- మళ్లీ మృతదేహాల తారుమారు
- ఒకరి మృతదేహం మరొకరి కుటుంబానికి అప్పగింత
- ఖననంతో వెలుగులోకి
- కనిపించని మరో మృతదేహం
హైదరాబాద్ సిటీ/అడ్డగుట్ట/పహాడీషరీఫ్ : కొవిడ్-19 రోగుల మృతదేహాల అప్పగింతల్లో గాంధీ ఆస్పత్రిలో గందరగోళం నెలకొంటోంది. అధికారులు అనుమతించిన తర్వాత వాటిని తీసుకెళ్లే క్రమంలో.. కరోనా భయంతో కుటుంబ సభ్యులు మృతుల ముఖాల్ని చూడటం లేదు. దీంతో మృతదేహాలు తారుమారవుతున్నాయి. మెహదీపట్నంలోని ఓ ఆస్పత్రి యజమాని కరోనాతో బాధపడుతూ.. ఈ నెల 8న గాంధీలో మృతి చెందారు. దీంతో కుటుంబీకులు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు గాంధీ మార్చురీకి వెళ్లారు. అయితే ఎంతసేపు వెతికినా అతడి మృతదేహం లభించలేదు. ఈ విషయమై ఎంబీటీ నేత అంజదుల్లాఖాన్.. కేటీఆర్‌కు, ఇతర నేతలకు ట్వీట్లు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. విచారణ అనంతరం.. మృతదేహాన్ని శ్రీరామ్‌కాలనీకి చెందిన మృతుడి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు తేలింది. మంగళవారం రాత్రి మృతి చెందిన అతడి బదులు మెహదీపట్నం వ్యక్తి మృతదేహాన్ని గాంధీ సిబ్బంది అప్పగించారు. వారు బుధవారం రాత్రే ఖననం కూడా చేసేయడం గమనార్హం. అనంతరం ఆ మృతదేహం వేరే వ్యక్తిదని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, తమ కుటుంబీకుడి మృతదేహాన్ని అప్పగించాలంటూ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొ. రాజారావును ఆశ్రయించారు. వారి కుటుంబ సభ్యుడి మృతదేహం మార్చురీలో లభ్యమైంది. అనంతరం ఇరువురు మృతుల కుటుంబసభ్యుల మధ్య పోలీసులు, ఆస్పత్రి వైద్యులు రాజీ కుదిర్చారు. మరో ఘటనలో.. బేగంపేట్‌కు చెందిన ఓ వ్యక్తి కరోనాతో చనిపోతే.. మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తీరా శ్మశానవాటికకు తీసుకెళ్లాక అది వేరెవరి మృతదేహామో కావడంతో, తిరిగి గాంధీ మార్చురీలో వదిలేశారు. ఇలాంటి పలు ఘటనలు గాంధీలో జరగడం పట్ల మృతుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రషీద్ మృతదేహం తారుమారుపై డీఎంఈ విచారణ
గాంధీలో మృతదేహాలు తారుమారైనట్లు సమాచారం అందుకున్న డీఎంఈ డాక్టర్ రమే్‌షరెడ్డి గురువారం హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రి అధికారులు, వైద్యులతో కలిసి, రికార్డులు పరిశీలిస్తున్నారు. శ్రీరామ్‌కాలనీ వ్యక్తికి చెందిన మృతదేహం ఎమైందో తెలియకపోవడంతో.. ఎవరికి ఇచ్చారనే కోణంలో రవితేజ అనే వ్యక్తిని విచారిస్తున్నారు.
4 కోట్ల మందికి ఒకే ఆసుపత్రా..?
రాష్ట్రంలోని నాలుగు కోట్ల ప్రజలకు కేవలం ఒక్క ఆస్పత్రి మాత్రమే పనిచేయడమేమిటని ఎంబీటీ నేత అంజదుల్లాఖాన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కనబడకుండా పోయిన ఖురేష్ మృతదేహం ఎక్కడుందో చెప్పాలంటూ ఆయన ఆసుపత్రి అధికారులను నిలదీశారు. ఈ ఘటనలో సీఐడీ దర్యాప్తు జరిపించాలని ఆయన కోరారు.
Courtesy Andhrajyothi