హిందీ వ్యతిరేకత ఆందోళనలకు 80 ఏళ్లు

0
198

న్యూఢిల్లీ : హిందీ వ్యతిరేకత ఆందోళనలకు 80 ఏళ్ల చరిత్ర ఉంది. 1937లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని స్థానిక ప్రభుత్వం మద్రాస్‌ ప్రెసిడెన్సీ(తమిళనాడు, ఆంధ్ర, ఒడిశా, కేరళ, కర్ణాటక) ప్రాంతంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులు హిందీని తప్పనిసరిగా నేర్చుకోవాలని హుకుం జారీ చేసింది. వివిధ భాషలతో విభజితమైనట్టు కనిపిస్తున్న దేశాన్ని ఒకే భాషతో ఏకం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అప్పటి కాంగ్రెస్‌ నేతలు చెప్పారు. అయితే, దీనిపై మద్రాస్‌ ప్రెసిడెన్సీలోని ప్రాంతాల నుంచి ముఖ్యంగా తమిళనాడు నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజలపై హిందీని రుద్దడం ద్వారా తమిళ భాషకు తీరని నష్టం కలుగుతుందని ప్రముఖ హేతువాది, సంఘ సంస్కర్త పెరియార్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సాహిత్యంలో ఘన చరిత్ర ఉన్న తమిళ భాషకు ప్రజలు దూరమవుతారని భావించిన ఆయన హిందీ భాష వ్యతిరేక ఆందోళనను తీవ్రతరం చేశారు. ఈ విధంగా మొదటి హిందీ వ్యతిరేక ఉద్యమం మూడేళ్ల్ల పాటు కొనసాగింది.
రగులుతూనే ఉంది…
స్వాతంత్య్రం వచ్చాక హిందీ వ్యతిరేక ఆందోళనలు కొంత తగ్గుముఖం పట్టినట్టు అనిపించినప్పటికీ, పూర్తిగా కను మరుగు కాలేదు. 1950లో భారత రాజ్యాంగం రూపుదిద్దు కుంటున్న సమయంలో కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం హిందీ భాషను ఏకైక జాతీయ అధికార భాషగా ప్రకటించాలని భావించింది. అయితే, దక్షిణ భారతం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో హిందీతో పాటు ఆంగ్ల భాషను ప్రత్యామ్నాయ (అసోసియేట్‌) అధికార భాషగా ప్రకటించింది. 15 ఏళ్ల తర్వాత అంటే, 1965లో హిందీని ఏకైక అధికార భాషగా ప్రకటించాలని మళ్లీ ప్రయత్నించిన ప్పటికీ, దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత మరోసారి ముంచుకొచ్చిన నేపథ్యంలో ఆ ఆలోచనను విరమించు కున్నది. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీషు భాషలు దేశంలో అధికార భాషలుగా ఉన్నాయి. అలాగే, ప్రతి రాష్ట్రం తమకు నచ్చిన భాషను అధికార భాషగా ఎన్నుకోవచ్చని పేర్కొనడంతో దేశంలో 22 భాషలకు రాజ్యాంగంలో గుర్తింపు లభించింది.
మోడీ వచ్చాక మళ్లీ ఆజ్యం
2014లో కేంద్రంలో మోడీ సర్కారు కొలువుదీరిన తర్వాత హిందీ భాష వివాదం మళ్లీ ముసురుకుంది. పాఠశాలల్లో హిందీని తప్పనిసరిగా బోధించాలన్న వాదనను ఆ పార్టీ తెరపైకి తీసుకురానప్పటికీ.. బస్టాండులు, రైల్వే స్టేషన్లు, ప్రధాన రహదారులు, ప్రభుత్వ కార్యాలయాల్లో అంటించే నోటీసులు, రైలు టిక్కెట్లపై హిందీని ముద్రించాలన్న నిబంధనలు తెచ్చింది. దీంతో ఆందోళనలు మళ్లీ పురుడు పోసుకున్నాయి. అన్ని ప్రభుత్వ సంస్థలు తమ సోషల్‌ విూడియా ఖాతాల ద్వారా హిందీ(మొదటి ప్రాధాన్యత) లేదా ఇంగ్లిషులోనే సమాచారాన్ని వెల్లడించాలని బీజేపీ సర్కారు ఆదేశించడాన్ని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత తీవ్రంగా వ్యతిరేకించారు. హిందీ భాష వ్యతిరేక ఆందోళనలు తమిళనాడులో ఎక్కువగా జరిగాయి. కేరళ, కర్ణాటకలో కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. బెంగళూరు మెట్రో రైల్వే స్టేషన్లలోని సూచిక బోర్డులపై, కొన్ని జాతీయ బ్యాంకుల బోర్డులపై హిందీ అక్షరాలు వాడటాన్ని కర్ణాటక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

ప్రామాణిక హిందీ మాట్లాడుతున్నది 15 శాతం మందే
దేశంలో ప్రామాణిక హిందీ భాషను కేవలం 15 శాతం మంది ప్రజలే మాట్లాడుతున్నారు. హిందీతో దగ్గరి పోలి కలున్న అనుబంధ భాషలు, హిందీ మాండలికాలను మాట్లాడే వాళ్లను కూడా కలుపుకొంటే ఈ సంఖ్య దాదాపు 45 శాతం వరకు ఉంటుంది. ఈ కారణం వల్లనే హిందీని ఉమ్మడి భాషగా ప్రకటించాలన్న వాదనను దాని సమర్థకులు తీసు కొస్తున్నారు. అయితే, అసలు సమస్య ఏమిటంటే, హిందీ భాషను మాట్లాడే వారంతా ఉత్తర, మధ్య భారతంలోనే అధి కంగా ఉన్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక లాంటి దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సంఖ్య అత్యల్పం. దీనివల్లే దేశవ్యాప్తంగా (దక్షిణాది రాష్ట్రాల్లో కూడా) హిందీని ఏకైక అధికార భాషగా ప్రకటించడాన్ని పలు రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Courtesy Vishalandhara..

Leave a Reply