కేసీఆర్‌ ఒక్కరే రాజకీయాలు చేయాలా?

0
294
  • బహుజన రాజకీయాలు చరిత్రాత్మక అవసరం 
  • ఇప్పటిదాకా 5-7ు జనాభా ఉన్నవారే సీఎంలు
  • 93ులో ఒక్కరు కూడా సీఎం అయ్యే వ్యక్తి లేరా? 
  • శాస్త్రీయ అధ్యయనం చేయకుండానే ‘దళిత బంధు’
  • ఏడేళ్లుగా లేని ఈ పథకం ఇప్పుడే ఎందుకొచ్చింది?
  • పాపం దళిత ఐపీఎస్‌ అని సీఎం అనడమేంటి?
  • ఫాంహౌస్‌ల్లాంటి బందిఖానాలు సృష్టించుకోను
  • ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌
  • నేడు నల్లగొండ సభలో బీఎస్పీలో చేరిక

ప్రవీణ్‌కుమార్‌కు దాడులు, ప్రాణభయం కొత్తకాదు. కేసులు, జైలుకెళ్లడం గురించి ఆలోచిస్తే మా లక్ష్యాన్ని చేరుకోలేం. వెయ్యి కేసులైనా బాధపడను. నా ఒక్కడిపై కేసులు పెడితే ఆగుతదా? నన్ను ఒక వ్యక్తిగా, ఒక రిటైర్డు అధికారిగా చూస్తే అంచనా తప్పినట్లే. లక్ష మంది ప్రవీణ్‌కుమార్‌లు వస్తరు.

రాష్ట్రంలో రాజకీయ శూన్యత వాస్తవం. రాజకీయ పార్టీలకు లక్ష్యం లేదు. దండోరాలు, జాతరలు కాదు.. కావాల్సింది. ఈ జాతులను అభివృద్ధి చేయాలన్న ఆలోచన గుండెల్లో నుంచి రావాలి. నేను కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. దగా పడ్డ ప్రజలకు అండగా, బహుజనుల అభివృద్ధే లక్ష్యంగా బీఎస్పీ ఉంది. కొత్త పార్టీ పెడితే అందరూ నా వెంట వస్తారనుకోవడం మూర్ఖత్వం.. అమాయకత్వం. 

హైదరాబాద్‌ : రాజకీయాలు ఏ ఒక్కరికో పరిమితం కావని మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.  కులాలు, మతాల పేరిట, హత్యలు చేసి, అత్యాచారాలు చేసి బహుజనులను రాజకీయాలకు దూరంగా పెట్టారని ఆరోపించారు. బహుజనులు రాజకీయాలు నేర్చుకుంటే తప్పేంటని, కేసీఆర్‌ ఒక్కరే రాజకీయాలు చేయాలా? అని ప్రశ్నించారు. బహుజన రాజకీయాలు చరిత్రాత్మక అవసరమని అన్నారు. ఏమాత్రం శాస్త్రీయ అధ్యయనం చేపట్టకుండా సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని ప్రకటించారని విమర్శించారు. ఏడేళ్లుగా లేని ఈ పథకం.. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ముందే ఎందుకొచ్చిందో దళిత మేధావులు ఆలోచించాలన్నారు. బహుజనులకు తరతరాలుగా అన్యాయం జరిగిందని, వారికి రాజ్యాధికారం అందించడానికి ఒక్క క్షణం కూడా వృథా చేయదలుచుకోలేదని ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు..

పోలీసు అధికారిగా ఉన్న మీరు.. ఇప్పుడు కొత్త దారిలో వెళుతున్నారు. ఇది అకస్మాత్తు నిర్ణయమా?
ప్రణాళిక కాదు.. ఆరునెలల నుంచి ఆలోచిస్తున్నా. ఏదైనా సరే నిబద్ధతతో చేస్తా. గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల సంక్షేమం చూడటం నాకు చిన్న ప్రపంచంలా అనిపించింది. అందుకే ఈ బాట ఎంచుకున్నా.

