చేతులు తడపాల్సిందే..

0
215

భారత్‌ లో అనేకరూపాల్లో అవినీతి
ఆసియాలోనే అత్యధికంగా బ్రైబరీ రేట్‌‘ 39శాతం నమోదు
అవినీతి స్థానంలో కొన్ని చోట్ల లైంగికదోపిడీ : ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌
దోషుల్ని శిక్షించాలి.. ఫిర్యాదుదారుల్ని రక్షించాలి

అవినీతి, లంచాలు భారత్‌ లో తీవ్రస్థాయిలో ఉన్నాయి. విద్య, వైద్యం మొదలైన కీలకమైన ప్రభుత్వ సేవలు పొందటానికి ప్రతి ఐదుగురులో ఒకరు లంచాలు ఇవ్వాల్సి వస్తోంది. డబ్బులతో ఓట్లర్లను ప్రలోభపెడుతున్నారు. ఇండియా, మలేషియా, థాయిలాండ్‌, శ్రీలంక దేశాల్లో లంచాల స్థానంలో, అవినీతికి మరోరూపంగా లైంగికదోపిడీతీవ్రస్థాయిలో ఉన్నదని గుర్తించాం. వీటిని తీవ్రమైన నేరాలుగా పరిగణించి ప్రభుత్వాలు అడ్డు కోవాలి. విచారణ జరిపి దోషుల్ని శిక్షించాలి.
ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ నివేదిక

న్యూఢిల్లీ : భారతదేశంలో అవినీతి, లంచాలు తీవ్రస్థాయిలో ఉన్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. భారత్‌లో ‘బ్రైబరీ రేట్‌’ (లంచాలు ఇవ్వటం) 39శాతంగా నమోదైందని ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌’ తాజా నివేదిక వెల్లడించింది. లంచాలపై అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదుచేస్తే, తమపైన్నే వేధింపులకు దిగుతున్నారని సర్వేలో పాల్గొన్న 63శాతం మంది చెప్పారు. బ్రైబరీ రేట్‌లో..ఆసియాలోనే భారత్‌ అగ్రస్థానంలో ఉన్నదని నివేదిక తెలిపింది. దీనికి సంబంధించి విడుదలచేసిన ‘గ్లోబల్‌ కరప్షన్‌ బారోమీటర్‌’లో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించారు.

అధికారవర్గాలతో తమకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వ సేవల్ని పొందలేకపోతున్నామనీ, దాంతోతాము లంచాలివ్వాల్సి వచ్చిందని 32శాతం మంది చెప్పారు. ఈ ఏడాది జూన్‌ 17-జులై 17 మధ్య సర్వే నిర్వహించగా, భారత్‌లో 2వేల మంది నుంచి సమాచారాన్ని సేకరించారు. ఈనేపథ్యంలో ఆసియా దేశాల్లో ‘బ్రైబరీ రేట్‌’ అత్యధికంగా 39శాతం భారత్‌లో నమోదైందని నివేదిక పేర్కొన్నది. ప్రభుత్వ సేవల కోసం అధికార, రాజకీయ వర్గాలతో కలిగివున్న వ్యక్తిగత సంబంధాల్ని ఉపయోగించాల్సి వస్తోందనీ, ఈ విధంగా 46శాతం మంది ప్రభుత్వ సేవలు పొందారని తేలింది.

కారణాలేంటి?
ప్లేగు వ్యాధిలా ప్రభుత్వ సేవల్లో లంచాలు విస్తరించాయని సర్వేలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. బ్యూరోక్రాట్ల నేతృత్వంలో నడిచే ప్రభుత్వ సేవలు అందరికీ అందుబాటులో లేకపోవటం, నత్తనడక, అనేకచోట్ల అధికారస్వామ్యం, ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో అవగాహన లేకపోవటం..ఇవన్నీ లంచాలు పెరగడానికి దారితీస్తున్నాయి. వేరే మార్గంలో వెళ్తేగానీ పని అవ్వదనే భావన ప్రజల్లో కలిగిస్తోంది.

కేంద్ర, రాష్ట్ర స్థాయిలో..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సేవలు మెరుగుపర్చుకోవాల్సిన అవసరమున్నది. పరిపాలనా విభాగాల లోపాలపై దృష్టి సారించాలి. ప్రభుత్వ పాలనలో బంధుప్రీతి, లంచాలకు అడ్డుకట్ట వేసే చర్యల్ని చేపట్టాలి. ఈ చర్యలు తీసుకోకుండా లంచాలను అరికట్టలేరు. చాలావరకు ప్రభుత్వ సేవల్ని ఆన్‌లైన్‌ విధానంలో అందజేయాలి.

ఇండియా సహా, థాయిలాండ్‌, శ్రీలంక, ఇండోనేషియా దేశాల్లో డబ్బు స్థానంలో లైంగికదోపిడీ రూపంలో లంచాలు కొనసాగుతున్నాయని నివేదిక గుర్తించింది.
ఈ దేశాల్లో లైంగికదోపిడీ అత్యధికంగా నమోదైందని పేర్కొన్నారు. ప్రభుత్వ అవినీతి చాలా పెద్ద సమస్యగా తయారైందని భారత్‌లో 89శాతం మంది భావిస్తున్నారు.

  • 83.6కోట్ల జనాభా ఉన్న 17దేశాల్లో సర్వే నిర్వహించినట్టు ట్రాన్స్‌పరెన్స్‌ ఇంటర్నేషనల్‌ పేర్కొన్నది.
  • బ్రైబరీ రేటు… ఇండియా (38శాతం) తర్వాత కంబోడియాలో అత్యధికంగా 37శాతం నమోదైంది. సగటున..మాల్దీవులు(2శాతం), జపాన్‌(2శాతం), దక్షిణ కొరియాల్లో (10శాతం) అత్యల్పంగా నమోదైంది.

Courtesy Nava Telangana

Leave a Reply