ముస్లిం క్యాబ్ డ్రైవర్పై మరో “జై శ్రీరాం”హత్య సంఘటన

0
203

ముస్లింలను లక్ష్యంగా చేసుకొని జై శ్రీరాం నినాదం అనాలంటూ జరుగుతున్న దాడుల పరంపర కొనసాగుతున్నది. జార్ఖండ్‌ మారణకాండ ఘటన మరువకముందే ముంబయిలో మరో దాడి ఘటన వెలుగుచూసింది.

థానేలోని దివ్యా ప్రాంతంలో 25 ఏండ్ల ముస్లిం యువకుడిని ‘జై శ్రీరాం నినాదం’ చెప్పాలంటూ ముగ్గురు యువకులు దాడికి పాల్పడ్డారు. ఈ ముగ్గురూ దివ్యా గ్రామానికి చెందినవారు కావటం గమనార్హం. బాధితుడి ఫిర్యాదుమేరకు ముగ్గురినీ పోలీసులు అరెస్టుచేశారు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడు ఫైసల్‌ ఉస్మాన్‌ వివరించాడు. ‘2018 నుంచి నేను క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం మూడు గంటల ప్రాంతంలో దివ్యాలోని మానవ్‌ కళ్యాణ్‌ ఆస్పత్రి నుంచి ప్రయాణికులను ఎక్కుంచుకొని ముంబయికి వెళుతుండగా కారు ఫెయిలయింది. కారు పార్కింగ్‌ లైట్లు వేసి కారును స్టార్‌ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ముగ్గురు వ్యక్తులు అక్కడకు వచ్చారు. కారును ఎందుకు ఆపావంటూ బైక్‌పై వచ్చిన ఆ ముగ్గురూ దౌర్జన్యానికి దిగారు. తాను ముస్లింనని గ్రహించిన వారు కారు నుంచి తనను బయటకు లాగి కొట్టారు. జైశ్రీరాం అంటేనే విడిచిపెడతామంటూ బెదిరించారు.
క్యాబ్‌లో కూర్చున్న ప్రయాణీకుల్లో ఒకరు పోలీసులకు ఫోన్‌ చేయగా.. మొబైల్‌ ఫోన్‌ను లాక్కొని పరారయ్యారు’ అని బాధితుడు ఫైసల్‌ ఉస్మాన్‌ వాపోయాడు. వారి బైక్‌ నెంబర్లను నోట్‌ చేసుకున్న ఫైసల్‌ వాటిని ఫిర్యాదులో పేర్కొనటంతో పోలీసులు నిందితులు జైదీప్‌ ముండే, మంగేష్‌ ముండే, అనిల్‌ సూర్యవంశీలను అదుపులోకి తీసుకున్నారు. ‘ఇలాంటి ఘటనలను సామాజిక మాధ్యమంలో చదివాను. కానీ, నేను దానిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఊహించలేదు. చాలా భయపడ్డాను. పోలీసులు సహకరించారు’ అని ఉస్మాన్‌ తెలిపారు.

(నవ తెలంగాణసౌజన్యంతో)

Leave a Reply