- ఉద్యోగ ఖాళీల లెక్కింపులో శాఖల తీరిది
- లక్షల్లో ఖాళీలున్నా.. వేలల్లో చూపుతున్నారు
- 50 వేల పోస్టుల భర్తీపైనే ప్రధాన దృష్టి
- ఖాళీల గుర్తింపుపై నిరుద్యోగుల్లో అసహనం
- విభజన చట్టం ప్రకారమే 1.2 లక్షల ఖాళీలు
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు లక్షల్లో ఉంటే.. శాఖలు మాత్రం వేలల్లోనే చూపుతున్నాయని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. కొలువుల ఖాళీల గుర్తింపులో ప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్షకుపైగా ఖాళీలుంటే.. 50 వేలే చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశించిన 50 వేల ఉద్యోగాల భర్తీపైనే ఉన్నతాధికారులు దృష్టి సారించారని, మిగతా ఖాళీలను పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. శాఖలవారీగా ఖాళీలన్నింటినీ ప్రకటించి, కొత్త నోటిఫికేషన్లను జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏపీ పునర్విభజన చట్టం-2014 ప్రకారం తెలంగాణకు 5.20 లక్షల ప్రభుత్వ ఉద్యోగుల కేడర్ స్ట్రెంత్ మంజూరైంది. కానీ, ప్రస్తుతం 2.95 లక్షల ఉద్యోగులే ఉన్నారు. మరో లక్ష మంది వరకు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులుంటారు. పునర్విభజన చట్టం ప్రకారమే ఇంకా 1.20 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాస్తవానికి ఇవి ఇంకా ఎక్కువే ఉంటాయని నిరుద్యోగులు అంటున్నారు. 50 వేల పోస్టులు భర్తీ చేయాలని కేసీఆర్ ఆదేశించగానే అరకొర ఖాళీలను చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
పోలీస్ కొలువులే ఎక్కువ
సీఎం కేసీఆర్ 50 వేల పోస్టులను భర్తీ చేయాలని ఆదేశాలు జారీచేసినప్పటి నుంచి ఖాళీల గుర్తింపుపై సీఎస్ సోమేశ్ కుమార్ పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. శాఖలవారీగా ఖాళీల వివరాలు సమర్పించాలని ఆదేశా లు జారీ చేశారు. ఇప్పటికే దాదాపు 50 వేల ఖాళీల వివరాలను గుర్తించారు. పోలీస్ శాఖలో అధికంగా 19,500 కొలువులున్నాయి.
కాగా, పాఠశాల విద్యాశాఖలో దాదాపు 25 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలుంటే.. దాదాపు 10 వేల వరకే ఉన్నాయని ప్రభుత్వానికి నివేదించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 5,395 అధ్యాపక పోస్టులు మంజూరవగా, కేవలం 1,340 మందే పనిచేస్తున్నారు. మిగతా 4,055 పోస్టుల్లో కాంట్రాక్ట్, గెస్ట్ లెక్చరర్లు విధులు నిర్వహిస్తున్నారు. వాటిని ఖాళీలుగా ఇంటర్‌విద్యాశాఖ ప్రభుత్వానికి చూపించలేదు. పలు విశ్వవిద్యాలయాల్లో 1061 బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
రెవెన్యూ, నీటిపారుదలలో 4,379
రెవెన్యూశాఖలో 2,659 ఖాళీలున్నాయి. వాటిలో డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ తహసీల్దార్లు, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో, టైపిస్ట్, డ్రైవర్, రికార్డు అసిస్టెంట్, వీఆర్‌ఏ, తదితర పోస్టులున్నాయి. నీటిపారుదల శాఖలో 1,720 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదించారు. అందులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డ్రైవర్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే, ఎక్సైజ్‌శాఖలో 159, వాణిజ్యపన్నుల శాఖలో 365 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాగా, అన్ని శాఖల్లో భారీగా ఖాళీలున్నా అధికారులు వాటిని చూపడం లేదని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు.
జోనల్ చిక్కుల్లేనివే భర్తీ!
