యుద్ధం వద్దు

0
77

రష్యాలోని 37 నగరాల్లో ఆందోళనలు

మాస్కో, కీవ్‌, ఐరాస : ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోకి 3 లక్షల మంది రిజర్వు సైనికులను పంపిస్తున్నామని అధ్యక్షుడు పుతిన్‌ చేసిన ప్రకటన రష్యన్లలోనూ తీవ్ర యుద్ధ భయం కలిగించింది. రష్యాపై అణుదాడులు జరగొచ్చంటూ పశ్చిమదేశాలు పదేపదే బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాయని, తమ వద్దా అణ్వాయుధాలు ఉన్నాయని పుతిన్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో దేశం నుంచి వెళ్లిపోయేందుకు విమాన టికెట్ల బుకింగ్‌ కోసం రష్యన్లు పోటెత్తుతున్నారు. ఐరోపా నుంచి సైబీరియాకు చెందిన ఎయిర్‌ సైబీరియా, టర్కీకి చెందిన టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ మాత్రమే ప్రస్తుతం రష్యాకు విమానాలు నడుపుతున్నాయి. తదుపరి కొన్ని రోజులకు దేశం నుంచి బయటికి వెళ్లే విమానాల టికెట్లన్నీ బుక్‌ అయిపోయాయి. దీంతో బ్లాక్‌ మార్కెట్‌లో విమాన టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు ఇప్పటికే జార్జియా సరిహద్దు వద్దకు చేరుకున్న అనేకమంది రష్యన్లను సైన్యం వెనక్కి పంపించింది. ఎలాగైనా దేశం నుంచి బయటికి వెళ్లే మార్గాలను రష్యన్లు అన్వేషిస్తుండటంతో ప్రభుత్వ రష్యన్‌ రైల్వే కంపెనీ వెబ్‌సైట్‌ కుప్పకూలింది. మరోవైపు యుద్ధం వద్దంటూ మాస్కో, సెయింట్‌పీటర్స్‌బర్గ్‌ సహా 37 నగరాల్లో ప్రజలు ఆందోళనలు నిర్వహించారు.

‘యుద్ధం వద్దు.. మా పిల్లలకు జీవితం ప్రసాదించండి’ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు యుద్ధాన్ని వ్యతిరేకించేవారి గొంతు నొక్కేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆందోళనల్లో పాల్గొన్న 800 మందిని అరెస్టు చేశారు. సోషల్‌ మీడియాలో వస్తున్న ఈ వివరాలతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగిపోతోంది. రష్యన్లు సెర్బియా వెళ్లేందుకు వీసా అవసరం లేకపోవడంతో ఎక్కువమంది సెర్బియాకు తరలిపోతున్నారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 50 వేల మంది రష్యన్లు సెర్బియాకు తరలిపోయారు.

యుద్ధం ముగించాలి భారత్‌ పునరుద్ఘాటన
ఉక్రెయిన్‌లో యుద్ధం ముగించాల్సిన సమయం ఆసన్నమైందని భారత్‌ పునరుద్ఘాటించింది. గురువారం 15 దేశాల భద్రతామండలి సమావేశంలో భారత విదేశాంగమంత్రి ఎస్‌.జైశంకర్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌, రష్యా తిరిగి చర్చలు జరపాలని సూచించారు. ప్రత్యేకంగా అణ్వాయుధ అంశం ఆందోళన కలిగిస్తోందన్నారు. ‘ఉక్రెయిన్‌ యుద్ధం మొత్తం అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. భవిష్యత్తు మరింత ఆందోళనకరంగా కనిపిస్తోంది’ అని జైశంకర్‌ పేర్కొన్నారు. ప్రపంచీకరణ యుగంలో యుద్ధం సుదూర ప్రాంతాల్లో జరిగినా ప్రభావం కనిపిస్తుందన్నారు.

యుద్ధ ఖైదీల మార్పిడి
యుద్ధ ఖైదీల మార్పిడి ద్వారా రష్యా చెరలో ఉన్న 215 మందిని విడిపించినట్టు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గురువారం ప్రకటించారు. వీరిలో 10 మంది విదేశీయులు ఉన్నారని తెలిపారు. మారియపోల్‌లో ఉక్కు ఫ్యాక్టరీకి రక్షణగా నిలిచిన యోధులు నెలల తరబడి రష్యా చెరలో ఉండడంతో వారి కోసం పుతిన్‌ కీలక అనుచరులు సహా 55 రష్యన్లను విడిచిపెట్టామని తెలిపారు. టర్కీ, సౌదీ మధ్యవర్తిత్వంతో ఈ ప్రక్రియ పూర్తయిందన్నారు. ఖైదీల మార్పిడి ప్రక్రియను ఐక్యరాజ్యసమతి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్‌ స్వాగతించారు. దీన్నో తొలి అడుగుగా ప్రకటించారు.

Leave a Reply