ఇది తెలంగాణ ప్రశ్నా స్ఫూర్తిపై నిషేధం!

0
23
N. Venugopal

తెలంగాణలో పనిచేస్తున్న పదహారు ప్రజా సంఘాలను తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ ఆక్ట్ కింద నిషేధిస్తున్నట్టు జిఓఎంఎస్ నెం.73 ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఉత్తర్వులు అప్రజాస్వామికమూ, రాజ్యాంగ వ్యతిరేకమూ, తెలంగాణ స్ఫూర్తికి వ్యతిరేకమూ మాత్రమే కాక, ఈ జీవో రచనలో, విడుదలలో లెక్కలేనన్ని అసంగతాలున్నాయి. మొట్టమొదట మార్చ్ 30న జారీ అయినట్టు, ఆ రోజునుంచే అమలులోకి వచ్చేటట్టు ప్రకటించిన ఈ జీవో పత్రికలకు, ప్రచారసాధనాలకు, ఇరవై నాలుగు రోజుల తర్వాత, ఏప్రిల్ 23 సాయంత్రం అందింది. ఏ జీవో అయినా వెలువడిన వెంటనే ప్రజాక్షేత్రంలోకి బహిరంగంగా రావాలి గాని మూడు వారాల తాత్సారం జరిగిందంటే ఏవో ఉద్దేశాలున్నాయనుకోవాలి. చట్ట ప్రకారం ఇలాంటి జీవోను నిషేధిత సంఘాల ఆఫీసుల్లో గాని, ఇతరంగా గాని ఆ సంఘాల బాధ్యులకు అందజేయాలని, బాధ్యులు లేకపోతే, అక్కడ గోడకైనా అంటించాలని, కనీసం ఒక పత్రికలో వ్యాపార ప్రకటనగా అచ్చువేయాలని చట్టం నిర్దేశిస్తుంది. కాని చట్టం చెప్పిన పనులలో ఈ ఒక్కటీ ప్రభుత్వం చేయలేదు.

ఈ వర్తమాన గందరగోళాన్ని పరిశీలించే ముందు అసలు ఈ చట్టం పుట్టిన గందరగోళాన్ని చూడాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‍లో సాయుధ పార్టీపైన, దాని అనుబంధ సంఘాలనే ఆరోపణతో ప్రజా సంఘాలపైన నిషేధం విధించాలనే ఆలోచన రాజీవ్ గాంధీ మొదటి వర్ధంతి రోజున మొదలయింది. ఆ రోజున ఏదో ఒక సంచలనాత్మక ప్రకటన చేయాలని అనుకున్న ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి ఆ సాయంత్రం బహిరంగ సభలో హఠాత్తుగా సిపిఐఎంఎల్ పీపుల్స్‌వార్ పైన, దాని ‘అనుబంధ సంఘాలైన’ ఆరు సంస్థలపైనా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో 1908 క్రిమినల్ అమెండ్మెంట్ ఆక్ట్ కింద, తెలంగాణ ప్రాంతంలో ఫసలీ 1348 ప్రజారక్షణ చట్టం కింద నిషేధం విధిస్తున్నామని ప్రకటించాడు. ఆ వార్త విశాఖపట్నం నుంచి హైదరాబాద్ చేరేసరికే అప్పటి పౌరహక్కుల సంఘం అధ్యక్షులు, సుప్రసిద్ధ న్యాయవాది, కె జి కన్నబిరాన్ అసలు ఆ రెండు చట్టాలూ ఉనికిలోనే లేవని, వాటిని సుప్రీం కోర్టు ఎప్పుడో కొట్టేసిందని, అందువల్ల ఆ నిషేధం చెల్లదని వెల్లడించారు. అప్పుడిక నాలిక కరుచుకుని మల్లగుల్లాలు పడిన ప్రభుత్వం హడావుడిగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ ఆర్డినెన్స్ తీసుకువచ్చి, దాన్ని తర్వాత చట్టం చేసే ప్రయత్నాలు ప్రారంభించింది. అలా 1992 మే 21న ప్రకటించిన నిషేధం నెల తర్వాత జూన్ నాలుగో వారానికి గాని అమలులోకి రాలేదు.

