తెలుగు నేలపై ఉద్యమాలకు ఊపిరిలూదిన ఉ.సా.

0
463

ఉద్యమాల శ్వాస ఉసాగా చిరపరిచితుడైన ఉప్పుమావులూరి సాంబశివరావు జులై 25 వ తేదీన హైదరాబాదు లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కరోనా మహమ్మారితో పోరాడి మరణించాడన్న వార్తతో ఒక్కసారిగా తెలుగు నేలపై విషాద ఛాయలు కమ్ముకున్నాయి.దళిత- బహుజన వర్గాలు, విప్లవ శ్రేణుల లోని ఆయన అభిమానులు ఈ వార్తను జీర్ణించుకోలేక పోయారు. ఇటు బహుజన ఉద్యమాలూ,అటు వామపక్ష విప్లవోద్యమాలూ సమంగా ప్రేమించిన ఉద్యమకారుడు ఉసా. మార్క్సిజాన్ని,అంబేద్కరిజాన్ని సమన్వయీకరించి సిద్దాంత ఆచరణలో ప్రయోగిస్తూ జీవితాంతం అనేక ఉద్యమాలను నడిపిన ధీశాలి ఉసా. అంతేకాకుండా అటు యువతీ యువకుల్ని,ఇటు మధ్య వయస్కుల్ని సమాన స్థాయిలో ప్రభావితం చేయగలిగిన సమన్వయ కర్త ఉసా. నాయకుడిగా, సిద్ధాంత కర్తగా, కవిగా, రచయితగా, వక్తగా, బోధకుడిగా, గాయకుడిగా మరియు గేయకుడిగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సుప్రసిద్ధుడు ఉసా.చిరునవ్వుతో అందరినీ కలేసుకుంటూ భేషజాలు లేని సాదాసీదా వ్యక్తిగా గడిపాడు. విప్లవోద్యమాల నుంచి బహుజన ఉద్యమాల వరకూ సాగిన మరియు సాగుతున్న సామాజిక,రాజకీయ ఉద్యమాల మలుపులన్నింటిలోనూ ఉసా ఉదాత్త పాత్ర ఉంది. ఉద్యమాల నుంచి వేరు చేసి ఆయన్ను చూడలేం.ఆయన్ను వేరు చేసి ఉద్యమాలను చూడలేం.ఇదే ఉసా విశిష్టత.

గుంటూరు జిల్లా లోని తెనాలి సమీపంలోని బ్రాహ్మణకోడూరు కుగ్రామంలో మంగలి (తొలి వైద్యులు) కుటుంబంలో పుట్టిన ఉసా సామాజిక వైద్యుడు అయ్యాడు. ఉసా 1960 వ దశకంలో తెనాలి డిగ్రీ కాలేజీలో యువ విద్యార్థిగా ఉంటున్నప్పుడే హేతువాదిగా జీవితాన్ని ప్రారంభించాడు. నక్సల్బరీ ఉద్యమం బద్దలయ్యాక ఉసా కమ్యూనిస్టు విప్లవ సిద్ధాంతం వైపు ఆకర్షితుడై తరిమెల నాగిరెడ్డి పార్టీలో చేరారు.1974 లో తెనాలిలో ఏర్పడిన అరుణోదయ సాంస్కృతిక సంస్థ కన్వీనర్‌గా ఎమర్జెన్సీ వరకూ పనిచేశాడు. ఎమర్జెన్సీలో ఉసా పూర్తి కాలపు విప్లవకారుడిగా పనిచేస్తున్న క్రమంలో తూర్పు గోదావరి జిల్లా ద్వారంపూడి వద్ద అరెస్టు అయ్యాడు. దాదాపు రెండు సంవత్సరాలు జైలు జీవితం గడిపారు.

