- బ్యాంకు అధికారుల తీరుతో రైతు మనస్తాపం
- 6 నెలల్లో అప్పు తీర్చేస్తానని ప్రాధేయపడ్డా ససేమిరా
- దిక్కుతోచక బ్యాంకు వద్దే గొంతులో పురుగుల మందు
- ఆస్పత్రికి తరలింపు.. చికిత్స పొందుతూ మృతి
రేగొండ/పరకాల : బ్యాంకు అధికారుల తీరుతో ఓ రైతు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అప్పు తీర్చలేదంటూ వ్యవసాయ భూమిలో జెండాలు పాతి వేలానికి సిద్ధంకావడంతో బ్యాంకు వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కనిపర్తికి చెందిన పల్లెబోయిన రమేశ్ (51).. తన భార్య పల్లెబోయిన మల్లక్క పేరుతో ఉన్న వ్యవసాయ భూమిని ఐదేళ్ల క్రితం పరకాల డీసీసీ బ్యాంకులో మార్ట్గేజ్ చేసి రూ.4లక్షల రుణం తీసుకున్నాడు. వడ్డీ సహా మొత్తం రూ.7లక్షలు కావడంతో బ్యాంకు నిర్వాహకులు మంగళవారం ఆ భూమిలో జెండాలు పాతారు. ఈనెల 29న వేలం పాటకు తేదీని ప్రకటిస్తూ ఆ రైతుకు నోటీసులు జారీ చేశారు. ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి గురైన రమేశ్.. పరకాలలోని బ్యాంకు వద్దకు వెళ్లి అక్కడి అధికారులకు ప్రాధేయపడ్డాడు. తీసుకున్న రుణాన్ని ఆరునెలల్లో చెల్లిస్తానని చెప్పాడు. వారు ససేమిరా అనడంతో వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగాడు. బ్యాంకు అధికారులు రమేశ్‌ను ఆపడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పరకాల ఎస్సై ప్రశాంత్ ఘటన స్థలానికి చేరుకుని రమేశ్‌ను తన వాహనంలో స్థానిక ప్రభుత్వ సివిల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న క్రమంలోనే అతడు మృతి చెందాడు. మృతుడికి భార్య మల్లక్క, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఈ విషయమై డీసీసీ బ్యాంకు మేనేజర్ తిరుపతిని వివరణ కోరగా.. రమేశ్‌కు, తమకు ఎలాంటి సంభాషణ జరగలేదన్నారు. తమ వద్దకు రాకుండానే బ్యాంకు మెట్లపై ఉండి అతడు పురుగుల మందు తాగుతుండగా అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చామని, అనంతరం వారి ద్వారా ఆస్పత్రికి తరలించామని తెలిపారు.
Courtesy Andhrajyothi