భరోసా ఇవ్వని బడ్జెట్‌

0
208
వి. శ్రీనివాసరావు
(వ్యాసకర్త సిపిఐ(యం) కేంద్ర కమిటీ సభ్యులు)

జగన్‌ మోహన్‌ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి తాను వాగ్దానం చేసినట్లుగా నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు. కాని వాటికే పరిమితమవడం ప్రభుత్వమే ప్రకటించినట్లుగా సుస్థిర అభివృద్ధి, పేదలకు ఊరట కలిగించదు. కరోనా కష్టకాలంలో మందులు, వైద్యం ఉచితంగా లభిస్తేనే బయటపడగలుగుతారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ వైద్య నిధులు 20 శాతమే పెంచింది. అది అవసరాలకు సరిపోయేది కాదు. టీకాలకే దాదాపు రూ.3 వేల కోట్లు కావాలి. ఇప్పటికే టీకాల కార్యక్రమం ఆలస్యమైంది. ఇప్పటికైనా ఆరోగ్య రంగానికి ప్రాధాన్యతనిచ్చి నిధులు కేటాయించాలి. కాని ఈ బడ్జెట్‌ ప్రజలకు ఆ భరోసాను ఇవ్వలేకపోయింది.

గురువారం ఒక్కరోజు జరిగిన రాష్ట్ర శాసనసభ 2021-22 సంవత్సరానికి రూ. 2 లక్షల 29 వేల కోట్లతో జమాఖర్చు లెక్కల్ని ప్రవేశ పెట్టింది. ఏప్రిల్‌ ఒకటి నుండి ఖర్చు చేయాల్సిన ప్రతి పైసాకు బడ్జెట్‌ ఆమోదం కావాలి. కరోనా తీవ్రంగా ముంచుకొచ్చిన నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు వాయిదా వేసి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సును తీసుకొచ్చింది. దాన్ని ఆమోదించడం కోసమే ఈ ఒక్కరోజు తతంగం. ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఈ సమావేశాలను బహిష్కరించింది. గతంలో వైయస్సార్‌ కాంగ్రెసు చేసిన పొరపాటునే ఇప్పుడు తెలుగుదేశం చేస్తోంది. ప్రతిపక్ష బాధ్యత నెరవేర్చకపోవడం అంటే ప్రజల విశ్వాసానికి గండి కొట్టడమే. నల్లేరు మీద బండిలాగా అధికార పార్టీ బడ్జెట్‌ ను ఆమోదింపచేసుకుంది. ఆర్థిక మంత్రి ఉపన్యాసంలో చరిత్ర పాఠాలకే సగం పోయింది. మార్చిలో కరోనా ఇంత ఉధృతంగా లేనప్పుడు అసెంబ్లీ సమావేశాలు నడిపి ఉంటే మరింత అర్ధవంతంగా చర్చ జరిగి ఉండేది. అసెంబ్లీ సమావేశాలు జరిపే అవకాశం ఉన్నా ఆర్డినెన్సుల దారి ఎంచుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలతో ప్రత్యక్షంగా ముడిపడి ఉన్న ఇంత ముఖ్యమైన సమావేశాలు ఏ చర్చా లేకుండా ముగిసిపోవడం చాలా విచారకరం. అందుకే దీన్ని బడ్జెట్‌ సమావేశం అనే కన్నా జమా ఖర్చుల పద్దుల మీటింగు అంటే సరిపోతుంది.
అప్పుల కుంపట్లో ఆర్థిక వ్యవస్థ