ఎమర్జెన్సీ తరువాత వివిధ బాధ్యతలు నిర్వహిస్తూనే కవిగా అజరామరమైన పాటలు రాశారు. పిల్లల్ని వదిలేసి తల్లులు పొలం పనులకు పోతే, బడికి వెళ్ళాల్సిన పిల్లలు తమ తరువాత పుట్టిన చెల్లెళ్ళనూ, తమ్ముళ్ళనూ ఆడించాలి. వాళ్ళ ఏడుపు ఆపడానికి పిల్లలు పడరాని పాట్లు పడతారు. అలాంటి వాళ్ళ కన్నీళ్ళు ఒక్క చుక్క కూడా నేల పాలు కానివ్వకుండా తన కలంలో నింపుకుని “జోలాలి పాడాలి” పాట రాశాడు. పోలీసు నిర్బంధం గురించి ” మేమెందుకిలా మారామో తెలుసా”అనే పాట,నాడు బ్యాంకు అప్పు వసూళ్ళ పేరుతో రైతులపై సాగుతున్న వేధింపులపై “అప్పులు మేం తీర్చలేం ఆందోళన సాగిస్తాం” అనే పాట, జనసాహితీ ప్రారంభ గీతాలుగా స్వీకరించిన “మేం జనం పాట పాడుతాం” మరియు ” కవి ఓ కళాకారుడా కవయిత్రి ఓ కళాకారిణి ” ఇవే కాకుండా విద్యార్థులను ఉద్యమాల వైపు ఉత్తేజ పరిచిన ” హల్లో స్టూడెంట్స్ హౌ ఆర్ యు ఆప్టర్ స్టడీస్ హు ఆర్ యు” వంటి అనేక ఉద్యమ పాటలు ఉసా కలం నుండి జాలువారినవే కావడం చరిత్ర దాచిన సత్యం.

బహుముఖ ప్రతిభా పాటవాలతో ఉసా సిద్ధాంత కర్తగా, కవిగా,గాయకుడిగా పరిణామం చెందారు.సాయుధ పోరాటం వైపు మొగ్గు చూపి తూర్పు గోదావరి జిల్లా కొండ మొదలు గిరిజన విముక్తి పోరాటంలో మమేకమై 1980 ల వరకూ అక్కడే నివసించారు. తెలంగాణలో ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో తీవ్రమైన కరువు వ్యాపించడంతో తాగునీరు, సాగునీరు సౌకర్యం కల్పించాలనే డిమాండ్ తో మోత్కూరు రైతులను సంఘటితం చేసేందుకు బాధ్యతలను చేపట్టారు. మోత్కూరు లోనే ఐదేళ్ళు నివసించిన ఉసా కులంతో పనిలేకుండా రైతు కుటుంబాలలో ఒకరిగా కలిసిపోయారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా అనేక వ్యవసాయ సమస్యలపై వేలాది మందిని కదిలించారు. అదే సమయంలో 1985 లో కారంచేడు దళితులపై హత్యాకాండ ఘటన జరిగింది.

కారంచేడు ఉద్యమం నుంచి అంబేద్కర్ తాత్వికతను ఒంటబట్టించుకున్న ఉసా శషభిషలు లేకుండా దళిత మహాసభ తో దళిత ఉద్యమం వైపు నిలిచాడు. ఇదే ఆయనను కమ్యూనిస్టు పార్టీ నుంచి బహిష్కరించబడడానికి కారణమైంది. కారంచేడు ఘటన కుల దురహంకారానికి నిదర్శనమని,అందులో ఉన్నది వర్గ సమస్య కాదని, తరతరాలుగా వేళ్ళూనుకున్న కుల అసమానతల సంఘర్షణే అని విశ్లేషించారు.తనతో విభేదించిన యు.సి.సి.ఆర్.ఐ (యమ్.యల్) ఉసాను పార్టీ నుంచి బహిష్కరించింది. ఉద్యమంలో తనతో పాటు పనిచేసిన సహచరి పద్మతో పాటు బయటకు వచ్చిన ఉసా ఆనాటి నుంచి సామాజిక సంస్కరణల్లో,కుల వ్యతిరేక పోరాటాలలో పాల్గొంటూ వచ్చారు. అదే సమయంలో కంచ ఐలయ్య కూడా పార్టీ నుంచి బయటకు వచ్చారు. మరోవైపు పీపుల్స్ వార్ నుంచి మహాకవి శివసాగర్ ( కె.జి.సత్యమూర్తి) బయటకు రావడం ఇంచుమించు అదే సమయంలో జరిగింది. ఉసా 1987 నాటికే వర్గ,కుల దృక్పథంతో జరగాల్సిన ఉద్యమం గురించి స్పష్టమైన వాదనతో ఒక పుస్తకం రాశాడు.1987-89 మధ్య కాలంలో మహబూబ్ నగర్ జిల్లాలో ప్రత్యేకించి కృష్ణా నది ఒడ్డున ఉన్న గ్రామాలలో కరువు బారినపడిన ప్రజలకు సహాయం చేసే కృషిలో ఐలయ్యతో పనిచేశారు. మార్క్సిస్ట్, లెనినిస్ట్ సెంటర్ ఏర్పాటులోనూ ముఖ్య భూమిక పోషించారు ఉసా.

