డబ్బు పుట్టుకా.. డబ్బు రద్దూ!

0
169

రంగనాయకమ్మ

‘మానవ సమాజం’ అంటే, మొట్ట మొదట తెలుసు కోవలిసినవి, రెండు విషయాలు. అవి, ‘శ్రమా, డబ్బూ’.

మానవ సంబంధాలు – అనేవి, శ్రమల సంబంధాలే. వాటి మారు రూపమే, ‘డబ్బు సంబంధాలు’.
సమాజంలో, ‘డబ్బు’ అనేది, ప్రారంభం నుంచీ ఉన్నది కాదు! ఈ విషయం ఇంత ప్రత్యేకంగా చెప్పుకోవాలా? అవును, చెప్పుకోవాలి.

మానవ సమాజం ప్రారంభమై ఎంతో కాలం గడిచిన తర్వాతే, సమాజంలో తయారైన వస్తువుల్లో ఏదో ఒకటి, ‘డబ్బు’గా చలామణీ అయ్యే వస్తువుగా అవడమూ, కొంత కాలం తర్వాత వేరొక వస్తువు ‘డబ్బు’ కావడమూ, వంటి మార్పులు జరిగి జరిగి, ఒక కాలం నుంచీ బంగారమే ప్రపంచంలో ప్రతీ చోటా ‘డబ్బు వస్తువు’గా స్థిర పడి పోయి ఉంది, ఈ నాటికీ.

‘డబ్బు’ అనేది, సమాజంలో వున్న ఒక వస్తువు మాత్రమే. బంగారమే ‘డబ్బు’గా స్థిర పడడానికి కారణం, దాని లక్షణాలే. అతి చిన్న చిన్న బంగారం ముక్కలకు, ఇతర వస్తువుల్లో దేనికీ లేనంతంత ఎక్కువ విలువలు ఏర్పడడమే కారణం. ఆ కారణానికి కారణం, బంగారాన్ని చేయడానికి అవసరం అయ్యే శ్రమ కాలం, అన్ని వస్తువుల తయారీల కన్నా అత్యధికం కావడమే.

కేవలం వస్తువుగా చూస్తే, ‘బొగ్గు’ అనేది, ఒక వస్తువు అయినట్టే, బంగారం కూడా ఒక సాదా వస్తువే.
డబ్బు వస్తువు, సాదా వస్తువు గానూ ఉండ గలదు. బంగారంతో, ఒక నగ గానీ, ఒక పాత్ర గానీ తయారైతే, అది మామూలు వస్తువే. దాని విలువ అయితే, అత్యధికమే. ఆ బంగారమే ఇతర వస్తువులతో మారేటప్పుడు, అది డబ్బే.

చలామణీలో మనం చూసే కాయితాల నోట్లే, నిజం డబ్బు కాదు. బంగారమే నిజం డబ్బు.
‘డబ్బు’ వస్తువుకి ఉండే ప్రత్యేకత ఏమిటి? దాన్ని ఇస్తే, ప్రపంచంలో ఉండే ఏ వస్తువు అయినా వస్తుంది. సాదా వస్తువుని ఇస్తే, ఆ మారకం జరగదు.

డబ్బు వస్తువుకి, ఏ ఇతర వస్తువుతో అయినా మారే హక్కు, ప్రధానంగా సమాజంలో ఏర్పడినదే.
‘డబ్బు’ ఎప్పుడు ఏర్పడింది? – మారకాల క్రమంలోనే ఏర్పడింది. ఈ విషయాన్ని, అర్థం చేసుకున్న వ్యక్తి మార్క్సు మాత్రమే. దీన్ని మార్క్సు రాసిన ‘కాపిటల్‌’ పుస్తకంలో, ”సరుకులూ – డబ్బూ” అనే మొట్ట మొదటి భాగంలో చూస్తాం.

‘సరుకుల్ని’ చెప్పడం, రకరకాల శ్రమల్ని చెప్పడం. ‘డబ్బు’ని చెప్పడం, సమాజానికి తెలియని కొత్త విషయాన్ని చెప్పడం!