ఈ బడ్జెట్‌ లో ప్రధాన పద్దులన్నీ నవరత్నాల చుట్టూ తిరిగాయి. 22 రకాల పథకాలకు రూ.48 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు గాను రానున్న సంవత్సరం మరో రూ.50 వేల కోట్లు అప్పు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే రూ.3 కోట్ల 55 వేల కోట్లు అప్పుండగా దానిపై ప్రతి సంవత్సరం రూ.23 వేల కోట్లు వడ్డీలు చెల్లిస్తున్నది. తెచ్చే అప్పులో సగం వడ్డీలకే పోతుంటే ఇక సుస్థిరాభివృద్ధి ఎలా సాధ్యం? గత సంవత్సరం రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2 పాయింట్‌ 6 శాతం పడిపోయింది. జాతీయస్థాయిలో 8 శాతం పడిపోగా అంతగా మెరుగ్గా ఉన్నామని అసెంబ్లీకి సమర్పించిన ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు.
వ్యవసాయ రంగంలో 4 శాతం అభివృద్ధి నమోదు కాగా పారిశ్రామిక, సేవా రంగాల్లో పతనం కనిపిస్తుంది. ప్రభుత్వ ఖజానాకు పన్ను ఆదాయం రూ.300 కోట్లు తగ్గింది. ఖర్చు రూ.18 వేల కోట్లు అదనంగా పెరిగింది. ఈ బడ్జెట్లో రాష్ట్రం, కేంద్రం నుండి వచ్చేది కాక అదనంగా రూ.52 వేల కోట్లు ఆదాయం పెరుగుతుందని అంచనా. నేటి సంక్షోభంలో ఇది వాస్తవ రూపం ధరిస్తుందని భావించగలమా? ప్రజలపై అదనపు భారం మోపకుండా ఏ విధంగా సమకూర్చుకుంటుంది? ప్రభుత్వ ఆస్థులు అమ్మి ఆదాయం సమకూర్చుకోవాలన్న ఆలోచన రాష్ట్రాన్ని మరింత దివాళా తీయిస్తుంది. కేంద్రం నుండి న్యాయంగా రావాల్సిన వాటాను తెచ్చుకోడానికి, ఒత్తిడి తేవడానికి భయపడుతోంది. అప్పుడు సంక్షేమ పథకాలకు గండి పడుతుంది. ఇప్పటికే ఈ బడ్జెట్లో దళిత, గిరిజనాభివృద్ధికి, రేషను బియ్యానికి నిధులు పెరగలేదు. వ్యవసాయానికి తగ్గింది. మహిళలు, పిల్లలకు ప్రత్యేక బడ్జెట్‌ ప్రకటించడం ద్వారా వారి హక్కుల్ని గుర్తించినట్లయింది.
పథకాలు మంచిదే… కరోనాలో ఊరట ఏదీ ?

ఈ పథకాల పేర్లతోనైనా ప్రజలకు నేరుగా డబ్బు చేరవేయడం మంచిదే. కరోనా మహమ్మారి జనాన్ని ముంచి వేస్తున్న సమయంలో ఆ సంక్షోభ భారాన్ని కొంతవరకైనా అధిగమించడానికి ఈ నగదు బదిలీ పథకాలు పనికి వస్తున్నాయి. కాని బడ్జెట్‌ అంతా దానికే పరిమితమైతే కరోనా గండాన్ని ఎదుర్కోడానికి నిధులెక్కడ నుండి వస్తాయి. అందుకే ఈ బడ్జెట్‌ కష్టకాలంలో ప్రజలకు భరోసా ఇచ్చేదిగా లేదు. జగన్‌ మోహన్‌ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి తాను వాగ్దానం చేసినట్లుగా నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు. కాని వాటికే పరిమితమవడం ప్రభుత్వమే ప్రకటించినట్లుగా సుస్థిర అభివృద్ధి, పేదలకు ఊరట కలిగించదు. కరోనా కష్టకాలంలో మందులు, వైద్యం ఉచితంగా లభిస్తేనే బయటపడగలుగుతారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ వైద్య నిధులు 20 శాతమే పెంచింది. అది అవసరాలకు సరిపోయేది కాదు. టీకాలకే దాదాపు రూ.3 వేల కోట్లు కావాలి. ఇప్పటికే టీకాల కార్యక్రమం ఆలస్యమైంది. ఇప్పటికైనా ఆరోగ్య రంగానికి ప్రాధాన్యతనిచ్చి నిధులు కేటాయించాలి. కాని ఈ బడ్జెట్‌ ప్రజలకు ఆ భరోసాను ఇవ్వలేకపోయింది. జనాన్ని కరోనా మూడు రకాలుగా వేధిస్తోంది. ఒకటి- జబ్బు వస్తుందేమోనన్న భయం, రెండు-వచ్చాక ఎలా ఎదుర్కోవాలన్న ఆందోళన, మూడు- రాకుండా చూసుకోవడం.

