దిశ కేసుపై ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు

0
231
  • మహబూబ్‌నగర్‌ జిల్లా అదనపు కోర్టే ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుగా మార్పు
  • హైకోర్టు అనుమతితో ఏర్పాటు

హైదరాబాద్‌, డిసెంబరు 4 : దిశపై అత్యాచారం, హత్య ఘటనపై విచారణను వేగవంతం చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్‌ ఏర్పాటు చేసింది. హైకోర్టు నుంచి అనుమతి రావడంతో న్యాయశాఖ కార్యదర్శి సంతో్‌షరెడ్డి జీవో జారీ చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా సెషన్స్‌ కోర్టులోని మొదటి అదనపు కోర్టును ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుగా మార్పు చేస్తారు. షాద్‌నగర్‌ పోలీసు స్టేషన్‌లో నమోదైన దిశ అత్యాచారం, హత్య కేసు (క్రైమ్‌నెం. 784/2019)ను ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు విచారణ జరుపుతుంది. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో వాయిదాలు లేకుండా రోజువారీ విచారణ జరుగుతుంది కాబట్టి తీర్పు సత్వరమే వెలువడే అవకాశం ఉంది. వరంగల్‌ జిల్లాలో 9 నెలల చిన్నారిపై హత్యాచారం కేసు విచారణకు కూడా గతంలో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేశారు. ఆరు నెలల్లోపే తీర్పు వెలువడింది. నిందితుడికి ఉరి శిక్ష పడింది. దీన్ని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం యావజ్జీవ ఖైదుగా మార్చింది. దిశ హత్యోదంతంలో నిందితులు మహ్మద్‌ అరీఫ్‌, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్‌ను సమగ్రంగా విచారించేందుకు వీలుగా పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా ఏడు రోజులకు అనుమతినిచ్చింది. దిశపై సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో ఇద్దర్ని హైదరాబాద్‌ సీసీఎస్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండ జిల్లాకు చెంది న అనిల్‌కుమార్‌, ఏపీలోని గుంటూరుకు చెంది న సాయినాథ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దిశ గుర్తింపును కొన్ని మీడియా సంస్థలు వెల్లడించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యంపై కేంద్రం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ ప్రభుత్వాలకు, ఆయా మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఏమిటీ లీకులు: జైళ్ల శాఖ ఐజీ ఆగ్రహం
కుషాయిగూడ/హైదరాబాద్‌: జైళ్ల శాఖ ఐజీ బి.సైదయ్య బుధవారం చర్లపల్లి జైలును సందర్శించారు. దిశ కేసులో నిందితులు జైలుకు తరలించినప్పటి నుంచి నాలుగు రోజులుగా జైలుకు సంబంధించిన వార్తా కథనాలు ప్రచురితమవుతున్న విషయమై ఆయన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. నిందితుల సింగిల్‌ సెల్స్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ప్రశ్నించినట్లు తెలిసింది. మీడియాకు లీకుల నేపథ్యంలో సూపరింటెండెంట్‌ ఎం.సంపత్‌కు మెమో జారీ అయినట్లు సమాచారం.

Courtesy Andhrajyothi…

Leave a Reply