– 60కి పైగా నగరాల్లో ఆసియన్లకు సంఘీభావంగా ప్రదర్శనలు
న్యూయార్క్ : ఆసియన్లకు సంఘీభావంగా అమెరికావ్యాప్తంగా 60కి పైగా నగరాల్లో ఈ నెల 27న సంఘీభావ ప్రదర్శనలు, కార్యాచరణలు జరిగాయి. ఈ నెల 16న అట్లాంటాలో ఆసియన్ అమెరికన్ వృద్ధురాలిపై జరిగిన దాడికి నిరసనగా ఈ కార్యాచరణ చోటు చేసుకుంది. ఆన్సర్ కొయిలేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరిగిన ఈ నిరసన కార్యాచరణలో న్యూయార్క్ వంటి పెద్ద నగరం మొదలుకొని చిన్న చిన్న పట్టణాల వరకు పాల్గొన్నాయి. ఈ ప్రదర్శనలకు దేశీయంగా, స్థానికంగా ప్రధాన మీడియాలో బాగా కవరేజ్ లభించింది. గత ఏడాది కాలంగా ఆసియన్ల పట్ల విద్వేషం ప్రదర్శిస్తున్న కేసులు పెరుగుతుండడం పట్ల నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసియన్లకు వ్యతిరేకంగా శతాబ్దాల తరబడి వున్న వివక్షకు ఇటీవల కాలంలో చైనా పట్ల పెరుగుత్ను ఘర్షణాయుత వైఖరి కూడా తోడైంది. సంఘటన జరిగిన అట్లాంటాలలో వందలమందితో ప్రదర్శన జరిగింది. శాన్‌ఫ్రాన్సిస్కో వీధుల్లో వేలాదిమందితో ప్రదర్శన జరిగింది. ఆసియన్లపై హింసను ఆపండి అంటూ నినాదాలు చేశారు.
ఆన్సర్ కొయిలేషన్‌కి చెందిన గ్లోరియా లా రివా మాట్లాడుతూ చైనాపై విమర్శలు ఆపాలని కోరారు. కొవిడ్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాలకు చైనా వైద్య బృందాలను పంపిందని చెప్పారు. న్యూయార్క్ నగరంలో అమెరికా సామ్రాజ్యవాదం, చైనా వ్యతిరేక ధోరణి నశించాలంటూ నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. దక్షిణ కరోలినా నగరంలో ఆన్సర్, పిఎస్‌ఎల్ లతో సహా పలు స్వచ్ఛంద సంస్థలు ర్యాలీ నిర్వహించాయి. ఫిలడెల్ఫియా, చికాగో, శాండియాగో, వాషింగ్టన్‌లోని సెక్విమ్, శాన్ ఆంటానియో, ఇల్లినాయిస్, ఆస్టిన్ వంటి ప్రాంతాల్లో ర్యాలీలు జరిగాయి.
Courtesy Nava Telangana