అరబిందో ఫార్మాకు రూ.22 కోట్ల జరిమానా

0
243

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసులో కొరడా ఝుళిపించిన సెబీ

న్యూఢిల్లీ: ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నియమావళిని ఉల్లంఘించినందుకు అరబిందో ఫార్మాపై క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి ‘సెబీ’ కొరడా ఝుళిపించింది. కంపెనీ, దాని ప్రమోటర్‌ పీవీ రామ్‌ప్రసాద్‌ రెడ్డి, ఆయన భార్య పీ సునీలా రాణి ఇంకా అనుసంధాన కంపెనీలపై మొత్తం రూ.22 కోట్లకు పైగా జరిమానా విధించింది. 45 రోజుల్లోగా జరిమానా చెల్లించాలని సోమవారం నాటి ఆర్డరు కాపీలో సెబీ ఆదేశించింది.

2008 జూలై నుంచి 2009 మార్చి మధ్యకాలంలో అరబిందో ఫార్మా లిమిటెడ్‌ (ఏపీఎల్‌) షేర్ల ట్రేడింగ్‌లో నిబంధనల ఉల్లంఘనలపై సెబీ దర్యాప్తు జరిపింది. షేర్ల ధరలను ప్రభావితం చేయగలిగే సమాచారాన్ని బయటికి వెల్లడించకుండానే ప్రమోటర్‌కు చెందిన ఇతర కంపెనీలు ఏపీఎల్‌ స్ర్కిప్‌లలో ట్రేడింగ్‌కు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. తద్వారా ప్రమోటర్లతోపాటు అనుసంధానిత కంపెనీలు అక్రమంగా లబ్ది పొందినట్లు నియంత్రణ మండలి గుర్తించింది.

అసలేం జరిగింది?

లిస్టెడ్‌ కంపెనీలు షేర్ల ధరలను ప్రభావితం చేసే ఏ సమాచారాన్నైనా ముందుగా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు వెల్లడించాల్సి ఉంటుంది. దశాబ్దం క్రితం ఫైజర్‌తో కుదుర్చుకున్న లైసెన్సింగ్‌, సరఫరా అగ్రిమెంట్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని అరబిందో ఫార్మా ఎనిమిది నెలలకు పైగా (2008 జూలై 22 నుంచి 2009 మార్చి 3 వరకు) బయటికి వెల్లడించకుండా తొక్కిపెట్టింది. సమాచారాన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు వెల్లడించకపోగా ఆ సమయంలో మార్కెట్లో తక్కువ ధరకు లభిస్తున్న అరబిందో షేర్లను ప్రమోటర్లు, వారి తోక కంపెనీలు భారీ సంఖ్యలో కొనుగోలు చేసినట్లు సెబీ గుర్తించింది. ఆ తర్వాత కాలంలో ధర పెరిగాక షేర్లను విక్రయించడం ద్వారా వీరు అయాచిత లబ్ది పొందినట్లు సెబీ పేర్కొంది.

ఏంటీ ఒప్పందం?

బల్క్‌ డ్రగ్‌, ఫినిష్డ్‌ ఫార్ములేషన్ల సరఫరా చేసేందుకు అరబిందో ఫారా ఫైజర్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంది. 2008లో జూలై 22 నుంచి డిసెంబరు 29 మధ్యలో ఈ ఒప్పందాలు జరిగాయి. అయితే అరబిందో మాత్రం 2009 మార్చి 3న విషయాన్ని బయటికి వెల్లడించింది.

Courtesy Andhra Jyothy…

Leave a Reply