పాత మరణాలు.. కొత్త లెక్కలు

0
206
  • మహారాష్ట్రలో 24 రోజుల్లో 11,617
  • పాత మరణాలు కొత్తగా జాబితాలోకి!
  • బిహార్‌లో 2 నెలల్లో 4 వేల పాత మరణాలు 
  • ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం కొవిడ్‌
  • మరణాల నిర్ధారణకు 6 నుంచి 8 రోజులు
  • పలు చోట్ల సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యలూ కారణమే

ముంబై, న్యూఢిల్లీ : కొవిడ్‌ మరణాలు లెక్కలు మారుతున్నాయి. పాత మరణాలు కొత్తగా నమోదవుతున్నాయి. బిహార్‌లో రెండు నెలల్లో దాదాపు 4 వేల ‘సవరణ’ మరణాలు రికార్డులకెక్కితే.. మహారాష్ట్రలో కేవలం 24 రోజుల్లోనే (మే 17 నుంచి జూన్‌ 10 దాకా) 11,617 పాత మరణాలు కొత్తగా అధికారిక గణాంకాల్లోకి చేరాయి. సవరణ మరణాలు అంటే.. వాస్తవంగా కొవిడ్‌తో మరణించినప్పటికీ, రకరకాల కారణాల వల్ల కొవిడ్‌ మరణాల గణాంకాల లెక్కల్లోకి గతంలో ఎక్కకుండా ఇప్పుడు తాజాగా నమోదైనవి. నిజానికి ఇది కొత్త ప్రక్రియేమీ కాదు.

గత ఏడాది కూడా మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు.. ఇలా చాలా రాష్ట్రాలు సవరించిన కొవిడ్‌ మరణాల లెక్కలను పలుమార్లు వెలువరించాయి. అయితే, అప్పట్లో ఇంత భారీగా కేసులు, మరణాలు నమోదు కాలేదు కాబట్టి సవరించిన అంచనాలూ అంత భారీగా లేవు. అందుకే వాటిపై దినపత్రికల్లో, ప్రసారమాధ్యమాల్లో ఇంతగా కథనాలూ రాలేదు.

కానీ, ఈసారి మహారాష్ట్ర, ఢిల్లీ, బిహార్‌ తదితర రాష్ట్రాల్లో రోజువారీ కేసులే భారీగా ఉండడంతో మృతుల సంఖ్య కూడా అంతే భారీగా పెరిగింది. ఇప్పుడా పాత లెక్కలన్నీ బయటపడుతున్నాయి. మహారాష్ట్రలో మే 1 నుంచి ఇలా పాత మరణాలను కొత్తగా జాబితాలో  చేరుస్తూ వస్తున్నారు. గురువారం నాడు అత్యధికంగా 1522 పాత మరణాలను జోడించడం.. అటు బిహార్‌ కూడా బుధవారం ఒక్కరోజే 3,971 మరణాలతో భారీగా సవరించిన అంచనాలను వెలువరించడంతో దేశం దృష్టి అంతా ఈ అంశంపైకి మళ్లింది.

పాత మరణాల లెక్కతో కలిపి మహారాష్ట్రలో ఇప్పటిదాకా కొవిడ్‌ కారణంగా మరణించినవారి సంఖ్య లక్ష దాటింది. ఆందోళన కలిగించే అంశమేంటంటే.. గడిచిన మూడువారాల్లో మహారాష్ట్రలో నమోదైన మరణాల సంఖ్య 10,645 కాగా, కొత్తగా రికార్డులకెక్కిన పాతమరణాల సంఖ్య 11,617. వీటిలోనూ జూన్‌ 1 నుంచి 10 దాకా నమోదైనవే 8,404 మరణాలు. దాదాపు 5 వేల మరణాలు కిందటివారంవే. ఒక వారం ఆలస్యంగా ఇప్పుడు జాబితాలోకి ఎక్కాయి.

ఎందుకిలా?
పాత మరణాలు కొత్తగా జాబితాలోకి ఎక్కడానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి.. ఏది కొవిడ్‌ మరణం? ఏది కాదు? అనే అంశంపై భారత వైద్య పరిశోధన మండలి జారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగా నిర్ణయించాల్సి ఉంటుంది. అందుకు కొంత సమయం పడుతోంది. ‘‘కొవిడ్‌-19 వచ్చిన వ్యక్తి చనిపోతే కేవలం కరోనా వల్లే కాకపోవచ్చు.దీర్ఘకాల మూత్రపిండ వ్యాధులు, హృద్రోగాలతో బాధపడేవారు, అవయవమార్పిడి చేయించుకున్న కొద్దిరోజుల్లోనే కొవిడ్‌ బారిన పడి కన్ను మూస్తే మేం వారి వైద్యనివేదికలన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించాల్సి ఉంటుంది. కొన్ని శాస్త్రీయ పరామితుల ఆధారంగా.. వారు కేవలం కొవిడ్‌ వల్లే మరణించారా, లేక ఆ వ్యాధులు/అవయవమార్పిడి వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోవడం కారణమా? చనిపోయే సమయానికి వారికి కొవిడ్‌ నెగెటివ్‌ వచ్చిందా? తదితర అంశాలను విశ్లేషించి కొవిడ్‌ మరణమా కాదా నిర్ణయించాలి. ఇందుకు ఆరు నుంచి ఎనిమిది రోజులు పడుతుంది’’ అని మహారాష్ట్ర ‘డెత్‌ ఆడిట్‌ కమిటీ’ చైర్మన్‌ డాక్టర్‌ అవినాశ్‌ సూపే వివరించారు.

కొవిడ్‌తో ఆస్పత్రిలో చేరిన ఇలాంటి రోగులు మరణిస్తే.. ప్రాథమిక నివేదికలో కొవిడ్‌ మరణంగానే ఆస్పత్రి సిబ్బంది పేర్కొంటారు. కానీ, ఆడిట్‌ బృందం ఆమోద ముద్ర వేశాకే అధికారికంగా కొవిడ్‌ మరణంగా గుర్తిస్తారు. అది జరగడానికే ఆలస్యమవుతోంది. అలాగే కొవిడ్‌ వల్ల ఎవరైనా మరణిస్తే ఆ విషయాన్ని 48 గంటల్లోగా నమోదు చేయాలని ఉన్నా.. తగినన్ని మానవ వనరులు లేక, సాంకేతిక సమస్యల వల్ల నమోదు ఆలస్యం అవుతోంది.

ఉదాహరణకు.. గురువారంనాడు (జూన్‌ 10న) మహారాష్ట్ర 661 కొవిడ్‌ మరణాలను ప్రకటించింది. ఆ 661 మందిలో 208 మంది రెండు రోజుల క్రితం మరణించినవారు కాగా, 87 మంది గత వారం మరణించినవారు. సాంకేతిక సమస్యల వల్ల ఆ మరణాలు ఆలస్యంగా జాబితాలోకి చేరుతున్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే కాదు దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే ప్రక్రియ అమలవుతోంది. కాబట్టి.. మున్ముందు ఈ సవరణ మరణాల లెక్కలు మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా.

ఉపసంహారం: కరోనా కేసులు, మరణాల లెక్కలను వీలైనంత కచ్చితంగా ప్రకటిస్తున్న రాష్ట్రాల్లోనే ఈ సవరణ మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. కారణాలేవైనాగానీ, అసలు కేసుల్నే తక్కువగా చూపిస్తున్న రాష్ట్రాల్లో సవరణ మరణాల లెక్కలు బయటకి వస్తాయో రావో కూడా సందేహమే!!

Courtesy Andhrajyothi

Leave a Reply