ఒక వస్తువుని ఇచ్చి, రెండో వస్తువుని తీసుకుంటే, ఆ రెంటిలోనూ ఉన్న ప్రతీ వస్తువుకి మారకం విలువ, రెండో వస్తువే. ఇది, ‘మారకం విలువ’ అనే దానికి మొట్ట మొదటి రూపం (ఎలిమెంటరీ ఫామ్‌ఆఫ్‌ వాల్యూ).
మారకాలు, కేవలం రెండు రకాల వస్తువుల మధ్య జరగడమే కాకుండా, ఒక వస్తువు, తన విలువకి తగినట్టు, సమాజంలో ఉన్న ఏ వస్తువుతో నైనా మార గలిగే విధానం ప్రారంభమైతే, అది, ‘విస్తరించిన విలువ రూపం’ (ఎక్సాండెడ్‌ ఫామ్‌ ఆఫ్‌ వాల్యూ). వస్తువుల మారకాలు ఈ దశకి చేరే వరకూ, ‘డబ్బు’ అనే మాట పుట్ట లేదు. డబ్బు లేదు.

వస్తువుల మారకాలు రెండో రూపంలో సాగుతూ ఉన్న కాలం లోనే, ఏదైనా ఒక వస్తువు, ‘డబ్బు’గా ఏర్పడడం సాధ్యం.

ఒక వస్తువుని ఇచ్చి, ఏ ఇతర వస్తువుని అయినా తీసుకో గలిగే విధానం ప్రారంభమైతే, ఇతర వస్తువులన్నీ, ఏ వస్తువుతో మారగలవో, ఆ వస్తువే ‘డబ్బు’గా నిలబడే వస్తువు అవుతుంది. ఈ డబ్బుగా ఏర్పడే వస్తువుకి మార్క్సు పెట్టిన పేరు, ‘అన్ని వస్తువుల తోటీ సమానమైన వస్తువుగా, విలువ రూపంతో ఉండేది’ (జనరల్‌ ఈక్వివలెంట్‌ ఆఫ్‌ వాల్యూ) అని!

అప్పటి దాకా, ‘డబ్బు’ అంటే, మారకాలు జరగడానికి సాధనంగా ఉందని ఆర్థిక వేత్తలందరికీ తెలుసు. కానీ, డబ్బు ఏర్పడిన క్రమం ఎలా జరిగి ఉంటుందో, వాళ్ళు ఊహించనూ లేదు, మార్క్సు రాసిన దానిని చూడనూ లేదు.

‘కాపిటల్‌’ పుస్తకంలో, మార్క్సు రాసిన మొదటి భాగం నిజంగా అద్భుతమైనదే. గతంలో ఎవరూ చెప్పనిదే. కానీ, ఆ మొదటి భాగం ఎక్కువ మందికి అర్థం కాలేదని తేలింది. ఈ విషయం గురించి, రెండో జర్మన్‌ ముద్రణకు రాసిన ముందు మాటలో మార్క్సు ఇలా రాశాడు..

”1867లో నా మిత్రుడు కుగల్‌ మన్‌, ‘విలువ రూపాన్ని అర్ధం చేసుకోవాలంటే చాలా మంది పాఠకులకు ఇంకా తేలికైన వివరణలు అవసరం’ అన్నాడు… ‘సరుకుల చలామణీ’ చాప్టరులో, విలువ కొలత గురించి జాగ్రత్తగా తిరిగి రాశాను. ఎందుకంటే, మొదటి ముద్రణలో దాని మీద తగినంత శ్రద్ధ పెట్టకుండా రాశాను… ‘సరుకుల మాయ’ చాప్టరుని కూడా, చాలా మార్చాను.”

మొదటి ముద్రణని చూసి, దాన్ని రష్యన్‌ భాషలోకి అనువదించాలని, హెర్మన్‌ లొపోతిన్‌ అనే ఆయన మార్క్సుతో మాట్లాడినప్పుడు, మార్క్సు, ‘సరుకులూ-డబ్బూ’ అనే మొదటి భాగాన్ని ఇంకా తేలిగ్గా రాయాలను కుంటున్నానని చెప్పాడు. రష్యన్‌ అనువాదకుడు, ఆ మొదటి భాగాన్ని వదిలేసి, రెండో భాగం నుంచీ అనువాదం ప్రారంభించాడు.

నేను, ‘కాపిటల్‌’ని చదువుతూ ‘పరిచయం’ రాయడం ప్రారంభించినప్పుడు (1977లో), నాకు మొదటి భాగం కూడా, మొదట కంగారు పెట్టినా, క్రమంగా చక్కగానే అర్థం అయింది.

మారకాలు, ఎలా ప్రారంభమయ్యాయో, అవి మూడు రూపాలతో ఎలా సాగి ఉంటాయో, ‘డబ్బు’ ఎలా పుట్టిందో, పూర్తిగా అర్థమైంది.

