బీసీ రిజర్వేషన్లు మరో పదేళ్లు

0
313
  • ఉద్యోగ నియామకాల్లో అయిదేళ్ల వయో పరిమితి పెంపు
  • 2031 మే నెల 31 వరకు అమలు
  • రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌: తెలంగాణలోని వెనకబడిన తరగతుల(బీసీ)కు విద్యా ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లను పదేళ్లపాటు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వు (జీవో నెం.3)లు జారీచేసింది. బీసీల పురోగతి, సమగ్రాభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జూన్‌ ఒకటో తేదీ నుంచి 2031 మే నెల 31వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది. దీంతోపాటు రాబోయే పదేళ్ల కాలంలో జరిగే ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అయిదేళ్ల వయో పరిమితి పెంపును కొనసాగించేందుకూ ఆదేశించింది. అందుకు అనుగుణంగా అన్ని సాధారణ, సేవా, ప్రత్యేక నిబంధనలను ప్రభుత్వ శాఖలు సడలించాలని ఆదేశాలిచ్చింది. అన్ని శాఖలు  ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని సూచించింది.  ప్రస్తుతం బీసీలకు తెలంగాణలో 29 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి.

1970 నుంచి మొదలు..
ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారిగా కేఎన్‌ అనంతరామన్‌ కమిషన్‌ సిఫార్సులను అనుసరించి 1970 సెప్టెంబరులో బీసీలకు విద్యా, ఉద్యోగ నియామాకాల్లో  పదేళ్లపాటు రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ తర్వాత దాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. తాజాగా రిజర్వేషన్ల గడువు మే నెల 31తో ముగుస్తున్నందున బీసీ కమిషన్‌ కార్యదర్శి సిఫార్సుల మేరకు  ప్రభుత్వం మరోసారి పొడిగింపు ఉత్తర్వులను ఇచ్చింది.

జాబితాలో 130 కులాలు
ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో 112 బీసీ కులాలున్నాయి. 2014  ఆగస్టులో అనాథలను బీసీ (ఎ-గ్రూపు)జాబితాలో చేర్చారు. 2020 సెప్టెంబరులో సంచార జాతుల్లోని 17 కులాలనూ చేర్చడంతో ఈ సంఖ్య 130కి చేరింది.

Courtesy Eenadu

Leave a Reply