ఆర్థిక మంత్రి నోట అబద్ధాలు

0
214

కార్ల అమ్మకాలపై అసంబద్ధ వాదనలు… వాస్తవాలు చెబుతున్న గణాంకాలు 
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర మాంద్యంలో కూరుకుపోతున్నది. దీంతో పాటు ఆటోమొబైల్‌ రంగం కూడా సంక్షోభంలో చిక్కుకుంటున్నది. దీంతో ఆ రంగంలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి…రోడ్డున పడుతున్నారు.. అయితే ఈ తిరోగమనానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణమని ప్రతిపక్షాలు, పలువురు ఆర్థికవేత్తలు, మేధావులు విమర్శిస్తున్నారు. ఈ సంక్షోభ పరిష్కారానికి మార్గాలను వెతకాల్సిన మోడీ సర్కార్‌ ఈ సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నదనే వాదనలు పడుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, ఆటోమొబైల్‌ రంగంలో సంక్షోభానికి మిలీనియన్ల(28 నుంచి 38 సంవత్సరాల మధ్య వయసు ఉండే యువత) మనస్తత్వమే కారణమని అన్నారు. వారు సొంత వాహనాలను కొనుగోలు చేసి వినియోగించకుండా ఓలా, ఉబెర్‌, రేడియో టాక్సీ వంటి వాహనాలను ప్రోత్సహిస్తూ ఈ రంగం సంక్షోభానికి కారణమౌతున్నారని అన్నారు. అయితే మంత్రి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అర్ధరహితమనీ, ప్రభుత్వం వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఆమె ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు సంబంధించిన గణాంకాలను వారు ముందుకు తెస్తున్నారు.

మిలీనియన్ల మనస్తత్వమే కారణమమా.?
1981 నుంచి 1996 మధ్యలో జన్మించిన వారిని మిలీనియన్లు అంటారు. ఈ యువకుల్లో తక్కువ శాతం మంది మాత్రమే కార్లు, ఇండ్లు కొనుగోలు చేస్తుంటారు. అంతమాత్రాన వారంతా వీటిని కొనుగోలు చేయడానికి అంతగా ఇష్టపడరని ఈ కొనుగోళ్లు రుజువు చేయగలుగుతాయా? వారికి కార్లు, గృహాలను కొనుగోలు చేసే స్థోమత కూడా లేకుండా ఉండొచ్చు కదా.!. ఉదాహరణకు దేశంలోని 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు గల నైపుణ్యం గల యువతలో ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 33 శాతానికి పైగా ప్రస్తుతం నిరుద్యోగులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికి ఆదాయ మార్గాలు ఉండవు. మరి ఉద్యోగాలు లేక ఆర్థికంగా సతమతమౌతున్న సమయంలో వారు కార్లు, గృహాలు ఎలా కొనుగోలు చేయగలుగుతారని విశ్లేషకుల ప్రశ్న. దీనికి తోడు గత 2009-10 నుంచి ప్రయివేటు రంగంలో వేతనాల వృద్ధి ఘోరంగా ఉన్నది. ఒకవేళ ఈ రంగంలో ఉద్యోగం ఉన్న వారు కూడా తమకు వస్తున్న జీతంతో కార్లు వంటి విలాసవంతమైన వస్తువులను ఎలా కొనుగోలు చేయగలరనే వాదన వస్తోంది.

