- అసోం ప్రజల జీవితాల్ని చీకటిమయం చేస్తున్న ఎన్ఆర్సీ జాబితా
- పేర్లులేని నిరక్షరాస్యులు, దినసరి కూలీలకు ట్రిబ్యునల్ కష్టాలు
- ఆదాయానికి గండి.. దిక్కుతోచని స్థితిలో పేదలు
- అమాయకులను మోసం చేస్తూ దందాలకు తెరతీసిన అక్రమార్కులు
వివాదాస్పద ఎన్ఆర్సీ.. అసోంలో గత కొన్నేండ్లుగా బతుకుతున్న బడుగు జీవుల ఉసురుతీస్తున్నది. లక్షలాది మంది పౌరుల్ని విదేశీయులుగా పేర్కొంటూ ‘సవరించిన ఎన్ఆర్సీ’ జాబితా కూలీల జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నది. జాబితాలో పేర్లులేని వ్యక్తులు నాలుగు నెలల్లోపు విదేశీ ట్రిబ్యునల్ ను ఆశ్రయించేందుకు అవకాశం ఇచ్చామని కేంద్ర సర్కారు గొప్పగా చెప్పుకుంటున్నది. అయితే, క్షేత్ర స్థాయిలో సామాన్య ప్రజానీకం బాధల్ని మాత్రం పట్టించుకున్న పాపానపోవట్లేదు.
స్రవంతి
అసోంలో స్థిరపడిపోయిన విదేశీయులను దేశం నుంచి ఏరివేసేందుకు ఉద్దేశించినట్టు చెబుతున్న ‘జాతీయ పౌర జాబితా'(ఎన్ఆర్సీ) పలు వివాదాలకు కారణమవుతున్నది. ఈ జాబితా ప్రకారం.. అసోంలో ఉన్న 19 లక్షల పైచిలుకు పౌరులు తమ గుర్తింపును కోల్పోయారు. జాబితా నుంచి తొలగించబడ్డ వాళ్లలో కొందరు మాత్రమే విదేశీయులు ఉన్నారని, గత కొన్నేండ్లుగా ఇక్కడే నివసిస్తున్న నిజమైన భారతీయ పౌరులు కూడా అనర్హత వేటుకు గురయ్యారని అక్కడి స్థానిక సర్వే సంస్థలు నివేదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసోంలోని గోల్ పాడా, కామ్ రూప్, బార్పేట తదితర జిల్లాల్లో ‘నవతెలంగాణ’ పర్యటించింది. భారత పౌరులుగా గుర్తింపును కోల్పోయి అయోమయంలో చిక్కుకున్న పలువుర్ని కలిసింది.
ఎలా బతికేది?
అసోంలోని బార్పేట జిల్లా భవానీపూర్ తహసిల్ లోని చౌలియేబరి గ్రామంలో ఏండ్లుగా నివసిస్తున్న పలు కుటుంబాలు రాత్రికి రాత్రి విదేశీయులైపోయారు. ఇదంతా ఎన్ఆర్సీ చలువే. విదేశీయులుగా గుర్తించబడ్డ వారు శిక్షను ఎదుర్కోవడమో లేదా వారి సొంత దేశానికి వెళ్లిపోవడమో చేయాల్సి ఉంటుందన్న ప్రభుత్వం హెచ్చరికల భయంతో శనివారం నుంచి వాళ్లు తిండి కూడా సరిగ్గా తినట్లేదు. జాబితాలో పేర్లు లేని వ్యక్తులు విదేశీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలని అధికారులు సలహా ఇస్తున్నారు. దినసరి కూలి చేసుకొని పొట్టపోసుకునే తాము కోర్టులు, ట్రిబ్యునల్స్ చుట్టూ తిరిగితే ఇంట్లో పిల్లల్ని, వృద్ధుల్ని పోషించేది ఎవరు? అని వారు వాపోతున్నారు. ‘మా ఇంట్లో ఎనిమిది మంది. అమ్మ, నాన్న ముసలివారు. నేను, నా భార్య, తమ్ముడు రోజూ భవానీపూర్‌కి పనికి వెళ్తాం. వచ్చిన అత్తెసరు డబ్బుతో ఇద్దరు పిల్లలతో సహా మేమంతా బతకాలి. ఇప్పుడు జాబితాలో నాది, నా భార్య, తమ్ముడి పేరు లేదు అంటున్నారు. కోర్టుల చుట్టూ తిరిగితే మా కుటుంబాన్ని పోషించేది ఎవరు?’ అని వాపోయాడు మహేష్ కామ్ర. ‘నా భర్త, పిల్లల పేర్లు జాబితాలో వచ్చాయి. నాపేరు మాత్రం రాలేదు. ఇదెలా సాధ్యం? నాకు పెండ్లి జరిగి నలభై ఏండ్లు అయింది. నేను పుట్టింది లఖింపూర్(గోల్ పాడా జిల్లా, అసోం)’ అంటూ జాబితాలో తన పేరు గల్లంతుపై అసంతృప్తి వ్యక్తం చేశారు మను బారు. అధికారుల తప్పులతో తమ గ్రామాల్లో చాలా మంది పేర్లు గల్లంతు అయ్యాయని కామ్ రూప్ జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. విదేశీ ట్రిబ్యునల్స్‌ను ఆశ్రయించినప్పటికీ తమ కేసులు ఎప్పుడు విచారణకు వస్తాయో, కేసు విచారణకు వచ్చినప్పటికీ తాము ఆ కేసులో గెలుస్తామో లేదో అని చాలా మంది నిరక్షరాస్యులు, పేదలు భయభ్రాంతులవుతూ కన్నీటి పర్యంతమయ్యారు.
