ఆర్. లక్ష్మయ్య
- ప్రభుత్వం నియమించిన వేతన సంఘం కమిటీ (అశుతోష్ మిశ్రా కమిటీ) నివేదికను బయట పెట్టమని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. కనీస వేతనం రూ. 26,000 ఉండాలని డిమాండ్ పెట్టాయి. ‘నూతన పెన్షన్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేస్తాం. మంచి పి.ఆర్.సి. ఇస్తాం’ అన్న హామీలను అమలు చేయాలనేది ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. అందుచేత ఉభయులు పరస్పర అంగీకారంతో ఒక నిర్ణయానికి రావడమే సరైన పరిష్కారం.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగుల పి.ఆర్.సి పై ప్రభుత్వ ఏకపక్ష ప్రకటన…ఉద్యోగుల్లో వ్యక్తం అవుతున్న ఆందోళన…దానిపై ప్రభుత్వం, మేధావులనుకునే కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు… నేడు వార్తల్లో ప్రధానాంశాలు అయ్యాయి. అయితే ఈ సందర్భంగా జరుగుతున్న చర్చలు పి.ఆర్.సి. విధివిధానాలు, మౌలిక అంశాలపై కాకుండా పక్కదారి పట్టడం అనారోగ్యకరం, ఆందోళనకరం. ఇప్పటికైనా విధానాలపై చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. అసలు పి.ఆర్.సి ఎందుకు? పెరుగుతున్న సరుకుల ధరలు, వివిధ సేవల ఖర్చులు, వయసుతోపాటు వచ్చే ఆరోగ్య సమస్యలు, కుటుంబ బాధ్యతలు, సామాజిక పరిస్థితులలో వచ్చే మార్పుల ప్రభావం…ప్రజలలో భాగమైన ఉద్యోగుల మీద కూడా పడతాయి. నాగరిక సమాజంలోని వ్యక్తిగా ప్రభుత్వ ఉద్యోగి కూడా గౌరవప్రదమైన జీవితం గడపడం ఉద్యోగికే కాదు సమాజానికి, అంతిమంగా ప్రభుత్వానికి అవసరం. వీటిని గమనంలోకి తీసికొని పి.ఆర్.సి. పై చర్చలు జరగాలి.
వేతన సవరణ ముఖ్య లక్ష్యాలు ఏంటి? కేంద్ర ప్రభుత్వం నియమించిన 7వ వేతన సంఘం తన నివేదిక లోని ముందు మాట (పేజీ 3, పేరా 1.11)లో ఇలా చెప్పింది. ”ఉద్యోగులకు గతంలో చెల్లించిన వేతనాల ఆర్థిక విలువ తగ్గిపోయింది. ఆర్థిక స్థితి రాను రాను మరింతగా వినిమయదారీ ఆర్థిక స్థితిగా తయారైంది. అందువల్ల ఉద్యోగుల వేతన నిర్మాణాన్ని తగిన విధంగా కాపాడుకోవాలంటే ఆ నిర్మాణాన్ని అభివృద్ధి చేయడం అవసరం. దానివల్ల మెరుగైన, అర్హులైన, సమర్ధులైన వారిని ప్రభుత్వ యంత్రాంగం లోకి ఆకర్షించడానికి వీలవుతుంది”.
- వేతనాలు ఎన్ని రకాలు?
డాక్టర్ అర్జున్ సేన్ గుప్త నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 2004లో నియమించిన కమిటీ నివేదికలో ప్రధానంగా 3 రకాల వేతనాలను పేర్కొంది. 1. కనీస వేతనాలు. 2. జీవించడానికి వేతనాలు (లివింగ్ వేజెస్) 3. మంచి వేతనాలు (ఫెయిర్ వేజెస్).