శివసాగర్ మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చాక ఇరువురు కలిసి “ఎదురీత” పత్రిక స్థాపించారు.ఉసా ఆధ్వర్యంలో “ఎదురీత” పత్రిక గొప్ప సైద్ధాంతిక పోలరైజేషన్ కు దోహదం చేసింది. తెలుగు మేధో వాతావరణాన్ని ఒక మలుపు తిప్పిన చారిత్రక పాత్రను అది నిర్వర్తించింది.ఎదురీత పత్రిక ద్వారా వ్యాస రూపంలో అంతర్జాతీయ విప్లవ స్వాప్నికుడు “చేగువేరా”ను తెలుగు ప్రజలకు పరిచయం చేసింది కూడా ఉసానే. కలిసొచ్చిన అనేక మందితో కలసి రాజకీయ,సామాజిక ఐక్య కార్యాచరణకు సంబంధించిన అనేక ప్రయత్నాలు చేసాడు. ఈ క్రమంలోనే మంద కృష్ణ మాదిగ, ఆర్ కృష్ణయ్య లతో కలిసి పనిచేశాడు. ఈ లోపే మండల్ ఉద్యమం పొడ చూపింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఓబిసి రిజర్వేషన్లకు మద్దతుగా ప్రజలను కూడగట్టడంలో ఉసా అత్యంత క్రియాశీలక పాత్ర పోషించాడు. అటు మార్క్సిజం, ఇటు అంబేద్కరిజం రెండింటిలోను ఉసా కీలకమైన సిద్ధాంత వేత్తగా, వక్తగా, గొప్ప సమన్వయ కర్తగా పరిణమించాడు. ఆయన రచనలు, ప్రసంగాలు నిప్పు కణిక లాంటి కుల,వర్గ నిర్మూలన పోరాట యోధుడు మారోజు వీరన్న వంటి విప్లవోద్యమ కార్యకర్త లను సైతం ఆలోచింప జేసి ప్రభావితం చేసాయి.వీరన్నతో మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఉసా ఆంధ్ర ప్రాంతంలో కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బలపరుస్తూ అనేక సమావేశాలు నిర్వహించారు. అంతేకాక గత అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు సి పి యం మద్దతుతో ఏర్పడిన టీ.మాస్,బహుజన లెఫ్ట్ ఫ్రంట్ లోనూ ఉసా భాగమయ్యారు.

