- నారద టేపుల కేసులో ఐదేళ్ల తర్వాత నలుగురిని అరెస్టు చేసిన సీబీఐ
- వారిలో ఇద్దరు మంత్రులు..
- కిందికోర్టులో బెయిలు.. హైకోర్టు స్టే
- నిరసనగా భగ్గుమన్న రాష్ట్రం
- సీబీఐ ఆఫీస్ వద్ద తీవ్ర విధ్వంసం
- ఆరు గంటల పాటు మమత ధర్నా
- తననూ అరెస్టు చేయాలని సవాల్
- చట్టం లేదు.. అంతా అరాచకత్వమే
- మండిపడిన గవర్నర్ ధన్‌కర్
కోల్‌కతా, న్యూఢిల్లీ : ఐదేళ్ల క్రితం సంచలనం సృష్టించిన ‘నారద’ టేపుల వ్యవహారంలో ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మంత్రివర్గంలోని ఇద్దరిని సీబీఐ సోమవారం అరెస్టు చేసింది. అధికార తృణమూల్ కాంగ్రె్‌సకు చెందిన మరో ఇద్దరు తాజా, మాజీ నేతల్ని కూడా అదుపులోకి తీసుకొంది. దీనికి నిరసనగా వేలాదిమంది టీఎంసీ కార్యకర్తలతో కలిసి మమత కోల్‌కతాలోని సీబీఐ కార్యాలయం వద్ద బైఠాయించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కాగా, మంత్రులు, పార్టీ నేతల అరెస్టులపై మమత తీవ్రస్థాయిలో స్పందించారు. ఉదయం 11 గంటలకు స్వయంగా సీబీఐ కార్యాలయం వద్ద బైఠాయించారు. ‘‘ఇక్కడినుంచి కదలను. కావాలంటే నన్నూ అరెస్టు చేసుకోండి’’ అని సీబీఐ అధికారులను సవాల్ చేశారు. తమ నేతలను విడుదల చేయాలంటూ దాదాపు ఆరుగంటల పాటు నిరసనల్లో పాల్గొన్నారు. మరోవైపు రాష్ట్రమంతా ఆందోళనలతో హోరెత్తిపోయింది. కరోనా, లాక్‌డౌన్‌ను సైతం ఉల్లంఘించి కోల్‌కతాలో వేలాదిమంది తృణమూల్ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చారు. సీబీఐ కార్యాలయం, గవర్నర్ నివాసం వద్ద ప్రదర్శనలు నిర్వహించారు. సీబీఐ కార్యాలయ సిబ్బందిపై కార్యకర్తలు రాళ్లవర్షం కురిపించారు.
ఈ పరిణామాలపై గవర్నర్ జగ్దీప్ ధన్‌కర్ తీవ్రంగా స్పందించారు. ‘‘రాష్ట్రంలో చట్టం లేదు. అంతా అరాచకత్వమే. పోలీసులు, అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. పరిస్థితి చెయ్యి దాటకముందే సీఎం కార్యాలయం అప్రమత్తం కావాలి’’ అని కోరారు. మమత కేబినెట్‌లోని కొందరు మంత్రులపై 2016లో ‘నారద’ అనే వార్తాసంస్థ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. తమకు కొన్ని ప్రయోజనాలు కల్పించాలంటూ సదరు మంత్రులకు వార్తాసంస్థ ప్రతినిధులు ముడుపులు ఇస్తూ చిత్రీకరించిన వీడియో టేపులు సంచలనం రేపాయి. ఈ వ్యవహారంలోనే సీబీఐ తాజాగా అరెస్టులకు పూనుకొంది. అరెస్టయిన నలుగురిలో ఫిర్హాద్ హకీమ్, సుభద్ర ముఖర్జీ మంత్రులుగా కొనసాగుతున్నారు. మదన్ మిత్రా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందగా, సొవన్ ఛటర్జీ తృణమూల్ మాజీ నేత. వీరిని వర్చువల్ పద్ధతిలో సీబీఐ కోర్టులో హాజరుపెట్టగా నలుగురికీ బెయిల్ లభించింది. దీనిపై సీబీఐ.. హైకోర్టును ఆశ్రయించగా, బెయిల్ ఆదేశాలపై స్టే విధించి బుధవారం వరకు కస్టడీకి ఆదేశించింది.
సువేందుపై చర్యలేవి? : ‘నారద’ జర్నలిస్టు ప్రశ్న
‘నారద’ టేపుల వ్యవహారంలో దొరికిపోయినమాజీ తృణమూల్ నేత, ప్రస్తుత బీజేపీ పక్ష నేత సువేందు అధికారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని స్టింగ్ ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన ఆ వార్తాసంస్థ వ్యవస్థాపకుడు మాథ్యూ శామ్యూల్ ప్రశ్నించారు. అయితే, అప్పట్లో ఎంపీగా ఉండటంతో.. సువేందును విచారించడానికి అనుమతించాలని 2019 ఏప్రిల్ 6నే స్పీకర్‌కు లేఖ రాశామని, నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని సీబీఐ తెలిపింది.
Courtesy Andhrajyothi