ప్రతి సమావేశంలో మీ గురించి గొప్పగా చెప్పిన సీఎం.. దళిత బంధు సమావేశానికి మిమ్మల్ని ఆహ్వానించక పోవడం వల్లే బయటకు వచ్చారన్న విమర్శ ఉంది?
పొగడ్తలకు పొంగిపోను.. అవమానాలకు కుంగిపోను. దళితబంధుకు సంబంధించి ఏమేం ప్రతిపాదనలు చేస్తే బాగుంటుందని మా మంత్రిగారు అడిగారు. అనాదిగా పీడిత వర్గాలు ఆర్థిక వ్యవస్థలో భూమిక వహించింది చదువు వల్లనేనని, ఆ చదువు వల్లనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అర్థమైతదని చెప్పాను. ఎస్సీ సబ్‌ ప్లాన్‌ కింద ఉన్న రూ.16 వేల కోట్లను విద్య, వైద్యం, నైపుణ్యాల కల్పనతోపాటు వారికి వెల్ఫేర్‌ యూనివర్సిటీ పెడితే బాగుంటుందని సూచించాను. దీనిపై నోట్‌ కూడా ఇచ్చాను. కానీ, దళిత బంధు సమావేశంలో దానిపై చర్చ జరగకుండా, ప్రతి ఇంటికి పది లక్షలు ఇవ్వాలని, దానితో దళితుల కుటుంబాలు బాగు పడుతాయని భావించారు. కానీ, సీఎం ఖర్చు పెడదామనుకున్న వెయ్యి కోట్లతో.. పేద విద్యార్థులకు పక్కా భవనాలు నిర్మించి ఇవ్వవచ్చు. వంద ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ పెట్టవచ్చు. ఆన్‌లైన్‌ యూనివర్సిటీ పెట్టవచ్చు. అలా కాకుండా ఏమాత్రం శాస్త్రీయ అధ్యయనం చేయకుండా సీఎం ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారన్న భావన కలిగింది. కేసీఆర్‌పై వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదు.

దళిత మేధావులతో సీఎం చర్చించారు కదా..!
ఈ ప్రశ్న వారినే అడగాలి. ఏడేళ్లుగా లేని దళితబంధు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ముందే ఎందుకొచ్చింది?
బీఎస్పీలో చేరతానని ప్రకటించారు. కానీ, బహుజన రాజకీయాలు తెలంగాణలో విఫలమయ్యాయి కదా?
నా చేరికపై బీఎస్పీ కోఆర్డినేటర్‌ ట్వీట్‌ చేశారు. 1948లో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం, 1969లో జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని అణచివేశారు. 2009లో మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైంది. అంటే, ఒక లక్ష్యాన్ని చేరుకోవడంలో అడ్డంకులుంటాయి. 1990లో కాన్షీరాం బహుజన రాజ్యం ఏర్పాటు చేసినప్పుడు తెలుగు సమాజంలో అంత పరిపక్వత లేదు. అన్ని ఉద్యమాలతో ప్రజలు విసిగిపోయారు.. బహుజన రాజకీయాలు చరిత్రాత్మక అవసరం.

బీఎస్పీ.. యూపీలో భజన రాజకీయాలు చేస్తోంది. మీరూ వాటిని అనుసరిస్తారా?
ప్రతి యుద్ధంలోనూ కొన్ని వ్యూహాలు, ఎత్తుగడలు ఉంటాయి. లక్ష్యాలు చేరుకోవడానికి రకరకాల మార్గాలుంటాయి. బీఎస్పీ స్వచ్ఛంద సంస్థ కాదు. కేసీఆర్‌ ఒక్కరే రాజకీయాలు చేయాలా? రాజకీయాలు ఒక్కరికే పరిమితం కావు. కులాలు, మతాల పేరిట, హత్యలు చేసి, అత్యాచారాలు చేసి బహుజనులను దూరంగా పెట్టిండ్రు. వాళ్లు రాజకీయాలు నేర్చుకుంటే తప్పేంటి? స్వాగతించాలి..ప్రోత్సహించాలి.

