మధ్యప్రదేశ్‌ రేషన్‌ స్కీమ్‌లో భారీ స్కామ్‌!

0
45
  • సీఎం చౌహాన్‌ శాఖలోనే అడ్డంగా అవినీతి.. వందల కోట్ల రూపాయల రేషన్‌ను బుక్కేశారు
  • తేల్చిన రాష్ట్ర ఆడిటర్‌ జనరల్‌.. ప్రభుత్వానికి 36 పేజీల నివేదిక.. 52 జిల్లాలకు.. 8 జిల్లాల్లో ఆడిట్‌
  • రాష్ట్రంలోని అంగన్‌వాడీల్లో కిశోర బాలికల సంఖ్య 9 వేలే.. రేషన్‌ పంపిణీ మాత్రం 36 లక్షల మందికి
  • చిన్నారులు, గర్భిణుల లెక్కల్లోనూ భారీ తేడాలు.. ఇప్పటికి రూ.కోట్లలో అక్రమాల గుర్తింపు
  • రేషన్‌ తరలించిన ట్రక్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్ల పరిశీలన.. అవన్నీ ఆటోలు, ద్విచక్ర వాహనాలుగా గుర్తింపు
  • మిగతా జిల్లాల్లోనూ భారీగా అవినీతి!.. కుంభకోణం విలువ రూ.వందల కోట్లలో..!

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో చిన్నారులు, గర్భిణుల కోసం ఉద్దేశించిన ఉచిత రేషన్‌ పథకం– టేక్‌ హోమ్‌ రేషన్‌(టీహెచ్‌ఆర్‌)లో భారీ అవినీతి చోటుచేసుకుంది. అక్రమార్కులు రూ.కోట్ల విలువైన రేషన్‌ను బుక్కేసినట్లు మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ఆడిటర్‌ జనరల్‌ నిగ్గుతేల్చారు. ఈ మేరకు ప్రభుత్వానికి 36 పేజీల నివేదికను అందజేశారు. 53 జిల్లాలకు గాను.. 8 జిల్లాల్లోని 49 అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించిన ఆడిట్‌లో రూ. కోట్ల మేర అవినీతి జరిగినట్లు నిర్ధారించారు. మిగతా జిల్లాల్లోనూ అక్రమాలు జరిగి ఉంటాయని, వాటిల్లోనూ ఆడిట్‌ నిర్వహిస్తే.. ఈ కుంభకోణం విలువ రూ. వందల కోట్లలో ఉంటుందని తెలుస్తోంది.

ఏమిటీ ఉచిత రేషన్‌ పథకం?
పేద, బడుగు వర్గాల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు 2018లో కేంద్రం ఆయా వర్గాలకు పోషక విలువలు ఉండే రేషన్‌ను ఉచితంగా అందజేయాలని ఆదేశించింది. దీంతో.. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర మహిళాశిశు సంక్షేమ శాఖ(డబ్ల్యూసీడీ) ద్వారా టీహెచ్‌ఆర్‌ పేరుతో ఉచిత రేషన్‌ పథకాన్ని ప్రారంభించింది. ఈ శాఖ మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పరిధిలోనే ఉంది. నిజానికి ఈ స్కీమ్‌ 2018లో ప్రారంభమైనా.. డబ్ల్యూసీడీ అధికారులు 2021 ఫిబ్రవరి వరకు కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయారు. అయినా.. చాలా జిల్లాల్లో ఈ పథకాన్ని 2018 నుంచే అమలు చేస్తున్నట్లు నిధులు బొక్కేశారు.

