ఫిరాయింపుల చట్టానికి కాలం తీరిందా!

0
215

  • కర్నాటక సంక్షోభంపై సుప్రీం ఆదేశాలపై భిన్నాభిప్రాయాలు
  •  దీంతో చట్టం మరింత బలహీనం
  • కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన సమయం వచ్చింది : న్యాయ నిపుణులు

కర్నాటక రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాల్ని న్యాయ నిపుణులు తప్పుబడుతున్నారు. ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టా’న్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు మరింత బలహీనపర్చాయనీ, కోరలులేని చట్టంగా మార్చిందనీ వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టం స్థానంలో మరింత సమర్థవంతమైన కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరముందని వారు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతమున్న చట్టంలో అనేక లోపాలున్నాయనీ, చట్టాన్ని అడ్డుపెట్టుకొని అధికార బలమున్న రాజకీయ పార్టీ ఏదైనా చేయడానికి సిద్ధపడుతోందనీ వారు అన్నారు.
ప్రస్తుత కర్నాటక రాజకీయ సంక్షోభంపై కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని ప్రస్తావిస్తూ, అసెంబ్లీకి హాజరుకావాలని రెబెల్‌ ఎమ్మెల్యేలను ఒత్తిడి చేయడానికి వీల్లేదని సుప్రీం తన ఆదేశాల్లో పేర్కొన్నది. అసలు విషయం…వారిపై అనర్హత వేటు వేయాలన్నది పక్కకు పోయింది. తద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి తీరని నష్టం జరిగిందని న్యాయ నిపుణులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ, చట్టసభల పరిధుల్ని మన రాజ్యాంగం చాలా స్పష్టంగా తెలిపింది. ఒకరి వ్యవస్థలో మరొకరి జోక్యం ఉండరాదని రాజ్యాంగం నిర్దేశించింది. కానీ ఇటీవలి సుప్రీం ఆదేశాలు ఆ విభజన రేఖను చెరిపివేశాయి. తీర్పుద్వారా చట్టసభలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకున్నదని న్యాయనిపుణులు చెబుతున్నారు. అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులే ఇచ్చినప్పటికీ, ముందు ముందు ‘ఫిరాయింపుల కేసుల్లో’ సుప్రీం ఆదేశాల్ని హైకోర్టుల్లో ప్రస్తావిస్తారు. అందువల్లే కర్నాటక అసెంబ్లీ స్పీకర్‌తో సహా అనేకమంది ఎమ్మెల్యేలు సుప్రీం ఉత్తర్వుల్ని తప్పుబట్టారు. ఈ ఆదేశాల్ని పున:సమీక్ష జరపాలని మళ్లీ సుప్రీంను ఆశ్రయించారు.

(నవ తెలంగాణ సౌజన్యంతో)

Leave a Reply