కోదండరాం, చెరుకు సుధాకర్‌ వంటి వారిని చూశాక.. కొత్త పార్టీ పెడితే ఫెయిలవుతామని భయపడ్డారా?
అదేం లేదు. కానీ, వారి నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. కోదండరాం, జేడీ లక్ష్మీనారాయణ, జయప్రకాశ్‌ నారాయణ వంటి వారు స్వతంత్రంగా ఆలోచిస్తరు. వారు మేధావులు. తమ వల్లనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని వారు అనుకుని ఉండవచ్చు. అయితే వారు విఫలమయ్యారని నేను అనను. ఒక ప్రయోగం చేశారు. వారి పొరపాట్లు గుర్తించి మేం జాగ్రత్త పడతాం. వారి సక్సె్‌సను తీసుకుని మా వ్యూహానికి మరింత పదును పెడతాం.

తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీపై మీ అభిప్రాయం?
నాకు వీటిపై ఏమాత్రం సంతృప్తి లేదు. ఏ వర్గాలకు న్యాయం చేయాలో ఆ వర్గాలకు వీరు న్యాయం చేయట్లేదు. సమూల మార్పులు తీసుకురావాలంటే మూలాల్లోకి వెళ్లాలి. టోకెనిస్టు పాలిటిక్స్‌, ప్రజల దృష్టి మరల్చే ఎజెండాలతో పార్టీలు పనిచేస్తున్నాయన్నది నా భావన.

షర్మిల పార్టీపై మీ అభిప్రాయం?
9వ తారీకున చెబుతా ఈ పార్టీల గురించి (నవ్వుతూ). వైఎస్‌ ఆశయాలు ఏమిటన్నది తెలంగాణ ప్రజలకు తెలుసు. కానీ, ఎవరికి చిత్తశుద్ధి ఉందన్నది ఆచరణలో తెలిసిపోతుంది. ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటివరకు 11 మంది ముఖ్యమంత్రులు పనిచేస్తే ఇద్దరు తప్ప మిగతావారంతా ఆధిపత్య కులాల వారే. జనాభాలో వీరిశాతం 5-7 శాతమే. 93 శాతంలో ఒక్కరు కూడా సీఎం అయ్యే వ్యక్తి లేరా? కులాలపై నాకు ద్వేషం లేదు. కానీ, మేనిఫెస్టోలో ఎన్నో చెప్పినా, ఆచరణ జరగదు. ఉదాహరణకు ఎంబీసీ కార్పొరేషన్‌కు వెయ్యికోట్లు అని ప్రకటించి.. జీతం తప్ప ఏమీ ఇవ్వలేదు.

ఆత్మగౌరవం మీ మేనిఫెస్టో అంటున్నారు. కానీ, కేసీఆర్‌ తీసుకొచ్చిన దళితబంధు లక్ష్యం అదే కదా?
కేసీఆర్‌ డబ్బులు ఇస్తున్నందుకు నేను వ్యతిరేకం కాదు. ఆదరాబాదరాగా చేయడం కరెక్టు కాదు. వారికి శిక్షణ ఇచ్చిన తర్వాత నిధులిస్తే బాగుండేది. హుజూరాబాద్‌, వాసాలమర్రే ఎందుకు? లబ్ధిదారుల ఎంపిక ఎలా చేశారు? ఏడేళ్ల నుంచి ఏమైనా పరిశోధన చేశారా?

దొర ఏందిరో అన్నారు.. కేసీఆర్‌ను ఢీ కొట్టగలరా?
అది చరిత్ర నిర్ణయిస్తది. తెలంగాణ కేసీఆర్‌ ఒక్కడి వల్లనే రాలేదు. ఆయన చతురతతో క్రెడిట్‌ కొట్టేశారు. 1300 మంది బిడ్డలు తెలంగాణను సృష్టించిండ్రు.

