ధాన్యం కుప్ప వద్దే.. రైతు ఆత్మహత్య

0
158

కామారెడ్డి జిల్లాలో ఘటన

నిజామాబాద్‌ : ధాన్యం వద్ద కాపలా పడుకుని గుండెపోటుతో రైతు చనిపోయిన ఘటన మరవకముందే ధాన్యం కుప్ప వద్దే మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజీపేటలో సోమవారం వెలుగుజూసింది. పంట దిగుబడి సరిగ్గా రాక.. అప్పులు తీర్చే దారి తెలీక రైతన్న అసువులుబాసాడు.

ఈ ఘటనకు సంబంధించి బాధిత బంధువులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. బాన్సువాడ మండలం హన్మాజీపేట గ్రామానికి చెందిన సింగం శంకర్‌ మూడెకరాల్లో పంటలు సాగు చేశాడు. వర్షాభావ పరిస్థితుల వల్ల దిగుబడి సరిగ్గా రాలేదు. అదే సమయంలో కుమార్తె శ్వేతకు పక్షవాతం రావడంతో వైద్యం కోసం ఆరు లక్షల వరకు ఖర్చు చేశాడు.

ఈ యేడు పంటలు బాగా పండితే సగం అప్పు అయినా తీర్చుదామని భావించాడు. కానీ దిగుబడి సక్రమంగా రాలేదు. వచ్చిన పంటనూ కొనేవారు లేరు. దీంతో ఆదివారం రాత్రి ధాన్యం రాశి వద్ద కాపలాగా పడుకునేందుకు వెళ్లిన శంకర్‌ అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Courtesy Nava Telangana

Leave a Reply