తిరుమల: తిరుమలలో గురువారం పీస్‌రేట్ క్షురకులు (Barbers) నిరసనకు దిగారు. విజిలెన్స్ అధికారులు (Vigilance officers), సిబ్బంది తనిఖీల కోసం వచ్చి కులం పేరుతో దూషించారంటూ విధులు బహిష్కరించి ప్రధాన కల్యాణకట్ట ముందు ఆందోళనకు దిగారు. తలనీలాలు సమర్పించేందుకు వచ్చే భక్తుల నుంచి నగదు తీసుకుంటున్నారనే ఫిర్యాదులు వచ్చాయంటూ విజిలెన్స్ అధికారులు గురువారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ప్రధాన కల్యాణకట్టతో పాటు మినీకల్యాణకట్టల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ క్రమంలో పీస్‌రేట్ సిబ్బంది ప్రధాన కల్యాణకట్ట ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమలలో మొత్తం 854 మంది పీస్‌రేట్ క్షురకులు, 250మందికి పైగా శాశ్వత ఉద్యోగులు ఉన్నారు.
అయితే పీస్‌రేట్ క్షురకుల నిరసనతో తలనీలాలు సమర్పించేందుకు వచ్చిన భక్తులు ఇబ్బంది పడ్డారు. ఒత్తిడి మొత్తం శాశ్వత ఉద్యోగులపైనే పడడంతో గంటల కొద్దీ భక్తులు నిరీక్షించాల్సి వచ్చింది. సాయంత్రం 4 గంటల తర్వాత పీస్‌రేట్ క్షురకులు కూడా పూర్తిస్థాయిలో విధులకు హాజరు కావడంతో పరిస్థితి చక్కబడింది. క్షురకుల సమస్యలపై టీటీడీ అధికారులతో ఉద్యోగ సంఘ నాయకులు సమావేశం నిర్వహించారు. విజిలెన్స్ తనిఖీల్లో క్షురకులకు జరిగిన అవమానాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్చించారు. క్షురకులు విధులు బహిష్కరించడంతో భక్తులు తలనీలాలు సమర్పించలేకపోయారు. దర్శన సమయం మించి పోతుండటంతో భక్తులు ఆందోళనకు దిగారు. అవస్థలు పడుతున్నప్పటికీ టీటీడీ అధికారులు పట్టించుకోలేని భక్తులు మండిపడ్డారు.