రాజ్యాధికారాన్ని ఎలా సాధిస్తారు?
రాజ్యాధికారం వస్తే నా సుఖాల కోసం ప్రజలను మోసం చేయను. 26 ఏళ్లు ప్రభుత్వ అధికారిగా పనిచేసిన నా ఇల్లు చూడండి.. ప్రస్తుత పాలకుల ఇల్లు చూడండి. ఆ సంపద వారికి ఎక్కడినుంచి వచ్చింది? ఫాంహౌ్‌సల లాంటి బందీఖానాలు నేను సృష్టించుకోను. నాకు ఒక బెడ్‌రూం, బాత్‌రూం ఉంటే చాలు. నాకన్నా గొప్పగా ప్రజలు జీవించేలా చూడటమే లక్ష్యం. విద్య, వైద్యం, ఉపాధి, ప్రపంచంలోని గొప్ప అవకాశాలు వారికి కల్పిస్తాం. మాకు అధికారం వస్తే ఒక్క క్షణం కూడా వృధా చేయం. మొత్తం అధికార యంత్రాంగాన్ని మానవాభివృద్ధి కోసం వినియోగిస్తాం. సీఎం సెక్రటేరియట్‌కు రాకపోతే ఎలా?

మీ (రాజకీయ) ఎజెండా ఏంటి?
బహుజనులకు తరతరాలుగా అన్యాయం జరిగింది. ఓట్లేసే పనిముట్లుగానే చూస్తున్నరు. వారందరినీ బహుజనవాదం వైపు తీసుకొస్తాం.

ధన రాజకీయాలకు జనం కూడా అలవాటు పడ్డారు. ఈ పరిస్థితిలో నాలుగైదు సీట్లు గెలుచుకోగలుగుతారా?
ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధిస్తాం. నా వెంట ఉన్న లక్షలాది మంది బహుజన బిడ్డల వద్ద ఆ స్ఫూర్తి ఉంది.

కేసీఆర్‌తో చెడింది కాబట్టే ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బహుజనవాదాన్ని ఎత్తుకున్నారన్న విమర్శ ఉంది?
దుర్మార్గమైన విమర్శ అది. సీఎం పిలవకుండా నేనెప్పుడూ ప్రగతిభవన్‌కు వెళ్లలేదు. ఏడేళ్లలో నాలుగైదుసార్లు మాత్రమే వెళ్లాను.

డజన్‌సార్లు మిమ్మల్ని సీఎం పొగిడారు కదా..!
కేసీఆర్‌ నన్ను పొగిడినందుకు ధన్యవాదాలు. ఆయనతో అభిప్రాయ భేదాలతో నేను బయటకు రాలేదు.

పెద్దపల్లిలో మీరు దేవుళ్లను కించపరచలేదా?
నేను ఎక్కడా దేవుళ్లను కించపరచలేదు. నేను చెప్పనిది చెప్పినట్లు వీడియో మార్ఫింగ్‌ చేయడంపై సైబరాబాద్‌ పోలీసులకు అదేరోజు కంప్లైంట్‌ ఇచ్చిన. ఆధారం ఉంటే నన్ను జైలుకు పంపండి. నేను హిందువును. నా జీవితం తెరిచిన పుస్తకం. నేను అసాంఘిక కార్యక్రమాలు చేస్తే 25ఏళ్ల సర్వీసులో అత్యుత్తమ గ్రేడింగ్‌ ఎలా ఇస్తారు?

పైకి మాత్రం బహుజనులు అంటున్నా, ఒక కులానికి మాత్రమే మీరు పరిమితమయ్యారన్న విమర్శ ఉంది?
ఇది పెద్ద కుట్ర. అసెంబ్లీ సాక్షిగా సీఎం నన్ను దళిత పోలీసు అధికారి అని అనడం, పాపం దళితుడు.. అంటూ కొంతమంది చేసిన వ్యాఖ్యలు ఇబ్బందికరమే. పాపం ఎందుకు? నేను ఐపీఎస్‌ నుంచి వచ్చిన. పాపం దళిత పోలీసు అధికారి అనడం ఏంటి?