రాష్ట్ర బడ్జెట్లో ఇందులో ఏ ఒక్కదానికీ సమాధానం లేదు. ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి జనం గుండె చప్పుడు అర్ధం చేసుకున్న జగన్‌ గారు ఇప్పుడు జనం గుండె చప్పుడు వినడానికే సిద్ధపడటం లేదు. పరిస్థితులను బట్టి జనం ఆలోచనలు కూడా మారుతుంటాయి. నేడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఈ కరోనా నుండి ఎలా బయటపడలా అని ఆలోచిస్తుంటే దాన్ని గాలికి వదిలేయడం ఏ మాత్రం సముచితంగా లేదు. అది బడ్జెట్లోనే కాదు అంతకు మందు కూడా వ్యక్తమైంది. రెండో దశ కరోనా వ్యాపిస్తుండగానే బెడ్లు, ఆక్సిజన్‌, మందుల కొరత తీవ్రంగా ముంచుకొచ్చింది. దాదాపు ఇరవై రోజుల పాటు ప్రభుత్వం నుండి స్పందనే లేదు. విజయనగరంలో పది మంది రోగులు మరణించాకగానీ ప్రభుత్వం మేల్కోలేదు. ఈలోగా అన్ని జిల్లాలకూ, గ్రామాలకు ఈ రోగం వేగంగా విస్తరించింది. ఇలాంటి స్థితిలో బడ్జెట్లో కరోనాను ఎదుర్కోడానికి ప్రత్యేక ప్యాకేజి ప్రకటిస్తారని ఆశించిన జనానికి నిరాశే మిగిలింది. ముఖ్యంగా ఆశా, మున్సిపల్‌ వర్కర్లు, అసంఘటిత కార్మికులు, వ్యవసాయ కూలీలు బాగా నష్టపోతున్నారు. నిరుద్యోగులకు ఉపాధి దొరకడం లేదు. వివిధ రకాల పథకాల పేరుతో నిధులు కేటాయించిన ప్రభుత్వం మరో వైపు ఇప్పటికే అమల్లో వున్న అనేక పథకాలకు నిధుల కోత పెట్టింది. వ్యవసాయానికి, ఉచిత వడ్డీ పథకానికి నిధులు తగ్గించింది. హాస్టళ్లకు నిధులు లేనందువల్ల అవి మూతపడే ప్రమాదం ముంచుకొచ్చింది. ఎయిడెడ్‌ విద్యా సంస్థలకు సహాయం నిలిపివేయడం వల్ల అవి వ్యాపారంగా మారతాయి. పేదవారికి ఆ మాత్రం నాణ్యత కలిగిన విద్య కూడా దొరకదు. రేషను బియ్యం తీసుకోకుంటే కిలోకి తొమ్మిది రూపాయలిస్తున్నట్లు సమాచారం. ఇది భవిష్యత్తులో ఆహార భద్రతను దెబ్బ తీస్తుంది. ఇది కూడా కేంద్ర ప్రజా వ్యతిరేక చట్టాలకు అనుగుణంగా తీసుకున్న చర్యే.
మరో విద్యా సంవత్సరం కోల్పోనున్న విద్యార్థులు

కరోనాతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. నాడు నేడు పేరుతో ప్రభుత్వ విద్యాలయాలను అందంగా తీర్చిదిద్దారు. కాని వాటిని నడిపే ఆస్కారమే లేకుండా పోయింది. ఇంటి నుండే చదువుకునే పిల్లలకు విద్య అందుబాటులో లేకుండా పోయింది. పరీక్షలు వాయిదా వేయడానికి మీనమేషాలు లెక్కించిన ప్రభుత్వం పిల్లలకు చదువును ఎలా అందుబాటు లోకి తేవాలో ఆలోచన చేయలేదు. ఈలోగా ఎన్‌సిఇఆర్‌టి సిలబస్‌ తెస్తాననడం, ఎయిడెడ్‌ స్కూళ్లకు సహాయం ఉపసంహరించుకోవడం వంటి ఆనాలోచిత విధానాలను పైకి తెచ్చింది. మారిన పరిస్థితులలో ప్రజల అవసరం ఒకటైతే ప్రభుత్వం చేస్తున్నది మరోటిగా ఉంది. హాస్టళ్లు మూతపడ్డాయి. దాని స్థానంలో తెచ్చిన ‘విద్యా దీవెన’ కరోనా కష్టంలో తల్లిదండ్రులకు ఉపశమనంగా మారొచ్చు. కానీ చదువుకునే పిల్లలకు ఎలా ఉపయోగపడుతుంది? పిల్లలున్న చోటికే చదువును తీసుకుపోయే ఎలాంటి ఆలోచనా ఈ బడ్జెట్‌ చేయలేదు.
వ్యవసాయానికి గిట్టుబాటు ఏదీ ?