- కనీస వేతనాలు
ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ (ప్రభుత్వ, యాజమాన్య, కార్మికుల ప్రతినిధుల సభ) 1957లో ఆమోదించిన డాక్టర్ ఆక్ట్రారు సూత్రానికి అనుగుణంగా కనీస వేతనాలనేవి కుటుంబం, ఆహారం, వస్త్రాలు, గృహ వసతి, ఇతర ఖర్చులకు సరిపడా ఉండాలి. దీనికి అదనంగా వివాహాలు, వినోదాలు తదితర అవసరాల కోసం మరొక 25 శాతం కలిపి కనీస వేతనం నిర్ణయించాలని 1991లో రెప్‌టాకోస్ బ్రెట్ మరియు కార్మికుల వివాదంలో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. వీటన్నిటిని పరిగణన లోకి తీసికొని కనీస వేతనాలు నిర్ణయించాలని డాక్టర్ అర్జున్ సేన్ గుప్త కమిటీ తేల్చిచెప్పింది. 7వ వేతన వేతన సంఘ కమిటీ కూడా దీని ప్రాతిపదికన కనీస వేతనం నిర్ణయించామని చెప్పింది (పేరా 4లో). లివింగ్ వేజెస్: కనీస వేతనాల కంటే ఎక్కువ స్థాయిలో ఉండాలి. ఫెయిర్ వేజెస్: లివింగ్ వేజెస్ కంటే ఉన్నత స్థాయిలో ఉండాలి అని అర్జున్ సేన్ గుప్త కమిటీ స్పష్టీకరించింది.
- సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
భూపేంద్రనాథ్ హజారికా, ఇతరుల కేసులో 2013లో సుప్రీం కోర్టు ఇలా చెప్పింది. 7వ వేతన సంఘ కమిటీ నివేదిక (పేరా 1.29)లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఉద్యోగుల న్యాయబద్ధమైన కోర్కెలను తిరస్కరించరాదు. ఆశలకు భంగం కలిగే వాతావరణం సృష్టించకూడదు. ప్రతి ఒక్కరికి ఆశ అనేది అమూల్యమైనది. నమూనాగా ఉండాల్సిన యజమాని (ప్రభుత్వం)…ఉద్యోగుల సీనియారిటీతో దీన్ని చెస్ ఆటలో లాగా వంచన, కపటమైనదిగా మార్చకూడదు. ఉద్యోగుల ఆత్మవిశ్వాసం దగా చేయబడదని, న్యాయంగా హుందాగా పరిగణించబడుతుందనే విశ్వాసపూరిత వాతావరణం కల్పించాలి. అప్పుడు మాత్రమే మంచి ప్రభుత్వమనే భావన పటిష్టమవుతుంది.
- కనీస వేతన విధానం
వాస్తవ తలసరి ఆదాయం పెరుగుదలతో సమానంగా కనీస వేతనం పెరగాలి. అప్పుడే ఉద్యోగుల వాటా దేశ వాస్తవ ఆర్థిక స్థితికి భిన్నం కాదని తెలియజేయబడుతుంది. ఈ రెండు అంశాలను 7వ వేతన సంఘ నివేదిక (పేరా 1.29 మరియు 4.2)లో పేర్కొన్నారు. కనీస వేతనాలు నిర్ణయించేందుకు 7వ వేతన సంఘం కూడా ఈ మౌలిక అంశాలను ఆధారంగా తీసుకున్నట్లు నివేదికలో చెప్పింది. అయితే ప్రభుత్వం వాస్తవ రిటైల్ మార్కెట్ ధరలను పరిగణన లోకి తీసుకోకుండా టోకు ధరలను, నాసిరకం సరుకుల ధరలను పరిగణనలోకి తీసుకుంటున్నది. అందుకే మౌలిక సూత్రాల ఆధారంగా ఉద్యోగ సంఘాలు చేసిన కనీస వేతన డిమాండ్‌కు వేతన సంఘం సిఫారసు చేసిన కనీస వేతనానికి మధ్య వ్యత్యాసం ఉంది. మరో అంశం ఏమంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం కుటుంబం అంటే ఉద్యోగి, భార్య/భర్త , 14 సంవత్సరాల లోపు ఇద్దరు పిల్లలు మాత్రమే. తల్లిదండ్రులు కానీ ఉద్యోగులపై ఆధారపడిన ఇతరులు కానీ లెక్క లోకి రారు.
