విద్యార్థిని మృతిపై ఉద్రిక్తత

0
329

 – దుఃఖంలో ఉన్న తండ్రిని తన్నిన పోలీస్‌
– ప్రతిఘటించిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య నేపథ్యంతో పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రి ఎదుట బుధవారం ఉద్రిక్తత ఏర్పడింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు మార్చురీ తాళాలు పగులగొట్టి మృతదేహాన్ని రోడ్డుపైకి తీసుకొస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. తమ కూతురికి న్యాయం జరగాలని పట్టుబట్టిన తండ్రిని కానిస్టేబుల్‌ బూటు కాలుతో తన్నాడు. ఈ ఘటన సంగారెడ్డి పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రి వద్ద జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. మంగళవారం రామచంద్రపురం మండలం వెలిమెలలోని నారాయణ జూనియర్‌ కళాశాలలో విద్యార్థిని సంధ్యారాణి బాత్‌రూమ్‌లో ఉరేసుకున్న విషయం విదితమే. వెంటనే ఆమెను కళాశాల యాజమాన్యం నలగండ్లలోని సిటిజెన్‌ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పటికే మృతిచెందడంతో పోస్టుమార్టం నిమిత్తం మతదేహాన్ని మంగళవారం రాత్రే పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహంతో ధర్నా చేసేందుకు బుధవారం ఉదయం మతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో పాటు ఎస్‌ఎఫ్‌ఐ, టీఎస్‌యూ విద్యార్థి సంఘాల నాయకులు మార్చురీ వద్దకు వెళ్లారు. మార్చూరీ తాళాలు పగులగొట్టి మృతదేహాన్ని రోడ్డుపైకి తీసుకొస్తుండగా స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. అయినా, వారిని ప్రతిఘటించి ప్రభుత్వాస్పత్రి ప్రహరీని దాటి రోడ్డు పైకి చేరుకునే ప్రయత్నం చేశారు.

విషయం తెలుసుకున్న డీఎస్పీ రాజేశ్వర్‌రావు, సీఐలు, ఎస్‌ఐలు, ఇతర సిబ్బంది వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు. మతదేహాన్ని తిరిగి మార్చురీకి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా, స్ట్రెచర్‌కు విద్యార్థిని తండ్రి చంద్రశేఖర్‌ అడ్డుగా పడుకున్నాడు. అతన్ని కానిస్టేబుల్‌ శ్రీధర్‌ బూటు కాలితో కడుపులో తన్నడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కూతుర్ని కోల్పోయి బాధలో ఉన్న తండ్రిని మానవత్వం లేకుండా తన్నడంపై బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మతురాలి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సందీప్‌, కార్యదర్శి రమేష్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి, ఇతర సంఘాల నాయకులపై కేసు నమోదు చేశారు. విద్యార్థిని కుటుంబ సభ్యులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని వారిని అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.

కానిస్టేబుల్‌ శ్రీధర్‌పై చర్యలు
విద్యార్థిని తండ్రిని బూటు కాలుతో తన్నిన కానిస్టేబుల్‌ శ్రీధర్‌ను సంగారెడ్డి జిల్లా ఏఆర్‌కు అటాచ్‌ చేస్తూ మెదక్‌ ఇన్‌చార్జి ఎస్పీ చందనా దీప్తి ఉత్తర్వులు జారీ చేశారు.

Courtesy Nava Telangana

Leave a Reply