ముప్పై ఏళ్లుగా అమలులో ఉన్న ఈ నిషేధాన్ని చట్టం నిర్దేశించిన ప్రకారం ఏడాదికొకసారి పునరుద్ధరిస్తున్నారు. నిషేధం ఉండగానే వందలమంది పత్రికా విలేఖరులు ఆ నిషిద్ధ పార్టీ నాయకులను కలిసి సుదీర్ఘమైన ఇంటర్వ్యూలు చేసి ప్రచురించారు, ప్రసారం చేశారు. 2004లో ప్రభుత్వానికి విప్లవ పార్టీలకు జరిగిన చర్చల సన్నాహాలన్నీ నిషేధం ఉండగానే జరిగాయి. కాకపోతే నిషిద్ధ, సాయుధ పార్టీతో ఈ సంప్రదింపులకు అవకాశం ఇస్తూనే, ప్రజా సంఘాల కార్యక్రమాలు ఏవీ జరగడానికి వీలులేని స్థితి కల్పించారు. అంటే ప్రభుత్వ ఉద్దేశం రాడికల్ విద్యార్థి సంఘం, రాడికల్ యువజన సంఘం, రైతుకూలీ సంఘం, సింగరేణి కార్మిక సమాఖ్య, ఆల్ ఇండియా రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్, విప్లవ కార్మిక సమాఖ్య వంటి ప్రజల్లో పనిచేస్తున్న, ఆయా సమూహాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవడమేనన్నమాట. ఇప్పుడు ఆ పాత జాబితాకు తోడు పదహారు సంస్థలను నిషేధిస్తున్నామని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు కనీసం అరడజను కారణాల వల్ల అప్రజాస్వామికమైనవి, రాజ్యాంగ వ్యతిరేకమైనవి, అధికార పార్టీ స్వవచోవ్యాఘాతానికి చిహ్నామైనవి, తెలంగాణ సమాజపు ప్రజాస్వామిక చర్చా సంప్రదాయాన్ని, వారసత్వాన్ని భూస్థాపితం చేస్తున్నవి.

జీవో విడుదలైన, బాధ్యులకు అందిన నాటి నుంచి రెండు వారాల లోపు వారు తమ అభ్యంతరాలను ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా సమర్పించాలని చట్టం నిర్దేశిస్తుంది. మరి జీవోను బైట పెట్టడానికే మూడు వారాలపైన చేసిన ఆలస్యానికి బాధ్యత ఎవరిది? చట్ట నిబంధనను తుంగలో తొక్కడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నం జరిగిందా?

అసలు సంఘాలు పెట్టుకునే హక్కు, సమావేశాలు జరుపుకునే హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛలు మానవ సహజమైనవి. వాటిని కొల్లగొట్టడానికి రాజ్యానికి హక్కులేదని రాజ్యాంగ అధికరణం 19 హామీ ఇచ్చింది. ఈ వాక్సభాస్వాతంత్ర్యాల అధికరణం ఒక సంఘాన్ని మొత్తంగా నిషేధించే అధికారాన్ని ప్రభుత్వానికి ఇవ్వలేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో వాక్సభాస్వాతంత్ర్యాల మీద ‘సకారణమైన పరిమితులు’ విధించవచ్చునని మాత్రమే రాజ్యాంగం చెప్పింది. పబ్లిక్ సెక్యూరిటీ ఆక్ట్ వంటి చట్టాలు సంఘాల నిషేధానికి అవకాశం ఇస్తున్నప్పటికీ, ఈ దేశంలో రాజ్యాంగానికీ, ఒక ప్రత్యేక చట్టానికీ పోటీ వస్తే రాజ్యాంగానిదే పైచేయి అవుతుంది.

ఇప్పుడు నిషిద్ధ సంస్థల జాబితాలో చేర్చిన సంఘాల చరిత్రను, వాటి కార్యకలాపాలను చూస్తే మరిన్ని అసంగతాలు బైటపడతాయి. ఈ పదహారు సంఘాలలో నాలుగు విద్యార్థి సంఘాలు. ఒక అసంఘటిత కార్మిక సంఘం, రెండు తెలంగాణ ఉద్యమ సంస్థలు. ఒక రైతాంగ సంస్థ. ఒక మహిళా సంస్థ. ఒక కళా సంస్థ. ఒక ఆదివాసీ సంస్థ. రెండు చట్టబద్ధ పౌరహక్కుల కోసం పోరాడే సంస్థలు. రాజ్యహింసలో మరణించిన తమ బంధుమిత్రులను తలచుకోవడానికి కుటుంబాలు ఏర్పాటు చేసుకున్న సంస్థ ఒకటి. హిందూ ఫాసిజం వ్యతిరేక ప్రచారం చేసే సంస్థ ఒకటి. వీటితో పాటు గతంలో ప్రభుత్వం చేత ఇదే చట్టం కింద నిషేధానికి గురై, చట్టబద్ధంగానే నిషేధం కొట్టివేయబడిన విప్లవ రచయితల సంఘం.

