చైనా నుంచి మరో మహమ్మారి!!

0
270
  • క్రమంగా బలపడుతున్న ‘జీ4’ ఫ్లూ వైరస్‌
  • మనుషులకు సోకే లక్షణాలున్నట్లు గుర్తింపు
  • ప్రస్తుతానికి పందుల నుంచి మనుషులకు వ్యాప్తి
  • ఫెర్రెట్‌లపై ప్రయోగ పరీక్షల్లో వెల్లడి

బీజింగ్‌ : కరోనా కల్లోలంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచ దేశాలకు చైనా మరో చేదువార్తను వినిపించింది. కొవిడ్‌-19లా మనుషులకు సోకడానికి అవసరమైన అన్ని లక్షణాలు కలిగిన ప్రమాదకర ‘ఫ్లూ వైరస్‌’ ఒకటి ఇప్పుడిప్పుడే బలపడుతోందని ఆ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రస్తుతానికి అది పందుల నుంచి మనుషులకు వ్యాపిస్తోందని తెలిపారు. దానికి ‘జీ4 ఈఏ హెచ్‌1ఎన్‌1’ అని పేరు పెట్టారు. ఈమేరకు వివరాలతో చైనా శాస్త్రవేత్తలు రూపొందించిన ఓ అధ్యయన నివేదిక ‘పీఎన్‌ఏఎస్‌’ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ వైరస్‌ 2009 సంవత్సరంలో ప్రపంచాన్ని వణికించిన హెచ్‌1ఎన్‌1 వైరస్‌ జాతికి చెందిందేనని పరిశోధకులు స్పష్టంచేశారు. 2011 నుంచి 2018 మధ్యకాలంలో జంతువధ శాలలు, పశు వైద్యశాలల్లోని 30వేల పందుల ముక్కుల నుంచి స్రావాల నమూనాలను సేకరించి పరీక్షించగా, 179 రకాల స్వైన్‌ ఫ్లూ వైర్‌సలను గుర్తించినట్లు తెలిపారు. వీటిలో చాలావరకు కొత్త రకం ఫ్లూ వైర్‌సలు 2016లో ఏర్పడినవేనన్నారు.

వైరల్‌ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు అచ్చం మనుషుల్లా ప్రవర్తించే తత్వం కలిగిన ఫెర్రెట్‌ల(ముంగిసలా ఉండే జంతువులు)లోకి 179 రకాల స్వైన్‌ ఫ్లూ వైర్‌సలను ప్రవేశపెట్టి, వాటిలో చోటుచేసుకున్న ఆరోగ్య మార్పుల వివరాలను నమోదుచేశారు. ఈ సమాచారాన్ని విశ్లేషించగా మిగతా వాటన్నింటి కంటే జెనోటైప్‌ 4(జీ4) రకం స్వైన్‌ ఫ్లూ వైర్‌సతో ఫెర్రెట్‌లకు తీవ్ర ఇన్ఫెక్షన్‌ సోకినట్లు వెల్లడైంది. దీంతో మానవ శరీర కణాలపైనా జీ4 వైరస్‌ ఇదే విధమైన ప్రభావాన్ని చూపగలదనే అంచనాకు వచ్చారు. గతంలో సీజనల్‌ ఫ్లూ ఇన్ఫెక్షన్ల బారినపడిన వారికి సంక్రమించిన రోగ నిరోధక శక్తి.. జీ4 వైరస్‌ సోకేవారిని రక్షించలేదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

చైనాలోని పలు ప్రాంతాల్లో ఉండే పంది మాంసం పరిశ్రమల్లో పనిచేసే ప్రతి 10 మంది కార్మికుల్లో ఒకరికి ఇప్పటికే జీ4 వైరస్‌ సోకిందని తెలిపారు. వారికి యాంటీబాడీ రక్తపరీక్షలు నిర్వహించగా ఈవిషయం తేలిందన్నారు. దీన్నిబట్టి జీ4 వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సోకుతోందనే స్పష్టతకు వచ్చారు. అయితే ఇది కరోనా వైర్‌సలా మనుషుల నుంచి మనుషులకు సోకడంపై ప్రస్తుతానికి ఎలాంటి ఆధారం లభించలేదన్నారు.  ఈ అధ్యయన బృందంలో వివిధ చైనా వర్సిటీల శాస్త్రవేత్తలతో పాటు చైనా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ, బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్‌ వర్సిటీ నిపుణులు భాగస్వామ్యమయ్యారు. కాగా, జీ4 వైరస్‌ మరో కరోనాలా మారకుండా ఆదిలోనే కట్టడి చేయాలని చైనాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. దీనికి స్పందించిన చైనా.. జీ4 కట్టడికి అన్ని రకాల చర్యలు చేపడతామని ప్రకటించింది.

Courtesy Andhrajyothi

Leave a Reply