీలయినంత త్వరగా ఉత్పత్తి, వ్యాపార కార్యక్రమాలు ప్రారంభించి కార్పొరేషన్లు, బడా వ్యాపార సంస్థలు, బ్యాంకుల లాభార్జనకు మార్గం సుగమం చేయాలని ట్రంప్‌తో పాటు అనేక దేశాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న తరుణంలో కార్మికలోకం తమ ప్రయోజనాల పరిరక్షణ కోసం వాకౌట్లు, నిరసనలు, సమ్మెల రూపంలో తమ కార్యాచరణను ఉధృతం చేస్తోంది. కార్మికులు, ఉద్యోగుల ఆందోళనలతో బెల్జియంలో పది సూపర్‌మార్కెట్లు మూతపడ్డాయి. హాండ్ శానిటైజర్లు, ఇతర భద్రతా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ బ్రిటన్‌లోని కెంట్‌లోవున్న రాయల్ మెయిల్ వర్కర్లు ఇటీవల సమ్మె ఆట పట్టారు.
విధి నిర్వహణలో తమకు భద్రత కల్పించాలని కోరుతూ బహామాస్‌లో ఎమర్జెన్సీ మెడికల్ వర్కర్లు ఇటీవల వాకౌట్ చేయటంతో, దానిపై ప్రతిస్పందించిన ఆరోగ్య మంత్రి ఆరోగ్య పరిరక్షణ వర్కర్ల భద్రత కోసం 5 వేల డాలర్లు చెల్లించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. పని పరిస్తితుల్లో భద్రత కల్పించాలని కోరుతూ మెసాచుసెట్స్‌లో దాదాపు 10 వేల మంది నిర్మాణ రంగ కార్మికులు, కార్పెంటర్లు సోమవారం సమ్మె బాట పట్టారు. కొలరాడోకు చెందిన ప్రధాన ఆహారోత్పాదక సంస్త జెబిఎస్‌లో దాదాపు వెయ్యి మంది కార్మికులు ఇదే డిమాండ్ తో గత సోమవారం విధులను బహిష్కరించారు. అమెజాన్‌కు చెందిన ఇద్దరు వర్కర్లకు కరోనా సోకినట్లు నిర్దారణ కావటంతో, విధి నిర్వహణలో తమకు భద్రత కల్పించాలన్న డిమాండ్‌తో చికాగోలోని అమెజాన్ డెలివరీ వర్కర్లు శుక్ర, శనివారాల్లో సమ్మె చేశారు. అంతకు ముందు డెట్రాయిట్, న్యూయార్క్ రాష్ట్రాల్లో అమెజాన్ వర్కర్లు వారం రోజులు సమ్మె నిర్వహించిన విషయం తెలిసిందే. ఈస్టర్ పండుగ నాటికి ఆర్థిక వ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ గాడిన పడాలన్న ట్రంప్ సర్కారు నిశ్చయానికి, కార్మికలోకం నుండి ఎదురవుతున్న ఆగ్రహం, నిరసనలతో తీవ్ర విఘాతం కలుగుతోంది. ఈ ఆగ్రహాన్ని చల్లార్చి పనిపరిస్థితులలో మరింత భద్రత కల్పిస్తే ప్రభుత్వ నిర్ణయానికి ఉద్యోగ, కార్మిక వర్గాలు తప్పకుండా సహకరిస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Courtesy Nava Telangana