మారకాల క్రమాన్ని, మొదటి దశ గానూ, రెండో దశ గానూ, చివరికి ‘డబ్బు’ ఏర్పడిన మూడో దశ గానూ, చక్కగానే అర్థం చేసుకోవచ్చు. కానీ, ‘కొందరు దీన్ని అర్థం చేసుకోలేక పోతున్నారు. మొదటి భాగాన్ని మారుస్తాను’ అని మార్క్సే అన్నాడు.

నేను, ఆ భాగాన్ని అర్థం చేసుకున్నాను గానీ, ప్రత్యేకించి చెప్ప వలిసిన 2, 3 వాక్యాలు ‘పరిచయం’లో రాయలేదు. ”మానవ సమాజంలో, డబ్బు అనేది, ప్రారంభం నుంచీ లేదు. వస్తువుల మధ్య మారకాలు ప్రారంభమైన క్రమంలో నుంచే డబ్బు ఏర్పడింది, అలా పుట్టుకొచ్చింది” అని స్పష్టంగా చెప్పాలి. అలా చెపితే, ఇక అర్థం కాకపోవడం జరగదు.

‘కాపిటల్‌ పరిచయం’ రాసే కాలంలో, నాకు ‘డబ్బు పుటక’ అర్థమైంది సరిగానే. అది, సమాజంలో ప్రారంభం నుంచీ ఉండదనీ, మారకాల క్రమంలోనే, సమస్త ఇతర వస్తువుల తోటి మారే వస్తువే (‘జనరల్‌ ఈక్వివలెంట్‌’) ‘డబ్బు’ అవుతుందనీ అర్థం అయింది. అయినా, ప్రత్యేకించి ఆ 2, 3 వాక్యాలు రాయవలిసింది.

సమాజాన్ని అర్థం చేసుకోవడంలో, శ్రమ సంబంధాల్నీ, డబ్బు సంబంధాల్నీ అర్థం చేసుకోవాలి.

ఇది శ్రమ దోపిడీ సంబంధాలదాకా వెళ్తుంది.
సమాజంలో ప్రతీ విషయమూ స్పష్టంగా తెలియడానికి డబ్బు లెక్కలు ఎంత అవసరమో, అంత అవసరం. కానీ, డబ్బుకి ఉన్న స్వభావం ఏమిటంటే, అది ఎంత మంచిదో, అంత చెడ్డది కూడా!

‘మారకం విలువ’, ఒక వస్తువు వంటి, ‘భౌతిక పదార్థం’ కాదు. ఆ ‘మారకం విలువ’ని కొలిచే డబ్బు లెక్కలూ, డబ్బు రాసీ, భౌతిక విషయాలు గానే కనపడినా, వాటిలో దగాలే, తప్పు లెక్కలే, అత్యధికం అయ్యే అవకాశాలెన్నో!

‘డబ్బు’ గురించి, మంచి చెడ్డలు చెప్పిన మార్క్సు, మానవ సమాజానికి ‘డబ్బు’ గురించి తెలిసిపోయి ఉంది కాబట్టి, ఇక సమాజం నడవడానికి శ్రమ సంబంధాలే అత్యవసరం గానీ, డబ్బు లెక్కలు అక్కరే లేదు.. అంటాడు. ప్రతి మనిషీ బాధ్యతగా శ్రమలు చేయడమూ, అవసరాలకు ఉత్పత్తుల్ని పొందడముగా ఉండవలిసిన సమానత్వాన్ని చెపుతాడు. అందుకే, ‘డబ్బు రద్దు’ని చెప్పాడు. మానవులు సుఖ సంతోషాలతో జీవించడానికి సమానత్వ శ్రమ సంబంధాలే ముఖ్యం గానీ, డబ్బు లెక్కలు ముఖ్యం కాదు. డబ్బు లేకుండా సమాజం నడవడం అసాధ్యం కాదు. పైగా అది సులభతరం కూడా.

బానిసలూ – యజమానులూ ఏర్పడిన కాలం నుంచీ ఈ నాటి వరకూ సాగుతూ ఉన్న సమాజం, ఇంకా ‘నిలుపు కోవలిసిన’ సమాజం కాదు.

మానవులు అనే జీవులకు తర్కాలు ఉండాలి. పక్షులకూ, జంతువులకూ ఉండే ప్రకృతి సహజత్వాలతో పాటు మానవ సంబంధాల సంస్కృతులు కూడా ఉండాలి.

Courtesy Nava Telangana

Leave a Reply