చర్చల్లేకుండానే చట్టాలు!

0
58

అసెంబ్లీల్లో బిల్లులపై లోపిస్తున్న నిశిత పరిశీలన

దిల్లీ: ప్రజా ప్రయోజనకర చట్టాలు చేయడం శాసన వ్యవస్థ ప్రాథమిక బాధ్యత. ఆయా బిల్లులను క్షుణ్నంగా పరిశీలించి.. వాటిలోని అంశాలపై కూలంకషంగా చర్చించి.. అవసరమైతే నిపుణులను సంప్రదించి.. ఆ తర్వాతే వాటికి ఆమోద ముద్ర వేయాలి. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది! చర్చలు, పరిశీలనలేవీ లేకుండానే అధికార పార్టీలు ఎక్కువ బిల్లులను ఆమోదింపజేసుకుంటున్నాయి. గత ఏడాది దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీల్లో కలిపి 500కు పైగా బిల్లులు ఆమోదం పొందగా వాటిలో 44 శాతం.. అసెంబ్లీల్లో ప్రవేశపెట్టిన ఒక్కరోజు లోపే పాస్‌ అయ్యాయి. గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌, పంజాబ్‌, బిహార్‌ సహా 8 రాష్ట్రాల్లోనైతే.. అన్ని బిల్లులకూ వాటిని ప్రవేశపెట్టిన రోజే ఆమోద ముద్ర పడింది. ‘రాష్ట్ర చట్టాల వార్షిక సమీక్ష-2021’ పేరుతో ‘పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.

అత్యధికం కర్ణాటక.. అత్యల్పం దిల్లీ
2021లో కర్ణాటకలో అత్యధికంగా 48 బిల్లులు ఆమోదం పొందాయి. 2020లోనూ ఈ కోటాలో కన్నడిగులదే ప్రథమ స్థానం. గత ఏడాది ఆ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 55 బిల్లులు పాస్‌ అయ్యాయి. 2021లో దిల్లీ అతితక్కువగా రెండు బిల్లులను ఆమోదించింది. ఈ జాబితాలో పుదుచ్చేరి (3), మిజోరం (5) దేశ రాజధాని కంటే కాస్త ఎగువన ఉన్నాయి.

కేరళ కాస్త మెరుగు
ఐదు రాష్ట్రాలు మాత్రమే 50% పైగా బిల్లులను ఆమోదించడానికి 5 రోజుల కంటే ఎక్కువ సమయం తీసుకున్నాయి. ఈ జాబితాలో కర్ణాటక, కేరళ, మేఘాలయ, ఒడిశా, రాజస్థాన్‌ ఉన్నాయి. కేరళలో 94% బిల్లులు.. వాటిని సభలో ప్రవేశపెట్టిన 5 రోజుల తర్వాతే ఆమోదం పొందాయి.

కమిటీల ఏర్పాటు తక్కువే
బిల్లుల్లోని నిబంధనలను నిశితంగా పరిశీలించేందుకు కమిటీలు/స్థాయీసంఘాలు దోహదపడతాయి. ఆయా రంగాల నిపుణులనూ అవి సంప్రదిస్తాయి. కానీ రాష్ట్ర స్థాయుల్లో బిల్లులు కమిటీల చేతికి వెళ్తున్న సందర్భాలు తక్కువే. 2021లో 40% బిల్లులు మాత్రమే వాటి పరిశీలనకు వెళ్లాయి. చర్చలు, పరిశీలన లేకుండానే తయారవుతుండటంతో.. పలు చట్టాల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఆర్డినెన్సుల దారిలో..
గత ఏడాది దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు అత్యవసర ఆదేశాలను జారీ చేశాయి. ఈ జాబితాలో ప్రథమ స్థానం కేరళది. అక్కడి సర్కారు 144 ఆర్డినెన్సులను జారీ చేసింది. తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్‌ (20), మహారాష్ట్ర (15) ఉన్నాయి. ఏపీలో అన్నీ, కేరళలో 33 అత్యవసర ఆదేశాలు చట్టరూపం దాల్చాయి.

21
2021లో దేశవ్యాప్తంగా అసెంబ్లీల సగటు పనిదినాలు

44%
గత ఏడాది అసెంబ్లీల్లో ప్రవేశపెట్టిన ఒక్కరోజు లోపే ఆమోదం పొందిన బిల్లులు

16
పంజాబ్‌లో గత అసెంబ్లీ తమ చివరి సమావేశం రోజున ప్రవేశపెట్టి ఆమోద ముద్ర వేసిన బిల్లుల సంఖ్య

Leave a Reply