కొత్త జోనల్ విధానం ప్రకారం చిక్కుల్లేని పోస్టులనే భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 2018 ఆగస్టులో కొత్త జోనల్ విధానం అమల్లోకి వచ్చింది. రెండు మల్టీజోన్లు, 7 జోన్లు, 31 జిల్లాలతో కూడిన జోనల్ విధానం ప్రకారం ప్రస్తు తం నియామకాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు పోస్టుల పునర్విభజన జరగలేదు. ఫలితంగా గ్రూప్-1, 2, 3 పోస్టుల నోటిఫికేషన్ల జారీలో జాప్యం జరుగుతోంది.
కొత్త పోస్టుల భర్తీలో పోస్టుల పునర్విభజన, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యే ప్రమాదముందని భా విస్తున్న ప్రభుత్వం.. చిక్కుల్లేని పోస్టులనే భర్తీ చేయాలని చూ స్తోంది. ప్రభుత్వతీరుపై నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల కాలేదని, జోనల్ విధానంపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పట్లో నోటిఫికేషన్లు కష్టమే?
ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. నోటిఫికేషన్లు త్వరగా జారీ కావడం కష్టమేనని, ఈ ప్రక్రియ ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని పేర్కొంటున్నారు. ‘‘కొత్త నోటిఫికేషన్లు విడుదల కావాలంటే జోనల్ విధానంపై మొదట స్పష్టత రావాల్సి ఉంది.
దాని తర్వాత కొత్త జోన్ల వారీగా పోస్టులను పునర్విభజన చేయాలి. ఇప్పటికిప్పుడు అది అసాధ్యం. జోనల్ విధాన సవరణ చట్టం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండడమే కారణం. అంతేకాదు, త్వరలోనే నాగార్జున్‌సాగర్ ఉపఎన్నికతో పాటు నల్లగొండ- వరంగల్- ఖమ్మం, హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కోడ్ అమల్లో ఉంటే నోటిఫికేషన్లు విడుదల చేయడం కష్టం’’ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వైద్య ఆరోగ్య శాఖలో 10,718
వైద్యఆరోగ్యశాఖలో 10,718 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ విభాగంలో 3,635, వైద్యవిధాన పరిషత్‌లో 4,547, నిమ్స్‌లో 1,472 పోస్టులున్నాయి. మొత్తం 13,496 ఖాళీలుంటే గతంలో 2,778 పోస్టులను టీఎ్‌సపీఎస్సీ భర్తీ చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి నివేదించింది.
శ్వేతపత్రం విడుదల చేయాలి
మాకున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో మొత్తం 2.70 లక్షల వరకు ఉద్యోగ ఖాళీలున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే సీఎం కేసీఆర్ 50 వేల పోస్టు భర్తీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం ఎన్ని ఖాళీలున్నాయో శ్వేతపత్రం విడుదల చేసి.. ఆ తర్వాత నోటిఫికేషన్లు ఇవ్వాలి. కొత్త జోనల్ విధానం అమల్లోకి వచ్చి రెండేళ్లు గడిచినా.. ఇప్పటికీ దానిపై స్పష్టత ఇవ్వలేదు.
-మానవతారాయ్, విద్యార్థి-నిరుద్యోగ జేఏసీ చైర్మన్
63 శాఖల్లో 1,90,000 ఖాళీలు
రాష్ట్రవ్యాప్తంగా 63 ప్రభుత్వ శాఖల్లో 1.90 లక్షల ఖాళీలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా అనేక ప్రభుత్వ శాఖల్లో అసలు నియామకాలే చేపట్టలేదు. ఒక్క పాఠశాల విద్యాశాఖలోనే గత ఏడాది 16వేల విద్యావలంటీర్ల నియామకానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందంటే అవన్నీ ఖాళీలన్నట్టే కదా. 17వేల స్కూల్ అసిస్టెంట్లు, 16వేల సెకండరీ గ్రేడ్ టీచర్లు, 3800 గెజిటెడ్ హెడ్ మాస్టర్లు, కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లోని డీఈవో, ఎంఈవో కార్యాలయాల్లో సిబ్బందిని కలిపితే ఒక్క పాఠశాల విద్యాశాఖలోనే 42వేలకు పైగా ఖాళీలుంటాయి.
– జి.హర్షవర్ధన్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి
వెటర్నరీ డాక్టర్ పోస్టుల్ని భర్తీ చేయాలి: సంఘం
పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల్ని భర్తీ చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌కు వెటర్నరీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు కాటం శ్రీధర్ సీఎస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
Courtesy Andhrajyothi