- తెలంగాణలో బహుజన రాజ్యాన్ని స్థాపిస్తాం.. కేసీఆర్ పాలనకు నల్లగొండ నుంచే చరమగీతం
- బానిసలం కాదు.. పాలకులమవుతాం.. దామాషా ప్రకారం వాటా గుంజుకుంటాం
- తెలంగాణలో ఇంకా బానిస బతుకులే.. 45 లక్షల మంది చదువును వదిలేశారు
- బహుజన రాజ్యంతోనే న్యాయం.. కల్లుగీత కార్మికుల్ని కంప్యూటర్ ఇంజనీర్లు చేస్తాం
- మైనారిటీలను మిలియనీర్లుగా చేస్తాం.. ఆదివాసీలను అంతరిక్షంలోకి పంపిస్తాం
- ఎర్రకోటపైనా జెండా ఎగరేస్తాం.. పేదలపై సీఎంకు ప్రేమ ఉంటే ఆస్తులమ్మి పెట్టాలి
- అనురాగ్, మల్లారెడ్డి వర్సిటీల్లోనూ రిజర్వేషన్లు ఇవ్వాలి.. సీఎంది మాటల గారడీ
- పిట్టకథలు చెప్పను.. యాసలో మాట్లాడి వాసాలు లెక్కపెట్టను: ప్రవీణ్‌కుమార్
- నల్లగొండలో రాజ్యాధికార సంకల్ప సభ.. బీఎస్పీలో చేరిన రిటైర్డ్ ఐపీఎస్
నల్లగొండ : తెలంగాణలో బహుజన రాజ్యాన్ని తీసుకొస్తామని, ఏనుగునెక్కి.. ప్రగతిభవన్‌కు వెళతామని బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. తాము బానిసలం కాదని, పాలకులం అవుతామని, నల్లగొండ జిల్లా నుంచే కేసీఆర్ పాలనకు చరమగీతం పాడతామని ప్రకటించారు. ఆదివారం రాత్రి నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో బీఎస్పీ ఆధ్వర్యంలో రాజ్యాధికార సంకల్ప సభ జరిగింది. ఈ సభలోనే ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్ ఆ పార్టీ కండువాను కప్పి సభ్యత్వం అందజేశారు. ప్రవీణ్‌కుమార్‌ను బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నియమిస్తున్నట్లు సభలోనే ప్రకటించారు.
అనంతరం సభనుద్దేశించి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడారు. సభకు తరలివచ్చిన వారి ఉత్సాహం చూస్తుంటే అధికారం చేపట్టడం ఖాయమనిపిస్తోందని, ప్రగతిభవన్ దగ్గరలోనే ఉందని వ్యాఖ్యానించారు. బహుజన రాజ్యంతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని, అందరూ తలుచుకుంటేనే బహుజన రాజ్యంవస్తుందని అన్నారు. తరతరాలుగా దోపిడీ చేసిన వ్యక్తులు ఎన్నికలు రాగానే ఆ సొమ్మును వెదజల్లుతారని, మటన్, చికెన్ పెట్టి, డబ్బులిచ్చి మాయ చేస్తారని హెచ్చరించారు. వాటికి లొంగిపోయి ప్రమాదంలో పడవద్దన్నారు. తనకు ఇంకా ఆరున్నరేళ్ల సర్వీస్ ఉన్నా ఉద్యోగాన్ని ఎందుకు వదిలేస్తున్నావని తన తల్లితోపాటు ఎంతో మంది ప్రశ్నించారని తెలిపారు. అయితే ‘‘నా ఒక్కడి భవిష్యత్తే కాదు.. తెలంగాణలో ఉన్న బిడ్డల భవిష్యత్తు కోసం త్యాగం చేయక తప్పలేదని అమ్మకు చెప్పాను’’ అని ప్రవీణ్‌కుమార్ అన్నారు.