కులాంతర వివాహాలకు ఉసా గొప్ప మద్దతుదారు. తాను స్వయంగా పార్టీలో పనిచేస్తున్న బ్రాహ్మణ కులానికి చెందిన పార్టీ కార్యకర్త పద్మను వివాహమాడారు. పద్మ రాసిన “ఆప్టరాల్ ఆడదాన్ని” స్త్రీ వాద కవితకు ప్రేరణ మరియు ఊపిరి “ఉసా”నే కావడం విశేషం. పార్టీతో విభేదించి ఉసా తో కలసి బయటకు వచ్చాక పద్మ ఎ.సి.టీ.ఓ.గా ఉద్యోగం చేయడం ద్వారా సహచరుడు ఉసా కు మద్దతుగా నిలిచింది. తమ ఏకైక కుమార్తెను చక్కగా చదివించారు. కొన్నేళ్ళ క్రితం ఆమె అనారోగ్యంతో చనిపోయారు. ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత మరియు కొందరు మిత్రులతో కలసి బహుజన సాంస్కృతిక సంస్థను ప్రారంభించిన ఉసా భావజాల ప్రసారం కోసం దేశి- దిశ అనే యూట్యూబ్ ఛానల్ ను మొదలు పెట్టి తన ఇంటినే స్టూడియోగా మార్చాడు. కుల పరమైన అత్యాచారాలు ఎక్కడ జరిగినా అక్కడకు వెళ్ళేవారు. స్వయంగా అనేక కులాంతర వివాహాలు జరిపించాడు. మహిళల హక్కులు, సమానత్వం పట్ల తాను చూపిన నిబద్ధత సాటి లేనిది. పితృస్వామ్యం నుంచి మహిళలు ఎలా విముక్తి చెందాలో అనేక రచనలు చేశాడు. గిరిజన ప్రాంతాలలో, మోత్కూరు, కొల్లాపూర్ గ్రామాలలో మరియు దళిత బహుజన వాడలలో కలగలసి పోయాడు. వివిధ పొలిటికల్ డాక్యుమెంట్లు రూపొందడంలో కీలక పాత్ర నిర్వర్తించాడు. కాపు రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దమని,వాటికి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రదేశ్ అంతటా సభలు,సమావేశాలు నిర్వహించి బి.సి. ప్రజలను కూడగట్టాడు.బి.సి,యస్.సి.,యస్.టీ,మైనారిటీ ప్రజలను దృష్టిలో ఉంచుకుని జనాభా దామాషా ప్రకారం రాజ్యాధికారం మరియు రిజర్వేషన్లలో “మేమెంతో మాకంత” వాటా కోసం పిలుపునిచ్చాడు.కుల నిర్మూలన ఉద్యమంలో భాగంగా ” బహుజన ప్రతిఘటనా వేదిక”ను నిర్మించి పలు ఆందోళనల్నీ,పోరాటాల్నీ చేయడంలో ముఖ్య పాత్ర వహించాడు.

పూలే- అంబేద్కరిజంపై అనేక పుస్తకాలు, వ్యాసాలు రాసాడు. హేతువాదం,సైన్స్, బుద్ధిజం పట్ల విశ్వాసం ఉన్న వాడిగా మూఢ నమ్మకాలు, అజ్ఞానం, పట్ల బద్ద విరోధాన్ని ప్రకటించాడు. తన రాజకీయ, సైద్ధాంతిక కార్యాచరణలో భాగంగా ఆయన అనేక మంది ప్రజల ఇళ్లలో ఉండేవారు.వందకు పైగా పుస్తకాలు రాసి తెలుగు నేలపై బౌద్ధాన్ని తన రచనలు, ఉపన్యాసాలు మరియు యూట్యూబ్ ఛానల్ ద్వారా నలుదిశలా వ్యాపింపజేస్తున్న బొర్రా గోవర్ధన్ తనకు ఉద్యమంలో, సాహిత్యంలో ఓనమాలు దిద్దిన గురువు “ఉసా” అని ప్రకటించాడు.సమత కోసం ప్రపంచానికి బౌద్ధాన్ని త్రిపీఠకాల ద్వారా సామాన్య జనానికి జ్ఞానాన్ని చేరువ చేసిన బౌద్ధ ఉపాలి వారసత్వ సంపద ఉసా కావడం గమనార్హం. ఒక విప్లవకారుడిగా,మానవ హక్కుల ఉద్యమకారుడిగా,కుల వ్యతిరేక ఆదర్శవంతుడిగా,మార్క్స్,మహాత్మా జ్యోతిబా ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ అనుయాయిగా,బౌద్ధ అభిమానిగా ఉసా వారసత్వం సాటి లేనిది. సంభాషణల ద్వారా, సంస్కార వంతమైన చర్చ ద్వారా విభేదాల్ని పరష్కరించుకునే ప్రజాస్వామ్య సంస్కృతిని ఉసా నుంచి మనం నేర్చుకోవాలి.తన యాభై ఏండ్ల ఉద్యమ జీవితంలో అనేక మందికి ప్రేరణగా నిలిచిన ఉసా ను స్మరించుకుంటూ వారు కలలగన్న సమానత్వ సమాజం కోసం కృషి చేయడానికి ప్రతినబూనుదాం.

అన్నం శ్రీనివాసులు
ఆర్గనైజింగ్ సెక్రటరీ
బి.సి.ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎ.పి.
నెల్లూరు జిల్లా శాఖ

Leave a Reply