స్వతంత్ర జర్నలిజాన్ని చంపేందుకు బీజేపీ యత్నం

0
313

బతికించుకునే బాధ్యత ఇక ప్రజలదే…
ఫాయే డిసౌజా పిలుపు

హైదరాబాద్‌: ప్రజా వ్యతిరేక విధానాలను, అవినీతిని ప్రశ్నిస్తున్న స్వతంత్రమీడియాను చంపేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు యత్నిస్తున్నదనీ, దానిని బతికించుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని సీనియర్‌ పాత్రికేయురాలు ఫాయే డిసౌజా పిలుపునిచ్చారు. ఆలోచనాపరుల వేదిక మంథన్‌ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అధికారంలోకి వచ్చాక 2014 – 2019 వరకు రూ.5,600 కోట్లు ప్రజాధనాన్ని ప్రకటనలుగా ఇచ్చిందనీ, వీటిలో సింహభాగం బీజేపీ అనుకూల ప్రసారమాధ్యమాలకే వెళ్లాయని తెలిపారు. దీంతో లోపాలను ఎత్తిచూపుతున్న స్వతంత్ర మీడియా సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నదని తెలిపారు. ప్రపంచలోనే ఆకలితో బాధపడే చిన్నారులు భారతదేశంలో ఉన్నా, న్యూమోనియాతో చనిపోతున్నా, యెస్‌ బ్యాంకు సంక్షోభాన్ని రెండేండ్ల ముందే పరిష్కరించకుండా ఆర్బీఐ విఫలమైనా, ఎస్బీఐలో ప్రజాధనంతో యెస్‌ బ్యాంకును కాపాడాలని తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నా బీజేపీ మీడియాకు పట్టడం లేదని విమర్శించారు. అవి స్వామిభక్తితో వ్యవహరిస్తూ ప్రశ్నించలేని స్థితికి చేరుకున్నాయని అన్నారు. ఢిల్లీ అల్లర్లలో సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులపై మొదట దాడి జరిగితే అది చూపించని రిపబ్లిక్‌ టీవీ వారే దాడి చేసినట్టు పదే పదే చూపించిందనీ, అదే బాటలో మిగిలిన ప్రసారమాధ్యమాలు ఆయా సందర్భాల్లో వ్యవహరించాలని ఉటంకించారు.

స్వతంత్రంగా వ్యవహరించనీ, జవాబుదారీతనం లేని, మానవత్వం కోల్పోయిన, వాస్తవాలను చెప్పని మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీజేపీ మీడియా సెల్‌ నుంచి వచ్చే ఆదేశాలతో కట్టుకథలను, అబద్దాలను పదే పదే చూపించే ప్రసారం చేసి రెచ్చగొడుతున్న ప్రసారమాధ్యమాలతో దేశానికి ప్రమాదం పొంచి ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తున్న స్వతంత్ర మీడియాకు ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వకపోగా, బయటి నుంచి ఇచ్చే వారిని కూడా బెదిరింపులకు గురి చేస్తూ ఆర్థికంగా దెబ్బతీస్తున్నదని విమర్శించారు ఆయా రాష్ట్రాల్లోనూ మీడియా రెండుగా విభజింపబడి ఉందనీ, ప్రజలు ఏ మీడియా వెంట ఉంటారో తేల్చుకోవాల్సిన అవసరముందన్నారు. స్వతంత్ర మీడియా బతకకపోతే ఈ దేశం గాంధీ దేశంగా మిగలదని అభిప్రాయపడ్డారు.

Courtesy Nava telangana

Leave a Reply