ఆసియా కుబేరుడు అదానీ

0
122
  • షేర్ల దూకుడుతో ఏడాదిలో రూ.90,000 కోట్లు పెరిగిన సంపద
  • రెండో స్థానానికి ముకేశ్‌ అంబానీ

ఆసియా కుబేరుల్లో అగ్రస్థానాన్ని అదానీ గ్రూపు ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ అధిరోహించారని బ్లూమ్‌బర్గ్‌ కుబేరుల సూచీ వెల్లడించింది. గత రెండేళ్లలో అదానీ గ్రూపు కంపెనీల షేర్లు 600 శాతానికి పైగా రాణించడమే ఇందుకు కారణం. గౌతమ్‌ అదానీ నికర సంపద 88.5 బిలియన్‌ డాలర్లకు (రూ.6,65,000 కోట్లకు) చేరింది. అదే సమయంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ సంపద 87.9 బిలియన్‌ డాలర్లుగా (రూ.6,50,000 కోట్లు) ఉంది. ఒక్క ఏడాది కాలంలోనే అదానీ నికర సంపద 12 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.90,000 కోట్లు) పెరగడం గమనార్హం. ఆసియాలోనే కాదు.. ప్రపంచంలోనే ఒక ఏడాదిలో అత్యధిక సంపదను వెనకేసుకుందీ అదానీయేనని బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. బ్లూబ్‌బర్గ్‌ కుబేరుల జాబితాలో అదానీ 10, అంబానీ 11వ స్థానాల్లో నిలిచారు.

షేర్ల రాణింపు ఇలా..: అదానీ గ్రీన్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌ షేర్లు 2020 ప్రారంభం నుంచి ఇప్పటికి 1000 శాతానికి పైగా ప్రతిఫలాన్ని పంచాయి. అదానీ గ్రూపు కీలక సంస్థ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు 730 శాతం వరకు పెరిగింది. అదానీ ట్రాన్స్‌మిషన్‌ 500%; అదానీ పోర్ట్స్‌ 95% మేర రాణించాయి. ఇదే సమయంలో సెన్సెక్స్‌ 40 శాతమే పెరగడం గమనార్హం.

సంపద వెలుగుల వెనక..: కమొడిటీ ట్రేడింగ్‌ వ్యాపారంతో ఆరంభమైన గౌతమ్‌ అదానీ.. ఓడరేవులు, విమానాశ్రయాలు, గనులు, స్వచ్ఛ ఇంధనం ఇలా పలు రంగాల్లోకి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. పునరుత్పాదక విద్యుత్‌, డేటా కేంద్రాలు, రక్షణకు సంబంధించిన వ్యాపారాల్లోకీ అదానీ గ్రూపు అడుగుపెట్టింది. స్వచ్ఛ ఇంధనంతో పాటు మౌలిక రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్న తరుణంలోనే అదానీ గ్రూపు ఈ రంగాల్లోకి అడుగుపెట్టడం షేర్ల రాణింపునకు కలిసొచ్చింది.

2020 ముకేశ్‌దే అయినా..: కొవిడ్‌-19 పరిణామాలు స్టాక్‌ మార్కెట్‌లను కుదిపేసినా.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 2020లో మదుపర్లకు అమోఘ ప్రతిఫలాలను పంచింది. రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్‌బుక్‌, గూగుల్‌ లాంటి సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టడంతో షేరు ఉరకలేసింది. ముకేశ్‌ సంపద పెరిగేందుకూ ఇది తోడ్పడింది. మొత్తానికి 2020 ముకేశ్‌ సంవత్సరంగా నిలిచింది. తదుపరి అదానీ గ్రూపు షేర్ల హవా నడవడంతో గౌతమ్‌ అదానీ క్రమక్రమంగా ముకేశ్‌ సంపద స్థాయి చేరువకు వచ్చారు. కొత్త సంవత్సర క్యాలెండర్లో మొదటి నెల పేజీ మారడంతో పాటు ఆసియా శ్రీమంతుల జాబితాలో మొదటి స్థానంలోని పేరూ మారింది. ‘ముకేశ్‌ అంబానీ’ స్థానంలో ‘గౌతమ్‌ అదానీ’ వచ్చి చేరింది.

మున్ముందూ పోటీ రసవత్తరం!: పునరుత్పాదక విద్యుత్‌ రంగంలో అదానీ గ్రూపు – రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మధ్య పోటీ తీవ్రమవుతోంది. ఈ రంగంలో మూడేళ్లలో 10 బిలియన్‌ డాలర్ల (రూ.75,000 కోట్ల) పెట్టుబడులు పెడతామని అంబానీ ప్రకటించారు. 2030 కల్లా 70 బిలియన్‌ డాలర్ల (రూ.5.25 లక్షలకోట్లు) పెట్టుబడులు పెడతామని అదానీ గ్రూప్‌ ప్రతిన బూనింది.

2025 కల్లా పునరుత్పాదక విద్యుత్‌ సామర్థ్యాన్ని 8 రెట్లు పెంచుకునే యోచనలో అదానీ గ్రూప్‌ ఉంది.

మూడేళ్లలో ముంబయి సహా 7 విమానాశ్రయాలపై అదానీ గ్రూపు పట్టు సాధించింది. దేశం మొత్తం మీద విమాన ప్రయాణికుల సంఖ్యలో నాలుగో వంతు వీటి నుంచే రాకపోకలు సాగిస్తుంటారు.

Courtesy Eenadu

Leave a Reply