9 వేల మందికి.. 36.08 లక్షలుగా లెక్క!
నిజానికి మధ్యప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో 9 వేల మంది కిశోర బాలికలు(11-14 ఏళ్ల వయసువారు) బడి మానేశారని 2018లో విద్యాశాఖ లెక్కతేల్చింది. అయితే.. టీహెచ్‌ఆర్‌ పథకం అమలుకు డబ్ల్యూసీడీ అధికారులు మాత్రం ఎలాంటి సర్వేలు చేపట్టకుండా.. రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీల్లో 36.08 లక్షల మంది బాలికలు ఈ కేటగిరీలో ఉన్నట్లు రికార్డులకెక్కించారు. ఆడిటర్‌ జనరల్‌ తనిఖీలు చేసిన 8 జిల్లాల్లోని 49 అంగన్‌వాడీల్లో ఈ కోవలో 63,748 మంది బాలికలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. వారిలో 29,104 మందికి క్రమం తప్పకుండా పోషక విలువలతో కూడిన రేషన్‌ను ఉచితంగా అందజేసినట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. అయితే.. ఈ 49 అంగన్‌వాడీ కేంద్రాల్లో వందల సంఖ్యలోనే కిశోర బాలికలు ఉన్నట్లు ఆడిటర్‌ జనరల్‌ నిగ్గుతేల్చారు. 2018-21 మధ్యకాలంలో తప్పుడు లెక్కలతో రూ. 110.83 కోట్లు విలువ చేసే రేషన్‌ను అక్రమార్కులు బొక్కేశారని నిర్ధారించారు.

మిల్లుల్లోనూ అక్రమాలే..!
ఇక టీహెచ్‌ఆర్‌ పథకంలో మిల్లర్ల స్థాయిలోనే భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆడిటర్‌ జనరల్‌ తనిఖీలు నిర్ధారించాయి. మధ్యప్రదేశ్‌లోని బడీ, ధార్‌, మండ్ల, రేవ, సాగర్‌, శివ్‌పురిలోని మిల్లర్ల నుంచి రేషన్‌ను సేకరించినట్లు డబ్ల్యూసీడీ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఆరు మిల్లులు 821 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ను సరఫరా చేసినట్లుగా రికార్డులు చెబుతుండగా.. అంతమొత్తంలో రేషన్‌ ఉత్పత్తి అయితే.. ఆయా మిల్లుల కరెంటు బిల్లులు మాత్రం ఆ స్థాయిలో లేవని ఆడిటర్‌ జనరల్‌ నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇలా మిల్లర్లతో తప్పుడు లెక్కలు వేయించి, రూ. 58 కోట్లు బొక్కేశారని.. ఈ ఆరు మిల్లుల వాటా రూ. 4.95 కోట్లని నిర్ధారించింది.

మోటార్‌ సైకిళ్లపై వందల టన్నులు తరలించారా?
ఆడిటర్‌ జనరల్‌ తనిఖీలు నిర్వహించిన 8 జిల్లాల్లో.. 2021కి గాను ఆరుగురు మిల్లర్ల ద్వారా రూ. 6.94 కోట్లు విలువ చేసే 1,125.64 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ను తరలించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆ రికార్డుల్లో పేర్కొన్న ట్రక్కుల వాహన రిజిస్ట్రేషన్‌ నంబర్‌, రవాణాశాఖ డేటా ఆధారంగా పరిశీలించిన ఆడిటర్‌ జనరల్‌ మరో అవినీతిని వెలుగులోకి తీసుకువచ్చారు. ఆయా వాహన రిజిస్ట్రేషన్‌ నంబర్లనీ మోటార్‌ సైకిళ్లు, ఆటో రిక్షాలు, క్యాబ్‌లు, వాటర్‌ ట్యాంకర్లకు చెందినవని.. దీన్ని బట్టి.. రికార్డుల్లో పేర్కొన్న సరుకంతా పక్కదారి పట్టిందని భావిస్తున్నారు.

టీఆర్‌హెచ్‌ పథకం లబ్ధిదారుల వివరాలు
6 నెలల నుంచి మూడేళ్ల వయసుగల
చిన్నారులు:  34.69 లక్షలు
గర్భిణులు:  14.25 లక్షలు
బాలింతలు: 0.64 లక్షలు
కిశోర బాలికలు:  12 లక్షలు

Leave a Reply