బీమా కోరెగాం కేసు ఎన్‌ఐఏకు బదిలీ

0
267
  • కేంద్రం ఆకస్మిక నిర్ణయం.. కేసుల ఎత్తివేతకు మహా ప్రభుత్వం యత్నించడం వల్లే..!నిందితుల్లో విరసం నేత వరవరరావు
  • ఇది రాజ్యాంగ విరుద్ధం: మహా హోంమంత్రి

న్యూఢిల్లీరెండేళ్ల కిందటి నాటి బీమా కోరెగాం అల్లర్ల కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు బదలాయిస్తూ కేంద్రం ఆకస్మిక సంచలన నిర్ణయం తీసుకుంది. విరసం నేత వరవరరావు సహా తొమ్మిది మంది హక్కుల నేతలు, మరో పది మంది కార్యకర్తలు నిందితులుగా ఉన్న ఈ కేసును తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రధాన కారణం.. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుల ఎత్తివేత దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయడమే! ఈ కేసు తాజా స్థితిపై గురువారం పోలీసు అధికారులతో మహారాష్ట్ర ప్రభుత్వం సమీక్షించింది. కేసులపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని భావిస్తున్న సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆ హక్కుల నేతలందరినీ అక్రమంగా ఇరికించారని, విడుదల చేయాలని శరద్‌ పవార్‌ సహా ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ నేతలు కోరుతున్నారు. ఇందుకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కూడా సుముఖత చూపారు.

రాజకీయంగా సున్నితమైన ఈ కేసును తన అధీనంలోని దర్యాప్తు సంస్థకు అప్పగించడం ద్వారా రాష్ట్ర సర్కార్‌తో ఘర్షణకు కేంద్రం తెరతీసినట్లయింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, తమను సంప్రదించకుండా కేసు దర్యాప్తును కేంద్రం తీసేసుకుందని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ధ్వజమెత్తారు. ఎన్‌ఐఏ చట్టం ప్రకారం దేశంలో ఏ కేసునైనా ఎన్‌ఐఏకు కేంద్రం అప్పగించవచ్చు, ఇందుకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అక్కర్లేదు. కనీసం చెప్పక్కర్లేదు. ఈ అనూహ్య పరిణామంతో వరవరరావు సహా అర్బన్‌ నక్సల్స్‌గా ముద్రపడ్డ ఇతర హక్కుల నేతలు ఇప్పట్లో బయటపడడం అసాధ్యంగా మారొచ్చంటున్నారు. అయితే బీమా కోరెగాం అల్లర్ల కేసు మాత్రమే బదిలీ చేశారా? లేక ఎల్గార్‌ పరిషత్‌ కేసు కూడానా..? అన్నది స్పష్టం కావాల్సి ఉంది. కాగా, మహారాష్ట్రలోని పుణె సమీపంలో ఉన్న బీమా కోరెగాంలో 2017 డిసెంబరు 31 అర్ధ రాత్రి- 2018 జనవరి 1న అల్లర్లు, హింస చెలరేగాయి. 1818లో ఇదే రోజున బ్రాహ్మణ పేష్వా పాలకులపై బ్రిటిష్‌ సహకారంతో దళితులు దండెత్తి విజయం సాధించినదానికి గుర్తుగా ఏటా సంస్మరణ జరుగుతుంది. అందుకోసం వందల సంఖ్యలో దళితులు ఆనాడు గుమిగూడారు. ఆ సభ జరిగాక హింస చెలరేగింది. అంతకుముందు జరిగిన ఎల్గార్‌ పరిషత్‌ సమావేశంలో మాట్లాడిన వక్తలు రెచ్చగొట్టే రీతిన ప్రసంగాలు చేశారని సుధా భరద్వాజ్‌, వరవరరావు, రోనా విల్సన్‌, గౌతమ్‌ నవ్‌లఖా, అరుణ్‌ ఫెరీరా, వెర్మన్‌ గోంజాల్వె్‌సలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరందరికీ మావోయిస్టులతో సంబంధాలున్నాయని కేంద్రంతో పాటు ఫడణవీస్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాలు గతంలో ఆరోపించాయి.

Courtesy Andhrajyothi

Leave a Reply