మరొక అంశాన్ని కూడా పరిశీలించాల్సి వుంది. 25-30 సంవత్సరాల కిందట ప్రభుత్వ పథకాలు, ఉద్యోగుల పనితో పోల్చి నాడు ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు? నేడు పథకాలు, ఉద్యోగుల పని ఎంత పెరిగింది? ఆ దామాషాలో ఉద్యోగుల సంఖ్య కూడా పెరిగిందా అంటే పెరగలేదు సరిగదా తగ్గింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే మంజూరైన ఉద్యోగ పోస్టులలో ఖాళీలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఆ భారాన్ని ప్రస్తుత ఉద్యోగులేకదా మోస్తున్నారు. వేతన సవరణ చర్చలలో ఈ అంశాన్ని సైతం పరిగణనలోకి తీసుకోవాలి కదా?
- నూతన పెన్షన్ రద్దు డిమాండ్
ఏడవ వేతన సంఘం నూతన పెన్షన్ గురించి తన నివేదిక (పేరా-1.24)లో ఇలా పేర్కొన్నది. ‘2004 ఆ తర్వాత నియమించబడిన ఉద్యోగులంతా నూతన పెన్షన్‌తో అసంతృప్తితో ఉన్నారు’. అయితే నివేదికలో ఇంకా ఇలా చెప్పింది. తమ కమిటీకి నిర్దేశించిన అంశాలలో ఈ అంశం లేదు కనుక దీనిపై తాము సిఫారసు ఏమీ చేయడం లేదు. కానీ ప్రభుత్వం దీనిపై ఆలోచించాలని మాత్రం చెప్పింది. ఉద్యోగుల మనోభావాలు దేశవ్యాపితంగా ఎలా వున్నాయో ఇది తెలియజేస్తున్నది.
అందుకే దీన్ని రద్దు చేస్తామని నేటి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే హామీ ఇచ్చింది. అలాగే మంచి పి.ఆర్.సి ఇస్తామని కూడా ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ నేడు అందుకు విరుద్ధంగా మాట్లాడటం సమంజసమా? 1998లో స్విట్జర్లాండ్ ప్రధాని భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘ఇచ్చిన హామీలను అమలు చేయని వారికి మా దేశంలో రెండే రెండు మార్గాలు ఉన్నాయి. 1. చెరసాల, 2. పిచ్చాసుపత్రి’ అన్నారు. నాటి ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.ఆర్ దానిని స్వాగతించి బలపరిచారు.
- ఉద్యోగ సంఘాలు ఏం అడుగుతున్నాయి?
- ప్రభుత్వం నియమించిన వేతన సంఘం కమిటీ (అశుతోష్ మిశ్రా కమిటీ) నివేదికను బయట పెట్టమని కోరుతున్నాయి. ఇది అసంబద్ధమా? ప్రజల డబ్బు ఖర్చు చేసి నియమించిన కమిటీ నివేదిక ప్రజల ఆస్తి అవుతుంది. దాన్ని ప్రజల ముందు వుంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ ఉద్యోగ సంఘాలు అడిగినా ఎందుకు బహిరంగపరచరు? ఆ కమిటీ నివేదికపై ఉద్యోగ సంఘ నాయకులతో చర్చించి ఉభయత్రా ఆమోదయోగ్యమైన నిర్ణయం చేయడం సాంప్రదాయం. అది ప్రజాస్వామ్యం కాదా? అయినా ప్రభుత్వం ఎందుకు జంకుతున్నది?
2. కనీస వేతనం రూ. 26,000 ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ పెట్టాయి. ఇది కనీస వేతన నిర్ణయ సూత్రాలకనుగుణంగా చేసిన డిమాండ్. వాస్తవంగా ప్రభుత్వోద్యోగులు ఫెయిర్ వేజెస్ డిమాండ్ చేయాలి. అంటే రూ. 30-35 వేలు అడగాలి. కానీ ఉద్యోగ సంఘాలు అలా అడగకపోవడమే అవి చేసిన నేరమా?
3. ‘నూతన పెన్షన్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేస్తాం. మంచి పి.ఆర్.సి. ఇస్తాం’ అన్న హామీలను అమలు చేయాలనేది ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. అందుచేత ఉభయులు పరస్పర అంగీకారంతో ఒక నిర్ణయానికి రావడమే సరైన పరిష్కారం తప్ప ఏకపక్ష నిర్ణయాలు, అదిరింపులు, బెదిరింపులతో సమస్యలు పరిష్కారం కావని ప్రభుత్వం గుర్తించాలి. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఉద్యోగులకు పట్టదా? ప్రభుత్వోద్యోగులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ, మానసిక ఒత్తిళ్లతో వుంటే ప్రభుత్వ పనులు సక్రమంగా ఎలా జరుగుతాయి?