మీరు పోలీసు అధికారిగా ఉన్నప్ప్డుడు ఇదే దళిత బిడ్డలను ఎన్‌కౌంటర్‌లో బలి చేశారని, ఆ నెత్తుటి మరకలను తుడిచి వేసుకునేందుకే ఇప్పుడు దళితులకు రాజ్యాధికారం అనే మాటలు చెబుతున్నారన్న విమర్శ ఉంది?
ప్రవీణ్‌కుమార్‌ దళిత పోలీసు అధికారి అని అనడం ఎంత కుట్రపూరిత ఆరోపణో.. ఇది కూడా అంతే కుట్రపూరిత ఆరోపణ. నేను ఎన్‌కౌంటర్‌లు చేసి ఉంటే ఈపాటికి జైల్లో ఉండేవాడిని. వేలాది మంది జనజీవన స్రవంతిలో కలిసేందుకు కృషి చేసిన.

దళిత అధికారులకు ప్రభుత్వంలో ప్రాధాన్యం లేదని, సీఎంవోలో కూడా ఒక్క దళిత అధికారి లేరన్న విమర్శ ఉంది?
ఎవరు ఒప్పుకొన్నా, ఒప్పుకోకపోయినా అది వాస్తవం. బహుజనులంటే ప్రభుత్వంలో ఏహ్యభావం ఉంది.

ప్రభుత్వంలో ఉన్న బహుజన అధికారులకు మీరేం చెబుతారు?
ఆత్మప్రబోధంతో పనిచేయాలని కోరుతున్న. భయంతో బతక్కండి.. నిబంధనలకు విరుద్ధంగా పనిచేయకండి. ఇన్నిరోజులు మీరు అవమానాలకు గురైండ్రు. బహుజన రాజ్యంలో మీరు అందలం ఎక్కుతరు. అది మీ హక్కు.

మీరు తయారు చేసిన స్వేరోస్‌ పాత్ర బీఎస్పీలో ఎలా ఉండబోతోంది?
స్వేరో అనేది ఒక భావన.. ఒక సిద్ధాంతం.. ఒక ఆలోచన. అది ఒక ధర్మ పరిరక్షణ సంస్థ. నా పని నేను చేస్తా. వారి పని వారు చేస్తరు.

స్వేరోస్‌ మిమ్మల్ని పొగడుతున్నరు. మిమ్మల్ని విమర్శించే వారిని బూతులు తిడుతున్నరు?
అభిమానం ఉండాల్సిందే. కానీ, అది దురభిమానంగా మారవద్దని స్వేరోలకు నేను విజ్ణప్తి చేస్తున్న. విమర్శలు చేసేవారికి సమాధానం చెప్పాలి తప్ప.. అవతలి వ్యక్తిని గాయపరిచేలా మాట్లాడవద్దని చెబుతున్నా.

నేడు బీఎస్పీ రాజ్యాధికార సంకల్ప సభ
నల్లగొండ : రాజ్యాధికార సంకల్ప సభ పేరిట బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) శనివారం నల్లగొండలో బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభలో మాజీ ఐపీఎస్‌ అధికారం ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బీఎస్పీలో చేరనున్నారు. బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్‌, రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఎన్జీ కళాశాల మైదానంలో 10 వేల మందితో సభ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని జిల్లా బీఎస్పీ నాయకులు పోలీసులకు చేసిన దరఖాస్తులో పేర్కొన్నారు. అయితే ఎంతమంది వస్తారనే దానిపై స్పష్టత లేదని, రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన కనిపిస్తున్న నేపథ్యంలో అంచనా వేయలేకపోతున్నామని’ బీఎస్పీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌ తెలిపారు.

Courtesy Andhrajyothi

Leave a Reply