ఈ సంఘాలను నిషేధించడానికి జీవో చెప్పిన కారణాలు ఐదు: వీరు పట్టణ గెరిల్లా ఎత్తుగడలు చేపడుతున్నారట. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల చర్యలను ఎత్తిచూపుతూ రెచ్చగొట్టే ప్రకటనలతో ప్రజలను తమ సంఘాల పరిధిలోకి ఆకర్షిస్తున్నారట. మావోయిస్టుల నిర్దేశంపై బీడు భూముల ఆక్రమణ, రాజ్యనిర్బంధంపై నిరసన కార్యక్రమాలు, వరవరరావు, జిఎన్ సాయిబాబా, రోనా విల్సన్ తదితరుల విడుదల కోసం కార్యక్రమాలు, యుఎపిఎ, వ్యవసాయ చట్టాలు, సిఎఎ – ఎన్ఆర్‍సిలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్నారట. ఈ సంఘాల కార్యకర్తలు కొందరు మావోయిస్టు పార్టీ అజ్ఞాత కార్యకర్తలుగా మారారట. ఈ పదహారు సంఘాలూ సిపిఐ మావోయిస్టు ఆదేశాల మేరకే ఏర్పడి పని చేస్తున్నాయట.

ఈ ఐదు కారణాల్లో ఒక్కటి కూడా తర్కానికీ, వాస్తవ పరిశీలనకూ నిలబడదు. పట్టణ గెరిల్లా ఎత్తుగడలు అనే మాట వెనుక అంతర్జాతీయ స్థాయిల్లో ముఖ్యంగా లాటిన్ అమెరికన్ చరిత్రలో విస్తారమైన అనుభవాలున్నాయి. ఈ పదహారు సంఘాల్లో ఏ ఒక్కటైనా అటువంటి చర్యలు ఒక్కటైనా చేసిన ఉదాహరణ లేదు. అన్ని సంఘాలూ బహిరంగ ప్రజా జీవనంలో రాజ్యాంగం హామీ ఇచ్చిన వాక్సభా స్వాతంత్ర్యాలను వినియోగించుకుంటూ పనిచేస్తున్నవే.

ఇంతకూ తానే మావోయిస్టు ఎజెండా అమలు చేస్తున్నానన్న ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ పనిని నిషేధార్హం అంటున్నారు. ఆ పని చేస్తున్నారని ఆధారమేమీ లేని సంఘాలను నిషేధించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో పౌరహక్కుల సంఘం ఏర్పాటు చేసిన సభలో వక్తగా వచ్చిన కె చంద్రశేఖర రావు, తానే పౌరహక్కుల సంఘానికి అధ్యక్షుడిగా ఉంటానన్నారు. 2005లో విరసంను నిషేధించినప్పుడు, ఆ నిషేధానికి వ్యతిరేకంగా తాను ఉద్యమిస్తానని కెసిఆర్ అన్నారు. నిషేధం వల్ల జైలులో ఉన్న విరసం నాయకులు వరవరరావును కలవడానికి ప్రోటోకాల్‌ను, అభ్యంతరాలను పక్కనపెట్టి చంచల్ గూడ జైలుకు వెళ్లి కలిశారు. ఇప్పుడు నిషేధానికి గురైన పదహారు సంఘాలలో కనీసం పద్నాలుగు సంఘాలు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నాయి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నవారు చాలామంది ఈ సంఘాల వేదికల మీద మాట్లాడారు, ఈ సంఘాల నాయకులను తమ వేదికల మీదికి పిలిచారు. ఇవాళ నిషేధానికి గురైన ప్రజా కళా మండలి పాటలు లేకుండా తెలంగాణ ఉద్యమం ఒక్కరోజు కూడా నడవలేదు.

ఇది ఆ సంఘాల, సంస్థల సమస్య మాత్రమే కాదు. వాళ్లు న్యాయపోరాటం చేసి గెలుస్తారా లేదా అనేది కూడ సమస్య కాదు. ఇది మన సమస్య. తెలంగాణ సమాజ సమస్య. తెలంగాణలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అమలవుతున్నాయా లేదా అనే సమస్య. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ చారిత్రక స్ఫూర్తిని ఎట్లా పాతిపెడుతున్నదనే సమస్య. అన్యాయాన్ని ఎదిరించినవాడు నాకు ఆరాధ్యుడు అన్న కాళోజీ స్ఫూర్తి అలా ఉంచి, అన్యాయం జరుగుతున్నదని అనడానికి కూడ వీలు లేదని గొంతు నొక్కే దుర్మార్గం సాగుతున్నప్పుడు, తెలంగాణ ప్రశ్నా స్ఫూర్తిని, ధిక్కార వారసత్వాన్ని ఎత్తిపడతామా లేదా అనేది ప్రశ్న.

Courtesy Andhrajyothi

Leave a Reply