- ఆర్థికవేత్తలు ఏం చెబుతున్నారు?
దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ద్రవ్యలోటు గురించి ఆలోచించకుండా ప్రజల చేతిలో డబ్బు ఉండే చర్యలు చేపట్టాలని చెబుతున్నారు. అప్పుడే వారు సరుకులు/వస్తువులు/సేవలు కొంటారు. ఉత్పత్తికి డిమాండ్ పెరుగుతుంది. ఉపాధి లభిస్తుంది. అది పన్నుల రూపంలో ప్రభుత్వ ఆదాయం పెరగడానికి దోహదపడుతుంది. రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్లతో సహా పలువురు ప్రముఖులు చేసిన సూచనలు ఇవి. ఇటీవల దోహాలో జరిగిన అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో అతి సంపన్నులైన కొందరు తమ ఆదాయాలపై అధిక పన్నులు వేసి ఆర్థిక స్థితిని గాడిలో పెట్టండని బహిరంగంగా ప్రకటించారు.
ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడానికి మార్గాలను పరిశీలించకుండా ఉద్యోగుల వేతనాలను అభివృద్ధి-ఆర్థిక పరిస్థితికి ముడి పెట్టడం ఆత్మవంచన తప్ప మరొకటి కాదు. ఇటీవల ఆక్స్‌ఫాÛమ్ విడుదల చేసిన నివేదికలో దాదాపుగా 80 శాతం ప్రజల ఆదాయాలు పడిపోయాయని, మధ్య తరగతి దిగువకు చేరిందని, పేదలు నిరుపేదలుగా మారారని, శత కోటీశ్వరుల సంఖ్య 100 నుండి 142కి…వారి సంపద రూ. 23 లక్షల కోట్ల నుండి రూ. 58 లక్షల కోట్లకు పెరిగిందని తేల్చింది. ఆ విధంగా నిజ ఆదాయాలు పడిపోయిన ప్రజలలో ఉద్యోగులూ వున్నారు. ఇది ప్రభుత్వానికి తెలియదా? ఉద్యోగులు పని దొంగలని, సోమరిపోతులని, లంచగొండులని రకరకాలుగా ప్రభుత్వమేగాక, అనుయాయులు ప్రచారం చేయిస్తున్నారు. ఈ ఆరోపణలు నిజమనుకుంటే అది ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనం కాదా? అందుకుగాను ముందుగా బాధ్యత వహించవలసింది ప్రభుత్వమే కదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారానికి వచ్చిన 3 సంవత్సరాలు ఈ విషయాలు తెలియదా? కేవలం వేతన సవరణ లేక ఇతర సమస్యలపై ఉద్యోగులు ఆందోళనలకు దిగినప్పుడే ఇవన్నీ గుర్తొస్తాయా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అనుసరించాల్సిన వైఖరేనా? ప్రభుత్వం అంటే ప్రజలకు జవాబుదారుగా ఉండాల్సిన బాధ్యత లేదా? రైతులు గిట్టుబాటు ధర అడిగితే ధరలు పెరుగుతాయని ప్రజలను రెచ్చగొడతారు. పేదల సంక్షేమ పథకాలు అమలు చేయడం సోమరిపోతులను తయారు చేయడమని ఇతర ప్రజలను ప్రేరేపిస్తారు. ఇలా ఒకరికి వ్యతిరేకంగా మరొకరిని ఎగదోయడం ప్రభుత్వాలకు వెన్నతో పెట్టిన విద్య. బ్రిటిష్‌వారు నేర్పిన విభజించు-పాలించు సిద్ధాంతం తప్ప మరొకటి కాదని ప్రజలు గుర్తించాలి.
ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాల ఆధారంగా ఉద్యోగ సంఘాలతో విజ్ఞతతో, బాధ్యతాయుతంగా ప్రజస్వామ్యబద్ధంగా చర్చించి సమస్యలను పరిష్కరించాలి.
Courtesy Prajashakti