గుజరాత్లో దోషులకు స్వేచ్ఛ

0
67

బిల్కిస్‌ బానో లైంగికదాడి కేసులో 11మంది దోషులు విడుదల
ఆగస్టు 15 పేరుతో..జీవిత ఖైదీలకు క్షమాభిక్ష
గుజరాత్‌ ప్రభుత్వ నిర్వాకం
విషయం తెలుసుకొని బాధిత కుటుంబం షాక్‌..

న్యూఢిల్లీ : ‘బిల్కిస్‌ బానో సామూహిక లైంగిక దాడి’ ఘటన..మామూలు కేసు కాదు. కొంతమంది దుండగుల గుంపు ఒక కుటుంబంపై దాడి చేసి ఏడుగురిని హత్యమార్చి, ఒక మహిళపై అత్యంత పాశవికంగా సామూహిక లైంగికదాడికి తెగబడిన ఘటన ఇది. దోషులకు…చచ్చేంతవరకూ కఠిన జైలు శిక్ష పడాలని దేశమంతా కోరుకుంది. న్యాయస్థానం కఠిన జీవిత ఖైదు విధించింది. కానీ అమిత్‌ షా-ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ…11మంది దోషులకు స్వేచ్ఛను ప్రసాదించింది. గుజరాత్‌లో అత్యంత సంచలనం రేపిన ‘బిల్కిస్‌ బానో సామూహిక లైంగిక దాడి’ ఘటనలో బాధితులకు మోడీ సర్కార్‌ చేసిన న్యాయమిది! ఆగస్టు 15 సందర్భంగా..క్షమాభిక్ష ప్రసాదించి గోద్రా సబ్‌ జైలు నుంచి బయటకు తీసుకొచ్చి దోషులకు అండగా నిలిచింది. ”14ఏండ్ల జైలు శిక్ష పూర్తిచేసుకోవటం, వారి దరఖాస్తు పరిశీలించాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారి వయస్సు, నేర స్వభావం, జైల్లో వారి ప్రవర్తన పరిగణలోకి తీసుకున్నా”మని గుజరాత్‌ అడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీ (హోం) రాజ్‌కుమార్‌ మీడియాకు తెలిపారు. తాజా పరిణామంతో బాధిత కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. బాధిత కుటుంబం బిల్కిస్‌ బానో, ఆమె భర్త రసూల్‌ ఈ విషయమై మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదంటే..వారెంతగా ఆవేదన చెందుతున్నారో అర్థం చేసుకోవచ్చు. గుజరాత్‌ ప్రభుత్వం రిమిషన్‌ పాలసీ (క్షమాభిక్ష) ప్రకారం 11మంది జీవిత ఖైదీలు విడుదల చేసేందుకు అనుమతివ్వడంతో వారు గోద్రా సబ్‌ జైలు నుంచి విడుదలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం దేనిని పరిగణలోకి తీసుకొని వారిని విడుదల చేసిందనేది తమకు తెలియదని రసూల్‌ చెబుతున్నాడు. ఆ ఘటనలో తన కుమార్తెతో సహా చనిపోయిన వారి కోసం ప్రార్థనలు చేయడం తప్ప తాను ఇంకేమీ చేయలేనని ఆవేదన వ్యక్తం చేశాడు. మార్చి 3, 2002న గోద్రా అనంతరం అల్లర్ల సమయంలో దాహుద్‌ జిల్లాలోని లిమ్‌ఖేడా తాలూకాలోని రంధిక్‌పూర్‌ గ్రామంలో బిల్కిస్‌ బానో కుటుంబంపై ఒక గుంపు దాడికి తెగబడింది.

ఆ సమయంలో ఐదు నెలల గర్భిణి అయిన బిల్కిస్‌పై సామూహిక లైంగికదాడికి పాల్పడటమేగాక, ఆ కుటుంబంలోని ఏడుగురిని పాశవికంగా హత్య చేసిందా దుండగుల గుంపు. ఈ కేసులో ముంబయిలోని సీబీఐ కోర్టు జనవరి 21, 2008న తీర్పు వెలువరిస్తూ, నిందితులకు జీవిత ఖైదు విధించింది. నిందితుల్లో ఒకరు విచారణ సమయంలో మరణించారు. ఆ తర్వాత బాంబే హైకోర్టు 2017న సీబీఐ కోర్టు తీర్పును సమర్ధించింది. అలాగే ఈ కేసుకి సంబంధించి ఆధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేసిన ఐదుగురు పోలీసులు, ఇద్దరు డాక్టర్లను కూడా బాంబే హైకోర్టు శిక్షించింది. అంతేకాదు 2019లో సుప్రీంకోర్టు బిల్కిస్‌ కుటుంబానికి దాదాపు రూ.50 లక్షల పరిహారం, ఉద్యోగం, వసతి కల్పించాలని గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Leave a Reply