తెలంగాణ కోసం 1300 మంది ప్రాణత్యాగం
తెలంగాణ కోసం 1300 మంది బిడ్డలు ప్రాణత్యాగం చేశారని, అమరవీరుల స్తూపం వద్ద పాదాభివందనం చేసి తాను సభకు వచ్చానని ప్రవీణ్‌కుమార్ అన్నారు. తాను రిజైన్ చేసిన రోజే పోలీసులు కేసులు పెట్టారని, ఇక్కడున్న ఇంతమంది ప్రవీణ్‌కుమార్‌లపై ఎన్ని కేసులు పెడతారని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అని పాలకులు అంటున్నారని, అయితే ప్రజలు ఇంకా బానిస బతుకులే బతుకుతున్నారని అన్నారు. ఆకలితో ఉన్న ప్రజలకు తాను గొంతుకను అవుతానన్నారు. తెలంగాణ ప్రభుత్వం 1500 మందిని మాత్రమే విదేశాలకు పంపించి గొప్పగా చెప్పుకొంటోందని, బహుజన రాజ్యం వస్తే లక్షలాది మంది విద్యార్థులను విదేశీ విద్యకు పంపిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, అగ్రవర్ణాల బిడ్డలు ఉన్నారని, గురుకులాల్లో నాలుగు లక్షల మందే విద్యార్థులు చదువును అభ్యసిస్తే 35 నుంచి 45లక్షల మంది విద్యార్థుల చదువును వదిలేశారని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల్లో నాలుగేళ్లుగా రిక్రూట్‌మెంట్ లేదని, అలాంటప్పుడు ఆ విశ్వవిద్యాలయాల్లో చదివే పేదలకు ఎలా చదువు వస్తుందని ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా అనురాగ్, మల్లారెడ్డి యూనివర్సిటీల బిల్లుకు ఆమోదం తెలిపారని, ఆ యూనివర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలందరికీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్‌ది ఏడున్నరేళ్లుగా మాటల గారడీ..
ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడున్నరేళ్లుగా మాటల గారడీతో మోసం చేస్తున్నారని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. వరంగల్‌లో ఏడంతస్తుల ఆస్పత్రిని కట్టడమే కాకుండా దానిపై హెలిప్యాడ్ నిర్మిస్తామనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సీఎం మోసపు మాటలు ఎంతోకాలం కొనసాగవన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక వస్తుండటంతో నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు అంటూ న్యూస్‌లే తప్ప.. ఇంతవరకు ఒక్క నోటిఫికేషనైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ‘‘నాకు పిట్టకథలు చెప్పడం రాదు. యాసలో మాట్లాడి వాసాలు లెక్కపెట్టను’’ అని చెప్పారు. కొవిడ్ సమయంలో అనేకమంది చనిపోతుంటే ఆదుకున్నవారే లేరన్నారు. సంపదంతా ఐదు శాతం ఉన్న ఆధిపత్య కులాల వద్దే ఉందని, పేదరికం మొత్తం 95 శాతం ప్రజల్లో ఉందని పేర్కొన్నారు. ఏ ఇండస్ట్రీ చూసినా ఆధిపత్య కులాల వద్దనే ఉంటుందన్నారు. తాను ఏ కులానికీ వ్యతిరేకం కాదని, జనాభా దామాషా ప్రకారం వాటా ఇవ్వకుంటే గుంజుకుంటామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ప్రజల సంపదనే పథకాల పేరిట తిరిగి పంచుతున్నారని, ముఖ్యమంత్రికి ప్రేమ ఉంటే తన ఆస్తిని అమ్మి ప్రజలకు పంచాలని అన్నారు.
గొప్పగా ఉండనున్న బహుజన రాజ్యం..
రాబోయే బహుజన రాజ్యం ఎంతో గొప్పగా ఉంటుందని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. కల్లుగీత కార్మికులను కంప్యూటర్ ఇంజనీర్లను చేస్తామని, మైనారిటీలను మిలియనీర్లను చేస్తామని, ఆదివాసీ బిడ్డలను అంతరిక్షంలోకి పంపుతామని ప్రకటించారు. ఒలింపిక్స్‌లో ఒకటో రెండో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ సంపాదించడం కాదని, చైనాతో భారత్ పోటీ పడేలా బహుజన రాజ్యం ఉంటుందని తెలిపారు. మైనారిటీలు, మాల మాదిగలు, ఆదివాసీ బిడ్డలు ఏ దేశానికైనా వెళ్లి చదువు చెప్పేలా బహుజన రాజ్యంలో ప్రణాళికలు సిద్ధం చేస్తామని, బహుజనులకే పెద్దఎత్తున కంపెనీలు ఉండటమే కాకుండా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేలా ఎదిగేందుకు దోహదపడతామని అన్నారు.
ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్ల కల్పన కోసం పోరాడుతామన్నారు. బహుజన బిడ్డలు చదువుకుంటే మీకెందుకు కళ్లమంట? అని ప్రశ్నించారు. తమ జీవితాలను నాశనం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్ మాట్లాడుతూ.. నల్లగొండలో ఉత్సాహం చూస్తుంటే.. 2024లో తెలంగాణలో బీఎస్పీనే అధికారంలోకి వస్తుందని అన్నారు. ప్రవీణ్‌కుమార్‌తో తాను వ్యక్తిగతంగా మాట్లాడాక రాష్ట్రంలో బీఎస్పీని ఎవరూ ఆపలేరని అర్థమైందన్నారు. కాగా, ప్రవీణ్‌కుమార్ బీఎస్పీలో చేరే నిర్ణయం తెలుసుకుని టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా పోయిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ ఏపీ అధ్యక్షుడు పరంజ్యోతి, తెలంగాణ, ఏపీ కోఆర్డినేటర్లు గంగాధర్, మల్లేశం, బాలస్వామి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
నీలిమయమైన నీలగిరి
ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రమైన నీలగిరి నీలిమయమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి బీఎస్పీ కార్యకర్తలతోపాటు ప్రవీణ్‌కుమార్ అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కార్లు, ఇతర వాహనాలతోపాటు సైకిళ్లపైనా స్వచ్ఛందంగా వచ్చారు. ప్రవీణ్‌కుమార్ విద్యాభ్యాసం కొనసాగిన నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ పాఠశాల పూర్వ విద్యార్థులు ఏనుపోతుల అరుణ్‌కుమార్, కాబీర్ శ్రీను సైకిల్‌పై నల్లగొండకు చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం 4:10 గంటలకు జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపా్‌సకు చేరుకున్న ప్రవీణ్‌కుమార్ అక్కడే అంబేద్కర్, జగ్జీవన్‌రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీతో సభా ప్రాంగణానికి బయలుదేరారు. మార్గమధ్యలో రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ రోడ్డులోని దారుల్ ఉలమ్ మసీదులో ముస్లిం సోదరులు ప్రవీణ్‌కుమార్‌కు దట్టీ కట్టారు. ర్యాలీలో బోనాలతో పాటు పలు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. సభ సమీపంలో స్వేరో సంస్థ ఆధ్వర్యంలో అనేక స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. సభకు పోలీసులు భారీ భద్రత కల్పించారు.
స్వచ్ఛందంగా నల్లగొండ బాట..
పెద్ద సంఖ్యలో విద్యార్థులు
విద్యావంతులు, ఉద్యోగుల హాజరు
నల్లగొండ : ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ బహిరంగ సభకు అంచనాకు మించి స్పందన కనిపించింది. స్వచ్ఛందంగా జనం తరలివచ్చారు. నల్లగొండ పట్టణంలో మధ్యాహ్నం నుంచే వాహనాలు, జనసందడి ప్రారంభమైంది. జిల్లాల వారీగా పార్కింగ్ ఏర్పాటు చేయగా అక్కడే వాహనాలు నిలిపి కిలోమీటర్ల మేర నడుచుకుంటూ జనం సభాస్థలికి చేరుకున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన వారి కోసం రూ.50 చెల్లిస్తే భోజనం అందించే ఏర్పాటు చేశారు. ఇతర సభలకు భిన్నంగా సభా వేదికకు సమీపంలో పెద్దసంఖ్యలో బుక్‌స్టాళ్లు కనిపించాయి. భారత రాజ్యాంగం, డాక్టర్ అంబేడ్కర్‌కు సంబంధించిన పుస్తకాల విక్రయాలు ఎక్కువగా జరిగాయి. సభకు పెద్దసంఖ్యలో విద్యావంతులు, ఉద్యోగులు, విద్యార్థులు హాజరయ్యారు. బహుజనుల కోసం పనిచేస్తున్న ప్రముఖ కవులు, కళాకారులు స్వచ్ఛందంగా కదిలివచ్చి ప్రవీణ్‌కుమార్‌కు మద్దతు తెలుపుతూ పాటలు పాడారు. మాస్టర్‌జీ, సుక్క రాంనర్సయ్య, రాంబాబు, మచ్చ దేవేందర్ వంటి కళాకారులు తమ కళాప్రదర్శనల ద్వారా సభికులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి మారెప్ప బీఎస్పీలో చేరారు.
సీఎం.. సీఎం
నల్లగొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్ నుంచి స్థానిక ఎన్‌జీ కళాశాల మైదానం వరకు నిర్వహించిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ర్యాలీ 2 గంటలకు పైగానే పట్టింది. ఆయన వేదికపైకి రాగానే నిర్వాహకులు క్రేన్ సాయంతో భారీ గజమాలతో సత్కరించారు. యువత కేరింతలు కొడుతూ కాబోయే సీఎం ఆర్‌ఎస్పీ, ఆర్‌ఎస్పీ జిందాబాద్ అని నినాదాలు చేశారు.
నాంపల్లి దర్గాను సందర్శించిన ప్రవీణ్‌కుమార్
అఫ్జల్‌గంజ్: ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆదివారం నాంపల్లిలోని యూసుఫెన్ దర్గాను సందర్శించారు. పలువురు స్వేరో శ్రేణులు, అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు. ప్రవీణ్‌కుమార్ దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేసి మతపెద్దల ఆశీస్సులు పొందారు.
Courtesy Andhrajyothi