బుజ్జాయిలపై బూచోళ్ల కళ్లు

0
224
  • గ్రేటర్‌లో గుట్టుగా శిశు విక్రయాలు
    హైదరాబాద్‌; న్యూస్‌టుడే, వెంగళ్‌రావునగర్‌ : * ఆ ఇద్దరు అన్నదమ్ములు. కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. మగపిల్లాడు కావాలని కోరుకున్నారు. సోదరులిద్దరికీ ఆడపిల్లలే. వారసుడు కావాలనే కోరిక తీరలేదు. ఆ ముచ్చట తీర్చుకొనేందుకు వారిలో ఒకరు, రోడ్డు పక్కన నిద్రపోతున్న మహిళ పక్కనున్న చిన్నారిని తీసుకెళ్లిపోయాడు. సీసీ ఫుటేజ్‌ ద్వారా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పిల్లాడిని గుర్తించి తల్లికి అప్పగించారు. పాతబస్తీలో జరిగిందీ ఘటన.

* వారికి పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగలేదు. దత్తత తీసుకొనేందుకు నిబంధనలు అడ్డొస్తున్నాయని అడ్డదారి ఎంచుకున్నారు. ప్రైవేటు ఆసుపత్రి నర్సును సంప్రదించారు. మహబూబ్‌నగర్‌ నుంచి ప్రసవానికి వచ్చిన మహిళకు ఆడపిల్ల పుట్టింది. అప్పటికే ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు. ఆమెతో నర్సు మాట్లాడింది. శిశువును విక్రయించే ఉపాయం చెప్పింది. రూ.50,000 ఒప్పందంతో పిల్లల్లేని ఆలుమగలకు బిడ్డను అప్పగించారు. ఆ తరవాత మనసు మార్చుకున్న కన్నతల్లి నర్సుతో గొడవపడటంతో విషయం బయటకు పొక్కింది. పోలీసులకు తెలిస్తే ఆసుపత్రి పరువు పోతుందనే భయంతో యాజమాన్యం రాజీకుదిర్చింది. జీడిమెట్ల పరిధిలో వెలుగుచూసిందీ ఘటన.
* పేదరికం కొందరి కన్నపేగును కఠినంగా మారుస్తుంటే.. బిడ్డల్లేని లోటు మరికొందరిని అడ్డదారులు తొక్కిస్తోంది. కారణాలు ఏవైనా గ్రేటర్‌ పరిధిలో శిశు విక్రయాలు గుట్టుగా సాగుతున్నాయనేది ఇటీవల జరిగిన వరుస ఘటనలతో మరోసారి బయటపడింది.

* షాపూర్‌నగర్‌లో మద్యానికి బానిసైన వ్యక్తి నిస్సహాయత, పేదరికాన్ని అవకాశం చేసుకొని మధ్యవర్తులు రెండు నెలల శిశువును రూ.22 వేలకు కొనుగోలు చేశారు. పాతబస్తీలో ఆరుబయట ఆడుకుంటున్న బాలుడిని ఓ వ్యక్తి విక్రయించేందుకు తీసుకెళ్లాడు. మహా నగరంలో వెలుగుచూడని ఇలాంటి ఘటనలు మరెన్నో.

పిల్లలు.. ఆదాయ మార్గాలు
నగరంలోని శిశు విహార్‌లో 1-5 ఏళ్ల వయసు గల చిన్నారులు 217 మంది ఉన్నారు. వీరిలో అనారోగ్యం, పేదరికం, విక్రయం తదితర కారణాలతో ఇక్కడకు చేరిన వారే ఎక్కువ. గ్రేటర్‌ పరిధిలో ఏటా సుమారు 20-30 మంది పసిపిల్లలను ఇక్కడకు తీసుకొస్తుంటారు. మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి ప్రసవం కోసం హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వస్తుంటారు. వీరిలో అధిక సంతానం, పేదరికంతో బాధ పడుతున్న దంపతులే దళారుల లక్ష్యం.  ముందుగా తాము ఒప్పందం కుదుర్చున్న వ్యక్తులతో వీరిని కలుపుతారు. శిశువులను కొనుగోలు చేసే వారిలో పిల్లల్లేని దంపతులు, బెగ్గింగ్‌ మాఫియా సభ్యులు ఉంటారు. ఇక్కడ కొనుగోలు చేసిన, అపహరించిన చిన్నారులను ముంబయి, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్టణం తదితర ప్రాంతాలకు తరలిస్తారు. ఇతర ప్రాంతాల పిల్లలను హైదరాబాద్‌ పంపుతారు. ఆహార్యం మార్చేసి పిల్లలతో భిక్షాటన, మత్తుపదార్థాల రవాణా, చోరీలు చేయిస్తుంటారని సామాజికవేత్త డాక్టర్‌ మమతా రఘువీర్‌ తెలిపారు. అదృశ్యం కేసులు నమోదు చేసిన పోలీసులు పిల్లల ఆనవాళ్లు పసిగట్టలేకపోతున్నారు. వయసురీత్యా వచ్చే మార్పుతో కన్నవారికి దూరంగా అనాథలుగా బతుకుతుంటారని ఆమె ఆవేదన వెలిబుచ్చారు.

ఆపరేషన్‌ ముస్కాన్‌లో వీరే
గ్రేటర్‌లోని మహిళా శిశు సంక్షేమ శాఖ, మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో చేపట్టిన ‘ఆపరేషన్‌ స్మైల్‌’ ద్వారా ఏటా 1500-2000 మంది వరకూ బాలబాలికలను కాపాడుతోంది. వీరిలో పసికందుల నుంచి నాలుగేళ్ల మధ్య వారు 10-20 శాతం ఉంటున్నారు. వీరిని అక్రమంగా రవాణా చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తిస్తున్నారు. గతేడాది సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఆడపిల్ల పుట్టిందనే కోపంతో భార్యను చిత్రహింసలు పెట్టినవి ఏడు కేసులు నమోదయ్యాయి.

Courtesy Eenadu

Leave a Reply