ఒక్క డాలర్‌ కూడా చెల్లించని ప్రపంచ కుబేరులు!

0
19

 ప్రోపబ్లికా నివేదికతో వెలుగుచూసిన వాస్తవాలు

వాషింగ్టన్‌ : ప్రపంచంలోనే అత్యంత కుబేరులు చెల్లిస్తున్న పన్నులకు, వారి సంపదకు ఏమాత్రం పొంతన లేదని ప్రోపబ్లికా మీడియా సంస్థ నివేదిక వెల్లడించింది. గత 15 ఏళ్ల ‘ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఐఆర్‌ఎస్‌)’ డేటా రికార్డులను పరిశీలించి కుబేరుల ఆదాయపు పన్ను వివరాలను ప్రోపబ్లికా వెలుగులోకి తెచ్చింది. ఈ వివరాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి. 2007, 2011లో అమెజాన్‌ సిఇఒ జెఫ్‌ బెజోస్‌ ఒక్క డాలర్‌ కూడా ఆదాయపు పన్ను కింద చెల్లించలేదు. నేటికీ ఆయన ప్రపంచ కుబేరుడిగా కొనసాగుతున్నారు. ఇక టెస్లా వ్యవస్థాపకుడు, ప్రస్తుతం ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడిగా ఉన్న ఎలన్‌ మస్క్‌ 2018లో ఒక్క డాలర్‌ కూడా ఆదాయపు పన్ను చెల్లించలేదు. మైకేల్‌ బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ ఇన్వెస్టర్‌ కార్ల్‌ ఇకాన్‌, జార్జ్‌ సోరోస్‌ సైతం పలుమార్లు ఒక్క డాలర్‌ ఆదాయపు పన్ను కూడా చెల్లించలేదు. వారెట్‌ బఫెట్‌, బిల్‌గేట్స్‌, రూపర్ట్‌ ముర్డోచ్‌, మార్క్‌ జుకర్‌బర్గ్‌ వంటి ప్రముఖులకు సంబంధించి విస్తుగొలిపే ఆర్థిక విషయాలు ఐఆర్‌ఎస్‌ డేటా ద్వారా బయటకు వచ్చాయని ప్రోపబ్లికా పేర్కొంది.

దీంతో అమెరికాలో పన్ను వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ తాము చెల్లించాల్సిన పన్నును నిజాయితీగా చెల్లిస్తారన్న అభిప్రాయం నేతి బీరలో నెయ్యి చందంగా ఉందని తేలింది. ఈ సమాచారాన్ని ఇంకా ఎవరూ అధికారికంగా ధ్రువీకరించకపోవడం గమనార్హం. అమెరికాలో సగటున ఒక్కో వ్యక్తి ఏడాదికి 70 వేల డాలర్లు ఆర్జిస్తున్నాడని ప్రోపబ్లికా తెలిపింది. దీంట్లో 14 శాతం పన్ను కింద చెల్లిస్తున్నారని పేర్కొంది. ఇక 6,28,300 డాలర్లకు పైగా ఆర్జించే దంపతులు గరిష్ఠంగా 37 శాతం ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని తెలిపింది. కుబేరులు మాత్రం ఒక్క డాలరు కూడా చెల్లించడం లేదు. వీరు పన్ను చెల్లించకుండా ఉండేందుకు ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారు? చట్టంలో వారికి సహకరించే అంశాలేమిటి? అనే అంశాలను తరువాతి కథనాల్లో వెల్లడిస్తామని ప్రోపబ్లికా తెలిపింది. కాగా, ప్రముఖుల వ్యక్తిగత సమాచారం బయటకు రావడం నిబంధనలకు విరుద్ధమని, సమాచారాన్ని బయకు లీక్‌ చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తుండటం గమనార్హం.

Courtesy Prajashakti

Leave a Reply