మన రాష్ట్ర జిడిపి కిందికి దిగినా వ్యవసాయాభివృద్ధి ఒక్కటే ముందుకు నడిచింది. ప్రకృతి సహకరించడం, రైతు కూలీల కృషి దీనికి ప్రధాన కారణం. అలాంటి వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్‌ నిధుల్లో కోత పెట్టింది. ఉచిత వడ్డీకి నిధి సగం తగ్గిపోయింది. అన్ని పంటలకు ధరలు పడిపోయిన స్థితిలో రైతుల్ని ఆదుకోడానికి ప్రభుత్వ జోక్యం నామక:గా మారింది. ప్రతి గ్రామంలో సచివాలయానికి అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. రైతులు తమ పంటల్ని అక్కడ రిజస్టరు చేసుకుంటున్నారు. అంతవరకు బాగానే ఉంది. కాని పండించిన ధాన్యాన్ని ఎవరు కొంటున్నారు. రైతు భరోసా కేంద్రానికి వచ్చిన కొనుగోలు కేంద్రం ఉద్యోగి ఆ రిజస్టరు నెంబరు గల రైతును ఆ ధాన్యాన్ని ఫలానా మిల్లుకు తీసుకుపొమ్మని చెపుతాడు. అంటే ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మిల్లరు చెల్లిస్తాడని ఎవరైనా భావిస్తారు. కాని తద్భిన్నంగా మిల్లరు ధర తగ్గించి చెల్లిస్తున్నాడు. కాని రికార్డు మాత్రం మద్దతు ధర చెల్లించినట్లు రికార్డు అవుతుంది. ఎలాగంటే…ఒక రైతు వంద బస్తాలు తీసుకుపోయాడనుకోండి. బస్తా ఒకటికి మద్దతు ధర ప్రకారం రూ. 1410 రావాలి. వంద బస్తాలకు రూ. 1,41,000 రావాలి. కాని బస్తా ఒకటికి మిల్లరు రూ. 1150 మాత్రమే చెల్లిస్తాడు. ఆ లెక్కన వంద బస్తాలకు రూ. 1,15,000 మాత్రమే వస్తాయి. ఈ మొత్తానికి ధాన్యం ఎన్ని బస్తాలు వస్తాయో అన్ని బస్తాలు మాత్రమే అంటే 80 బస్తాలకు లోపే వచ్చినట్లుగా మిల్లరు కొనుగోలు కేంద్రానికి రికార్డు పంపుతాడు. రైతు ఇరవై బస్తాలు నష్టపోతాడు. కాని ప్రభుత్వ రికార్డు ప్రకారం మద్దతు దరకు రైతు నుండి కొన్నట్లు, డబ్బులు చెల్లించినట్లు ఉంటుంది. కాని మిల్లులో మిగిలిపోయిన ఇరవై బస్తాలు ప్రభుత్వ లెక్క లోకి రావు. దానికి తోడు నాణ్యత పేరుతో మరో ఐదారు కిలోలకు కోత పెడుతున్నారు. రైతు, కౌలురైతు సంఘాల ఆందోళన తర్వాత గానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. అదీ ఇరవై రోజుల తర్వాత. అప్పటికే రైతులు ముఖ్యంగా పేదరైతులు అధిక భాగం అమ్మేసుకున్నారు. ఇలా రైతుల నుండి నేరుగా కొనుగోలు చేయడానికి గత బడ్జెట్‌ లో ధరల స్థిరీకరణ నిధికి రూ. 3 వేల కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్లో కేవలం రూ. ఐదు వందల కోట్లు మాత్రమే కేటాయించారు. గత సంవత్సరం ఖర్చయిన లోటును పూడ్చడానికే దీన్ని కేటాయించారు. అంటే రూ. 500 కోట్లు మాత్రమే ప్రభుత్వం భరించిందని అర్ధం. పైకి బడ్జెట్‌ మూడు వేల కోట్లు. కాని ఖర్చు చేసింది రూ. 500 కోట్లు. దీన్నేమనాలి? రైతులను మోసం చేయడం కాదా? పాడి రైతులకు 4 రూపాయలు బోనస్‌ ఇస్తామన్న వాగ్దానానికి నిధులు కేటాయించలేదు. పైగా వినియోగదారులపై లీటరుకు అదనంగా 2 రూపాయల భారం మోపింది.

Courtesy Prajashakti

Leave a Reply