పడిపోతున్న ఓలా, ఉబెర్‌ సంస్థల వృద్ధి
ప్రయాణాల కోసం యువత సొంత వాహనాలకు బదులుగా ఓలా, ఉబెర్‌, రేడియో వంటి ట్యాక్సీ సంస్థలను ఆశ్రయిస్తున్నారని నిర్మలా సీతారామన్‌ చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించిన గణాంకాలు ఆమె వాదనకు విరుద్ధంగా ఉన్నాయి. ఓలా, ఉబెర్‌ సంస్థకు వస్తున్న రైడ్‌లు క్రమేపీ తగ్గుముఖం పడుతున్నాయని ఎకనామిక్‌ టైమ్స్‌ ఈ ఏడాది జూన్‌లో ఒక నివేదిక విడుదల చేసింది. గత ఆరు నెలల కాలం కంటే రోజువారీ రైడ్‌లు కేవలం 4 శాతం మాత్రమే పెరిగాయని పారిశ్రామిక రంగ నిపుణులు అంటున్నారు. ఇది గతంతో పోల్చుకుంటే భారీ తేడా ఉంది. ఈ రంగంలో 2016లో 90 శాతం వృద్ధి కనిపించగా, ఇది 2017లో 57 శాతం, 2018 నాటికి 20 శాతానికి క్రమేపీ పడిపోయింది. కేంద్ర మంత్రి చెబుతున్నట్టుగా యువత ఈ ట్యాక్సీ వాహనాలను విరివిగా వినియోగిస్తుంటే వాటి రైడ్‌ల వృద్ధి ఎందుకు పడిపోతుందన్న ప్రశ్న రాకమానదు. దీనికితోడు వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్ల సంఖ్య క్రమంగా పడిపోతోంది. ఈ ట్యాక్సీల వినియోగం ఎక్కువగా ఉండే ముంబై నగరంలో 2017-18 సంవత్సరంలో 66 వేల టూరిస్టు క్యాబ్‌లను రిజిస్ట్రేషన్‌ చేసుకోగా, వాటి సంఖ్య 2018-19 నాటికి 25 వేలకు పడిపోయింది.

లారీలు, ట్రాక్టర్లు, బస్సులు, టూవీలర్ల సంగతేంటి..?
మంత్రి చెప్పినట్టుగా ఆటోమొబైల్‌ రంగంలో సంక్షోభానికి యువతే కారణమని భావిస్తే, దీని ప్రభావం ఇతర రంగాలపై కన్నా ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలపై ఉండాలి. అయితే గతేడాదితో పోల్చుకుంటే లారీల అమ్మకాలు 60 శాతం మేర పడిపోవడంపై ప్రభుత్వ పెద్దలు ఏం సమాధానం చెబుతారు? గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ట్రక్కులు, బస్సులు అమ్మకాలు 39 శాతం మేర దిగజారాయి. రుతుపవనాల కాలమైనా రైతులు వినియోగించే ట్రాక్టర్ల అమ్మకాలు 14.4 శాతం మేర పడిపోయాయి. ఇకపోతే గ్రామీణ రంగంలో టూవీలర్లు(బైక్‌లు) కీలక డిమాండ్‌ ఉంటుంది. అయితే ఆగస్టు 2019 నాటికి ఈ వాహనాల అమ్మకాల్లో కూడా 22 శాతం తగ్గుదల కనిపించింది. 2018, ఆగస్టులో 19 లక్షల ద్విచక్రవాహనాలు అమ్ముడయితే, 2019 ఆగస్టులో ఆ సంఖ్య 15 లక్షలకు పడిపోయింది. గ్రామీణ వ్యవస్థలోని రైతుల ఆదాయం పడిపోవడానికి ఈ గణాంకాలు చూపెడుతున్నాయి. 2013-14 సమయంలో గ్రామీణ వేతనాల వృద్ధి అధిక స్థాయిలో 27.7 శాతం ఉండగా, అది ప్రస్తుతం 5 శాతానికి పడిపోయింది. ఈ విధంగా ఆర్థిక సంక్షోభానికి వివిధ రకాల ప్రభుత్వ పాలనాపరమైన కారణాలు ఉండగా, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ మాత్రం దానికి విరుద్ధంగా యువతను బాధ్యులుగా చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆమె వాదన సరికాదని విశ్లేషకులు గణాంకాలతో సహా నిరూపించారు.

(Courtesy Nava Telangana)

Leave a Reply