న్యూఢిల్లీ: కరోనా కట్టడికి లైట్లు ఆర్పేసి దీపాలు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇవ్వడాన్ని ప్రతిపకక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ప్రాణాలు తోడేస్తున్న కోవిడ్‌ను నివారించేందుకు సమర్థవంతమైన చర్యలు చేపట్టకుండా గాలిలో దీపాలు పెట్టడమేంటని ప్రశ్నించాయి. నిర్బంధంతో ఆకలి కేకలు పెడుతున్న పేదల ఆర్తనాదాలు ప్రధానికి వినపడటం లేదా అని ప్రశ్నిస్తున్నాయి. ముంచుకొస్తున్న ఆర్థిక సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటారని నిలదీశాయి.
కొత్త నాటకం వచ్చింది: ఒవైసీ
దీపాలు వెలిగించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ కొత్త నాటకానికి తెర తీశారని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. భారత దేశం ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ కాదని, ఇక్కడి ప్రజలకు కలలు, ఆశలూ ఉన్నాయన్నారు. ప్రజల జీవితాలను 9 నిమిషాల జిమ్మిక్కులకు తగ్గించొద్దని అన్నారు. రాష్ట్రాలకు, పేదలకు కేంద్ర ప్రభుత్వం ఏమేరకు సహాయం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. చీకట్లు కమ్ముకుంటున్న బ్యాంకింగ్, ఆర్థిక రంగాలను ఏవిధంగా ఒడ్డున పడేస్తారని ప్రశ్నించారు. లాక్‌డౌన్ కారణంగా తిండి దొరక్క అల్లాడుతున్న అసంఘటిత కార్మికులకు సాయం అందించి వారి జీవితాల్లో కాస్త వెలుగు నింపాలని కేంద్రానికి సూచించారు. ప్రధాని మోదీ వీడియో సందేశం సాధారణంగా ఉందని మహారాష్ట్ర ఎంఐఎం అధ్యక్షుడు, ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ నుంచి మరింత సమర్థవంతమైన చర్యలు ఆశించినట్టు చెప్పారు.
మతంరంగు పూయొద్దు: సీపీఎం
కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు దేశం యావత్తూ ఒక్కటైందనీ, ఈ పోరాటానికి మతం రంగు పులమవద్దని కేంద్ర ప్రభుత్వానికి సీపీఎంపొలిట్‌బ్యూరో సూచించింది. తబ్లీగీ జమాత్ కార్యక్రమానికి వెళ్లివచ్చిన ఒక మతానికి చెందినవారిని లక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో అనేక వదంతులు, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, మతం రంగు పులిమేపని కొంతమంది చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. లాక్‌డౌన్ కొనసాగుతున్న తరుణంలో నిజాముద్దీన్‌లో తబ్లీగీ జమాత్ కార్యక్రమానికి ఢిల్లీ పోలీస్ అధికారులు ఎలా అనుమతి ఇచ్చారని సీపీఎం పొలిట్‌బ్యూరో ప్రశ్నించింది. మార్చి 13 తర్వాత దేశంలో అనేక చోట్ల మత, రాజకీయ, సామాజిక సమావేశాలు జరిగాయని.. వీటిపై ప్రభుత్వాలు దృష్టిసారించి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది.
చప్పట్లు కాదు రక్షణ కల్పించండి: కాంగ్రెస్
కోవిడ్‌పై పోరాటానికి దీపాలు వెలిగించాలన్న ప్రధాని మోదీ వీడియో సందేశంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. కరోనా బాధితులకు వైద్యం, ఉపాధి లేని వారికి ఆహారం అందించడం, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కే చర్యలు వంటివాటిపై మాట్లాడతారని ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలిందని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా పేర్కొన్నారు. కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న వైద్య సిబ్బందికి కావాల్సింది చప్పట్లు కాదని రక్షణ పరికరాలు అందించి వారిని రక్షించాలని డిమాండ్ చేశారు. అసలైన ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వలేదని అన్నారు.