ఇటు తప్పుల తడక.. అటు చేతి వాటం!
వేలాదిమంది అసలైన పౌరులు ఎన్ఆర్సీ మూలంగా భారతీయ గుర్తింపు కోల్పోవడానికి అధికారులు జాబితాను తప్పుల తడకగా రూపొందించడమే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్వాకం మూలంగా పౌర గుర్తింపు కోల్పోయిన తమను ప్రభుత్వం ఎక్కడ దేశం నుంచి బహిష్కరిస్తుందోనని, లేదా జైల్లో వేస్తారోనన్న భయం ప్రజల్లో నెలకొంది. ప్రజల అసహాయతను కొందరు దళారులు, కింది స్థాయి అక్రమ అధికారులు ‘క్యాష్’ చేసుకుంటున్నారు. అంతగా అవగాహన లేని వాళ్లు, నిరక్షరాస్యులు, పేద ప్రజలే లక్ష్యంగా ట్రిబ్యునల్, సేవా సహాయ కేంద్రాల వద్ద కొందరు దందాలకు తెరలేపారు. జాబితాలో పేరు వచ్చేలా చేస్తామని, ట్రిబ్యునల్‌లో కేసును త్వరగా విచారణకు తీసుకొస్తామని అక్రమార్కులు అమాయకుల నుంచి రూ.వందలు, రూ.వేలను దోచుకుంటున్నారు. ఇవేమీ తెలియని సామాన్యులు ప్రభుత్వం జైల్లో పెడుతుందేమోనన్న భయంతో ఉన్నదంతా ఊడ్చి మరీ ఇస్తున్నారు. కండ్ల ముందు ఇంత జరుగుతున్నా.. ఉన్నతాధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండటం గమనార్హం.
ఎన్నెన్ని ఉదంతాలో!
- ఎన్ఆర్సీలో పేరు లేకపోవడంతో ఓ పెండ్లి ఆగిపోయింది. అసోంలోని నయగ్రమ్ గ్రామానికి చెందిన దిల్వర్ హుస్సేన్ లస్కర్కి ఇటీవలే వివాహ సంబంధం కుదిరింది. అయితే, దిల్వర్ పేరు జాబితాలో లేదన్న కారణంతో వధువు తండ్రి ఈ పెండ్లికి ఒప్పుకోలేదు.
- ‘ఎన్ఆర్సీలో నీ పేరు లేదం’టూ అధికారులు ఇచ్చిన ప్రాథమిక తప్పుడు సమాచారం.. ఓ నిండు గృహిణి ఉసురు తీసింది. అసోంలోని సోనిత్పూర్ జిల్లాలోని ఓ మహిళ ఎన్ఆర్సీలో తన పేరు లేదని బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. జాబితాపై అసోం ప్రజల్లో నెలకొన్న ఆందోళనకు ఈ ఘటనే ఓ నిదర్శనం.
- కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం తరపున పనిచేసిన అర్మీ రిటైర్డు ఆఫీసర్ మహ్మద్ సనాఉల్లా ఖాన్ పేరు ఎన్ఆర్సీ జాబితాలో గల్లంతైంది. ఎన్ఆర్సీ నివేదిక ఎంత నిబద్దతతో రూపొందించారో ఈ ఒక్క ఉదంతంతో తెలుస్తున్నదని విమర్శకులు మండిపడుతున్నారు.
(COURTECY NAVA TELANGANA)